నూతన విద్యావిధానం ముందున్న సవాళ్లు

బ్రిటిష్ వారి కాలంలో ప్రవేశపెట్టిన ‘మెకాలే బేస్డ్ విద్యా విధానం’ ఎంతమేరకు సఫలీకృతమైందన్నది పక్కనపెడితే బ్రిటిష్ వారి స్వార్ధం, స్వలాభం ఈ విద్యా విధానం ద్వారా నెరవేరిందని చెప్పాలి. ఇక దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి దేశ జనాభా సుమారు 28 కోట్లు. అక్షరాస్యత శాతం 14% అంటే దీనిని బట్టి ఆంగ్ల విద్యా విధానం ఎంతమందికి అందుబాటులో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.  అధికార మార్పిడి జరిగిన తర్వాత మనకు మనం స్వతంత్రంగా పాలనాపరమైన అడుగులు వేయడానికి,   అస్తవ్యస్తంగా ఉన్న విద్యా విధానాలు, వ్యవస్థను గాడిన పెట్టడానికి నెహ్రూలాంటి మేధావికి, వారి మంత్రివర్గంలో ఉన్న వారందరికీ కత్తి మీద సాములా మారింది. ముఖ్యంగా దేశంలో అనేక రకాల సమస్యలు వాటి నుండి బయటపడటానికి, సంక్షోభం నుంచి సమస్య పరిష్కారం వైపు చాలా సుదీర్ఘమైన ప్రయాణమే చేయాల్సి వచ్చింది.  లౌకికపరమైన విద్యా విధానాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే రాజ్యాంగంలోని ఆర్టికల్​45  బాలబాలికలకు  ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని సూచించింది.

మాతృభాషకు ప్రాధాన్యం మంచి పరిణామం

అలాగే ‘విద్య’ ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల రాష్ట్రాలకు నిధులు ఇస్తూనే కొంత స్వేచ్ఛను కూడా విద్యాసంస్థల విషయంలో ఇవ్వటం జరిగింది. బ్రిటిష్ వారి కాలంలోనే క్రైస్తవ మిషనరీలు, మదర్సాలు, గురుకులాలు ఉండటం వల్ల ఈ అస్తవ్యస్తంగా ఉన్న విద్యా విధానాన్ని ఒకే గొడుగు క్రిందకు తీసుకొనిరావాలన్న ఉద్దేశ్యంతోనే ‘సార్వత్రిక విద్యా విధానానికి’ (Universal Education) అంకురార్పణ చేశారు. కానీ, మత సంస్థలకు, మతానికి సంబంధించిన విద్యా సంస్థలకు కూడా రాజ్యాంగంలో అవకాశం కల్పించటంతో ‘కామన్ స్కూల్’ విధానం కాస్తా అప్పుడే పక్కదారి పట్టిందేమో అనేది నా అభిప్రాయం. అదికాస్తా  క్రమక్రమంగా శాఖోపశాఖలుగా విస్తరించి నేడు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లి విద్యా విలువలు వ్యాపారరంగు పులుముకోవటం, మతరంగు పులుముకోవటం ప్రారంభమైంది.  ఫలితంగానే విద్యా విలువల పతనం నాటి నుంచే  ప్రారంభమైంది. అంతెందుకు మన తెలుగు రాష్ట్రాలలోనే మన మాతృ భాష స్థానం ఏమిటో ఆత్మ విమర్శ చేసుకుంటే దేశ ముఖచిత్రం సృష్టంగా అవగతం అవుతుంది. రానురాను ఆంగ్ల భాషా ప్రాబల్యం పెరిగిపోవటం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ఆంగ్ల భాషలో పట్టు సాధించినవారికే ఉండటం వల్ల మాతృభాషలు క్షీణించే పరిస్థితికి చేరాయి. కానీ, నూతన విద్యా విధానం మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించటం మంచి పరిణామమే. దీనిని పకడ్బందీగా అమలు చేయాలి.
 
 బాలికల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి

 ప్రభుత్వం బాలికల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు,  ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి మహిళా టీచర్లను నియమించాలి. అదేవిధంగా సార్వత్రిక నమోదు (Universal Enrolment) బడికి దూరంగా (Dropout) ఉన్నవారిని గుర్తించి నమోదు చేసుకోవాలి.  సార్వత్రిక నిలుపుదల (Universal Retension) బడిలో చేరిన పిల్లలందరూ ప్రాథమిక విద్యను పూర్తిచేసే వరకు పాఠశాలలోనే విద్యనూ అభ్యసించేలా ప్రోత్సహించటం, నిరంతరం పర్యవేక్షించటం, మెరుగైన సౌకర్యాలు కల్పించటంలాంటివి చేయాలి. అలాగే సార్వత్రిక సాధన (Universal Achievement) పాఠశాలలో చేరిన పిల్లలందరూ ఆశించిన కనీస ‘అభ్యసనా సామర్థ్యాలు’  (Minimum Level Of Learning) సాధిస్తున్నారా లేదా అనేది పరిశీలించాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) ప్రస్తుతం  అమలులో ఉంది. కానీ, ఇది పెద్దగా విజయం సాధించిన దాఖలాలు లేవు. దేశవ్యాప్తంగా ఇటీవలే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం 14-–18 సం.ల మధ్య వయసున్న  విద్యార్థుల్లో విద్యకు సంబంధించిన పునాది నేటికి బలహీనంగా ఉందని తేల్చటం ఆశ్చర్యం కల్గించే అంశం. ఈ నివేదిక ప్రకారం 14-–18 సం.రాల మధ్య వయస్సున్న వారిలో కేవలం 73.6% మంది పిల్లలు మాత్రమే స్టాండర్డ్ స్థాయి – 2 పుస్తకాన్ని చదువగలుగుతున్నారు. గణితంలో కేవలం 45% మందికే ప్రాథమిక నైపుణ్యం ఉందనేది ఆ నివేదిక సారాంశం. 

