Health Alert: గుజరాత్​ లో చండీపుర  వైరస్​: ఐదు రోజుల్లో ....ఆరుగురు చిన్నారులు మృతి

వర్షాకాలం వచ్చేసింది. వస్తూనే  వైరస్​లను కూడా వెంటబెట్టుకొని వచ్చింది.  గుజరాత్​ లో  చండీపుర వైరస్​ చెలరేగిపోతుంది.  ఐదురోజుల్లో ఆరుగురు చిన్నారులను పొట్టన పెట్టుకుంది.  ఇంకా 12 మంది ఈ వైరస్​ సోకి బాధపడుతున్నారు.  అసలు చండీపుర వైరస్​ తొలిసారిగా ఎక్కడ పుట్టింది.. ఆ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది.. లక్షణాలు ఏంటి.. నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం.  

అత్యంత ప్రమాదకరమైన చండీపుర వైరస్‌ గుజరాత్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి 5 రోజుల్లో ఆరుగురు చిన్నారులు చనిపోయారు. చండీపుర వైరస్‌‌కు సంబంధించి మరో 12 కేసులు నమోదయ్యాయని  ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రిషికేష్ పటేల్ వెల్లడించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు రాజస్థాన్ కు చెందిన వాళ్లు ఉండగా, మరొకరు మధ్యప్రదేశ్‌కు చెందినవారని ఆయన వెల్లడించారు.. ఈ డేంజరస్ వైరస్ కట్టడికి అధికారులు చర్యలు వేగవంతం చేశారు.

ఒకే హాస్పిటల్లో ఆరుగురు మృతి

చండీపుర వైరస్‌తో ఇప్పటి వరకు ఆరుగురు చిన్నారులు  చనిపోయారు. వారిలో ఐదుగురు చిన్నారులు  సబరకాంత జిల్లాలోని హిమంతనగర్ సివిల్ ఆసుపత్రిలో మృతి చెందారు. చండీపుర వైరస్‌ నిర్థారణ కోసం మరో 12 మంది శాంపిల్స్ పుణేలోని నేషనల్ వైరాలజీ ఇనిస్టిట్యూట్ కు పంపించారు. హిమంతనగర్ హాస్పిటల్లో చనిపోయిన నలుగురు చిన్నారులకు చండీపురా వైరస్ సోకి ఉంటుందని అక్కడి డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.  చండీపుర వైరస్‌ అంటువ్యాధి కాదని, వైరస్ కంట్రోల్ చేసేందుకు అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు.  వైరస్ ప్రబలకుండా ఆరోగ్యశాఖ అధికారులు 24 గంటలూ పనిచేస్తున్నట్టు వివరించారు.

1965లో తొలిసారి మహారాష్ట్రలోని చండీపురలో గుర్తింపు

చండీపుర వెసిక్యులోవైరస్‌నే ..చండీపుర వైరస్ (సీహెచ్‌పీవీ)గా పిలుస్తారు. ఈ వైరస్ రాబ్డోవిరిడే కుటుంబానికి చెందినది. మహారాష్ట్రలోని చండీపురలో 1965లో దీనిని తొలిసారి గుర్తించారు. అందుకనే దీనికాపేరు వచ్చింది. దీనిబారిన పడిన చిన్నారుల్లో తీవ్రమైన మెదడువాపు (ఏన్సెఫలైటిస్) వస్తుంది. దోమలు, పేలు, ఇసుక ఈగల ద్వారా వ్యాపిస్తుంది.  ఈ వైరస్ వెసిక్యులర్ స్టోమాటిటిస్, రేబిస్‌కు కారణమయ్యే వైరస్‌ లతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటుంది. 2003–-04 సంవత్సరాల్లో ఈ వైరస్ కరాళనృత్యం చేసింది. ఏకంగా 322 మంది పిల్లలను బలి తీసుకుంది.  

లక్షణాలు

చండీపురా వైరస్ అనేది దోమలు, పేలు, ఈగల ద్వారా వ్యాపిస్తుంది. 9 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అకస్మాత్తుగా దీని లక్షణాలు కనిపించి త్వరగా పెరుగుతాయి. అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు వంటివి కనిపిస్తాయి. ఈ వైరస్ సోకినవారు కొన్నిసార్లు కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా పిల్లలు ఎక్కవగా దీనిబారిన పడే అవకాశం ఉంది. కాబట్టి లక్షణాలు కనిపించగానే గుర్తించి చికిత్స అందించడం ద్వారా బయటపడొచ్చు.

చండీపురా వైరస్ సోకిన వారికి అందించే చికిత్స

నిజానికి చండీపురా వైరస్ నిర్మూలనకు నిర్దిష్ట యాంటీ వైరల్ చికిత్స లేదు. రోగిలోని లక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు. అందుకే, ఈ వైరస్ సోకిన తర్వాత ఇబ్బంది పడటం కంటే ముందే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో ప్రధానంగా ఈగలు, దోమలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మంచి పోషకాహారం, పరిశుభ్రత, ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం అంటున్నారు.