Chandrayaan-3: చంద్రుడిపై ఇంత పెద్ద బిలముందా..? ప్రజ్ఞాన్ రోవర్ బయటపెట్టేసింది..!

అందమైన చందమామ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టిన చంద్రయాన్-3 మిషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. చంద్రుడికి సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని చంద్రయాన్-3 మిషన్ వెల్లడించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్కు సమీపంలో 160 కిలోమీటర్ల వెడల్పులో భారీ బిలం (పెద్ద గొయ్యి) ఉన్నట్లు సైన్స్ డైరెక్ట్ జర్నల్ పబ్లిష్ చేసింది. ప్రజ్ఞాన్ రోవర్ ఈ విషయాన్ని కనుగొన్నట్లు అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలను చంద్రయాన్-3 ఇప్పటికీ చేరవేస్తూ.. ‘‘చంద్రయాన్-3 ఆన్ డ్యూటీ’’ అనిపించుకుంటుంది.

 

ప్రజ్ఞాన్ రోవర్కు అమర్చిన ఆప్టికల్ కెమెరాలు ఈ భారీ బిలానికి సంబంధించిన ఫొటోలను తీశాయి. దీంతో ఆ బిలం ఆకారం ఎలా ఉందో ఆ ఫొటోలు స్పష్టం చేశాయి. ఈ ప్రాచీన బిలం ఆచూకీ బయటపడటం వల్ల చంద్రుడి భౌగోళిక చరిత్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి దక్షిణ ధ్రువం పైనే చక్కెర్లు కొడుతూ పరిశోధనలు సాగిస్తోంది. ఆ డేటాను మనకు చేరవేస్తోంది. 

ALSO READ | 2026 నాటికి మార్స్ పైకి మనుషులని పంపేందుకు : ఎలన్ మస్క్ ప్లాన్

చంద్రుడిపై నీటి జాడలు ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనలలో వెల్లడైన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై నిత్యం చీకట్లోనే ఉండే ప్రాంతంలో మంచు రూపంలో భారీ నీటి నిల్వలు ఉన్నట్లు అంతరిక్ష పరిశోధకులు కనుగొన్నారు. తాజాగా ఇటీవలి చంద్రయాన్‌‌‌‌-3 ప్రయోగంలోనూ రోవర్ నీటి జాడలను గుర్తించింది. అయితే, అసలు వాతావరణమే లేని చంద్రుడి ఉపరితలంపై నీరు ఎలా ఏర్పడిందనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ సైంటిస్టు కూడా సరైన వివరణ ఇవ్వలేకపోయారు. తాజా పరిశోధనలో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. 

చంద్రుడిపై నీరు ఏర్పడడానికి కారణం భూమిపై ఉన్న శక్తిమంతమైన ఎలక్ట్రాన్లేనని యూనివర్సిటీ ఆఫ్​ హవాయి శ్రాసవేత్తల పరిశోధనలో తేలింది. పరిశోధనలో భాగంగా మన దేశం గతంలో చేపట్టిన చంద్రయాన్‌‌‌‌–1 మిషన్లో సేకరించిన వివరాలను స్టడీ చేశారు. రిమోట్ సెన్సింగ్​ సమాచారాన్ని లోతుగా విశ్లేషించగా.. భూమిపై ఉన్న శక్తిమంతమైన ఎలక్ట్రాన్లు చంద్రుడి ఉపరితలంపై ఉన్న రాళ్లు, మినరల్స్ ను కరిగించి నీటి పుట్టుకకు కారణమై ఉంటాయని గుర్తించారు.