మే 5  నుంచి భారీ  వర్షాలు పడే చాన్స్

  • అప్రమత్తంగా ఉండాలని అధికారులకు  ఆదేశాలు 

కామారెడ్డి టౌన్​, వెలుగు: రాబోయే మూడు రోజుల్లో కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఈ నేపథ్యంలో ఆఫీసర్లు అలర్టుగా ఉండాలని అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ సూచించారు. రెవెన్యూ, సివిల్ సప్లయ్ ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  5 నుంచి 7 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ధాన్యం కొనుగోలు సెంటర్లలో వడ్లు తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆఫీసర్లకు సూచించారు.   రైతులు ఇబ్బందులు పడకుండా టార్పాలిన్లు, గోనె సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. సెంటర్ల నుంచి మిల్లులకు వడ్లు తరలించేందుకు అవసరమైన లారీలను రెడీగా ఉంచాలని అధికారులకు తెలిపారు.  సెంటర్లకు వచ్చిన వడ్లను వెంటనే కాంట పెట్టి మిల్లులకు పంపాలన్నారు.  రైతులు అధైర్యపడొద్దన్నారు.  డీఎస్‌వో  మల్లికార్జున బాబు,  డీఎం నిత్యానందం, ఆఫీసర్లు పాల్గొన్నారు.