పట్టభద్రుల్లో పరిమిత నైపుణ్యం

విద్యావంతులైన వారందరికి ఉద్యోగాలు, సరైన ఉపాధి అవకాశాలు లభించటం లేదనేది, కేవలం 45% మంది చదువుకున్న యువత వారి నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగాలు చేస్తున్నారని ‘మెర్సర్ మెటిల్’ సంస్థ వెల్లడించటం మన విద్యా విధానంలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంది. ఇది కూడా త్వరలో అమలు చేయబోయే నూతన విద్య విధానానికి పెను సవాల్ విసరనుంది. గత  ఏప్రిల్​లో విడుదలైన బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం మనదేశంలో విద్యనభ్యసించిన పట్టభద్రుల్లో నైపుణ్యం పరిమితంగా ఉండటమో, లేక పూర్తిగా లేకపోవటం వల్ల నిరుద్యోగిత శాతం పెరుగుతోందని వెల్లడించింది. మరొక విచిత్రమైన అంశం ఏమిటంటే చదివిన  డిగ్రీకి చేస్తున్న ఉద్యోగానికి  సంబంధం లేకపోవటం ఆశ్చర్యకరమైన విషయం. దీని నివారణకు నూతన విద్యా విధానంలో చర్యలు  చేపట్టాలి. ఇక ఉన్నత పాఠశాల స్థాయిలో ఆంగ్ల మాధ్యమాన్ని పటిష్ఠం చేస్తూనే ‘ప్రాజెక్ట్ బేస్డ్ విద్యా వ్యవస్థను’ ప్రోత్సహించి పిల్లలను సెమిస్టర్ విధానం వైపు మల్లించాలి. ఎలాగు నూతన విద్యా విధానంలోకి (5+3+3+4) మన విద్యా విధానం 
మారబోతున్నందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విద్యా గ్రాంట్లు, నిధులు ఎక్కువ కేటాయించి పాఠశాలల్లో, కళాశాలల్లో, అలాగే విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాల టీచింగ్, నాన్ టీచింగ్ ఇతర సౌకర్యాల కొరతను నివారించడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టి  దేశవ్యాప్తంగా ఒకే రకమైన విద్యా విధానాన్ని (Common School System) ప్రవేశపెట్టాలి. ఇది ఆచరణాత్మకంగా అమలు జరిగేలాగా కేంద్రం రాష్ట్రాలు  ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలన్ని ఒకే రకమైన విద్యా విధానం అన్ని తరగతులవారికి ఉండేలా ప్రోత్సహించాలి. తరగతి గది అంటే విద్యార్థుల ప్రపంచంగా పిల్లలు భావించేలా ఏర్పాట్లు చేయాలి. తరగతి గది అంటే మానసిక ఒత్తిడితో కూడినదనే భావన విద్యార్థులలోంచి తొలగించాలి.

35శాతం మహిళలు విద్యకు దూరం

ఆర్టికల్​ 46 .. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు (SC, ST) విద్యా విషయంలో ఆర్థిక ప్రయోజనాలు చదువుకోవడానికి కల్పించటందీని ద్వారా ‘సామాజిక న్యాయం’  విద్యా విషయంలో వారిలో వెనుకబాటుతనంను దూరం చేయొచ్చన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలావరకు సఫలీకృతం అయింది, కానీ, నేటికి కొంతమంది చదువుకు దూరంగా ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయ్, వీరి విషయంలో కూడా విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​’ వేళ దేశంలోని స్త్రీలకు విద్యావకాశాలు నేటికి కొంతమందికి అందని ద్రాక్షలాగే ఉన్నాయంటే ఎవరైనా నమ్మగలరా? మన ప్రాచీన సంస్కృతి స్త్రీ విద్యను నిషేధించటం వల్ల దీనిపై  స్త్రీలు, మేధావులు పెద్ద ఎత్తున పోరాటమే చేయాల్సి వచ్చింది. అంతెందుకు 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీల సగటు అక్షరాస్యత శాతం 65.46%  అంటే దేశ జనాభాలో సుమారు 35% మంది మహిళలు విద్యకు దూరంగానే ఉన్నారనేది బహిరంగ రహస్యమే.    ఇది నూతన విద్యా విధానానికి అతిపెద్ద సవాలుగా మారనుంది. తరగతి గదికి దూరంగావున్న బాలికలను గుర్తించటం, నమోదు చేసుకోవటం, వారికి విద్యా సదుపాయాలు కల్పించటం అతిపెద్ద సవాల్.  బాలికలు ఉన్నత చదువులు చదివేవరకు అన్ని సదుపాయాలూ కల్పిస్తే కొంతమేర మంచి ఫలితాలు రాబట్టవచ్చు. 

- డా. మహ్మద్ హసన్​
ఎడ్యుకేషనల్​ ఎక్స్​పర్ట్​