దేశ భద్రతకు సైబర్​ సవాల్​

దేశంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.  రోజుకో కొత్త తరహాలో నేరగాళ్లు సైబర్ వల విసిరి అమాయకులను దోచేస్తున్నారు. గత ఐదేండ్లలో 44,599 సైబర్​ మోసాల సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. సుమారు రూ.2,137 కోట్లు కొల్లగొట్టినట్టు పోలీసు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023–-24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది. 29 వేలకు మించిన సైబర్​ క్రైమ్స్​ జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి. 1,457 కోట్ల రూపాయలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. 2019-–20  ఆర్థిక సంవత్సరం నుంచి 2023-–24 ఆర్థిక సంవత్సరం వరకూ 2,137 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈ మొత్తంలో రికవరీ అయింది కేవలం రూ.184 కోట్లు.  మోసాలు చేయడానికి  క్రెడిట్, డెబిట్ కార్డులు కూడా ఉపయోగించినట్టు తేలింది.

అదేవిధంగా ఇంటర్​నెట్ బ్యాంకింగ్ ద్వారా నేరగాళ్లు సులువుగా మోస గిస్తున్న విధానాలు వెలుగులోకి వచ్చాయి.  సైబర్ నేరాలు ఎక్కువ శాతం హరియాణా, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర , ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి.   ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల డీపీలు ఉపయోగించి డబ్బు డిమాండ్ చేస్తున్నారు.  ఖాతాదారుల ప్రమేయం లేకుండానే బ్యాంకు అకౌంట్ల నుంచి కోట్లాది రూపాయలు అపరిచితుల ఖాతాలకు బదిలీ అవుతున్నాయి. కొరియర్ పార్సిల్​లో డ్రగ్స్ ప్యాకెట్లు వచ్చాయని చెప్పి బెదిరించి సొమ్ము గుంజే ప్రయత్నం చేస్తున్నారు.

రోజుకో కొత్త ప్రయోగం చేస్తూ  పోలీసులమని చెప్పి బెదిరించి సొమ్ము దోపిడీ చేస్తున్న సంఘటనలు ఎక్కువైపోయాయి.  సీబీఐ అధికారులమని, ఈడీ, కస్టమ్స్ అధికారులమనీ ఫోన్ చేసి మరికొందరు బెదిరిస్తున్నారు.  నిజమైన అధికారులు, కేటుగాళ్ల మధ్య వ్యత్యాసం తెలుసుకునే అవకాశం ఇవ్వకుండానే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి  గిలగిలా కొట్టుకునే పరిస్థితులు సర్వత్రా  కనపడుతున్నాయి.

ఇంటర్​నెట్​ కేంద్రంగా సైబర్​ క్రైమ్స్​

అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ ద్వారా సకల సేవలూ పొందే అవకాశం ఇంటర్​నెట్ కల్పించింది.  వస్తువుల కొనుగోలు నుంచి డబ్బు చెల్లింపు వరకూ ఉన్నచోటు నుంచే  అన్ని పనులను పూర్తిచేసే వెసులుబాటు ఉంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే ఇంటర్నెట్ సైబర్ నేరాలకు కేంద్రంగా మారిందని అవగతమవుతుంది. రోజుకో కొత్త తరహాలో మోసం చేయడానికి తయారవుతున్నారు మోసగాళ్లు. బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బు మాయం చేయడం వారికి చాలా సులువైపోయింది.

ఉద్యోగాల పేరిట యువతను మోసగించి వారితో సైబర్ నేరాలు చేయిస్తున్న  కాంబోడియా ముఠాల వ్యవహారం బయటపడింది.  కాగా, ఇప్పటి వరకూ ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాలవారే ఈ తరహా మోసాలు చేయడానికి పూనుకునేవారు.  ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఆ జాబితాలోకి  కొత్త రాష్ట్రాలు చేరుతున్నాయి.  తాజాగా తెలంగాణ రాజధాని  హైదరాబాద్​లో కూడా సైబర్ నేరాలు చేస్తూ పలువురు నేరగాళ్లు పోలీసులకు చిక్కారు.  ఒక్క తెలంగాణలోనే  ఏడాదికి 1800 కోట్ల రూపాయల సొమ్మును దోచేశారు.  సాంకేతిక విజ్ఞాన వినియోగం ఎక్కువగా ఉన్న హైదరాబాద్​లో ఈ తరహా భారీ లూటీజరుగుతోందని సైబర్​సెల్​ గణాంకాలువెల్లడిస్తున్నాయి. 

సైబర్ నేరాలతో దేశాభివృద్ధికి విఘాతం

సైబర్ నేరాలు దేశాభివృద్ధిని, ప్రగతిని దెబ్బతీస్తాయి.  సైబర్​ నేరగాళ్ల​ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన వారికి న్యాయ సహాయం అందించవలసిన అవసరం ఉందని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన 'సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్'లో పేర్కొన్నారు. సైబర్ నేరాల ముప్పును ఎదుర్కొనడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  సునాయాసంగా డబ్బు సంపాదించేందుకు సైబర్​ నేరగాళ్లు సాంకేతికంగా నిష్ణాతులుగా మారి  దేశభద్రతకు సైతం సవాళ్లు విసురుతున్నారు.  వీరిలో కొంతమంది హ్యాకర్లుగా మారుతున్నారు.  వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం  నేరాలకు పాల్పడుతున్నారు.

అయితే,  ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల  నేరాలకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుందని పలువురు పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. సైబర్ నేరాల పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. కాగా, పొరుగు రాష్ట్రం ఏపీలో మహిళా పోలీసులను సైబర్ కమాండోలుగా ఏర్పాటు చేశారు.  కాలేజ్​ స్టూడెంట్లకు సైతం అవగాహన కల్పించి వారిలో ఆసక్తి ఉన్నవారిని సైబర్ సోల్జర్స్​గా తయారుచేసి మంచి ఫలితాలు రాబట్టగలిగామని అధికారులు తెలిపారు.

- జి. యోగేశ్వరరావు, 
సీనియర్ జర్నలిస్ట్