పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయాలి

  • పంచాయతీ రాజ్​ ద్వారా మంజూరైన ప్రతి జీపీ బిల్డింగ్​ను పూర్తి చేయాలె
  •  కుటీర పరిశ్రమల స్థాపనపై యూత్​కు అవగాహన కల్పించాలె
  • దిశ కమిటీ చైర్​పర్సన్​, మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణ

మహబూబ్​నగర్​, వెలుగు: పాలమూరు జిల్లా అభివృద్ధిని టార్గెట్​గా పెట్టుకొని ఆఫీసర్లు పని చేయాలని జిల్లా అభివృద్ధి సయన్వయ, పర్యవేక్షణ కమిటీ దిశ చైర్​పర్సన్​, మహబూబ్​నగర్​ ఎంపీ డీకే అరుణ చెప్పారు. మహబూబ్​నగర్​ కలెక్టరేట్‌‌లోని ఐడాక్​లో శనివారం ఉదయం దిశ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్​ విజయేందిర బోయితో పాటు మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలవుతున్న స్కీములను క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు.  ప్రతి మూడు నెలలకోసారి దిశ సమావేశం నిర్వహించాలన్నారు. వచ్చే సమావేశం జనవరిలో ఉంటుందన్నారు. సమావేశంలో ఆయా స్కీముల్లో సాధించిన ప్రగతిపై సమీక్ష చేస్తామన్నారు. 

రివ్యూ సాగిందిలా..

బ్యాంకర్లు చైతన్య సదస్సులు నిర్వహించాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. ఆన్​లైన్​లో అప్లికేషన్​లో ఎలా చేయాలనే విషయాలపై పబ్లిక్​కు అవగాహన కల్పించాలన్నారు.

బీఎస్​ఎన్​ఎల్​ నెట్ వర్క్ సరిగ్గా లేదని, ఈ నెట్​వర్క్​ నుంచి ఇతర నెట్ వర్క్ కు ప్రజలు మారుతున్నారన్నారు. గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో నెట్ వర్క్ ను మెరుగుపర్చాలన్నారు.

డీఆర్​డీవో ద్వారా కొత్త పింఛన్​ అప్లికేషన్​ల గురించి ఎంపీ ఆరా తీశారు. అప్లికేషన్​లను ఎంపీడీవోలు తీసుకుంటున్నారని డీఆర్​డీవో సమాధానమిచ్చారు. ప్రభుత్వం లాగిన్ ఓపెన్ చేస్తే ఎంట్రీ చేయడానికి ఆప్షన్ ఉంటుందన్నారు.

పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ప్రతి జీపీ (గ్రామ పంచాయతీ) భవనం నిర్మించాలని ఎంపీ కోరారు. దీనిపై ఆ శాఖ ఈఈ మాట్లాడుతూ.. జిల్లాకు 212 జీపీ భవనాలు సాంక్షన్ కాగా.. ఇంకా 38 చోట్ల అటవీ, భూ సమస్య కారణంగా ప్రారంభించలేదని వివరించారు. 

పల్లెల్లో కుటీర పరిశ్రమలు నెలకొల్పటానికి ప్రతి మండలంలో ఎంపీడీవోల సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి దొరుకుతుందని చెప్పారు.

జిల్లాలో ఉద్యానశాఖకు సంబంధించి క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం కింద మామిడి తోటల దిగుబడి, ఉత్పత్తి, ఎగుమతి చేసేందుకు జిల్లాను కేంద్రం ఎంపిక చేసిందని ఎంపీ తెలిపారు. 

విద్యా శాఖ ద్వారా కస్తూర్బా విద్యాలయాల్లో ఇంకా ఇంటర్ వరకు అప్​గ్రేడ్​ చేయని వాటిని త్వరలో అప్​గ్రేడ్​ చేయాలన్నారు.
వ్యవసాయ శాఖ కు సంబంధించి కొన్ని స్కీములు ఫండ్స్​ రాక ఆగిపోయినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కారణాలు వచ్చే సమావేశంలో పూర్తి స్థాయిలో సమాచారం అందించాలని ఎంపీ అగ్రికల్చర్​ ఆఫీసర్లను ఆదేశించారు.

ప్రతి స్కీము సమాచారం అందించాలి

మహబూబ్​నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు సంబంధించి కొత్తగా ఏ స్కీము ప్రారంభమైనా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు తప్పకుండా సమాచారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వపరంగా వచ్చే స్కీములకు శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నా విధిగా సమాచారం అందిచాలన్నారు.  ముద్ర లోన్లు ఎందుకు సరిగ్గా ఇవ్వడం లేదని ఆఫీసర్లను ప్రశ్నించారు. ముద్ర స్కీం ముఖ్య ఉద్దేశం పూర్తిగా  పక్కదారి పడుతోందని ఆఫీసర్లపై మండిపడ్డారు.

ఈ స్కీం పేద, మధ్యతరగతి మహిళలకు, వీధి వ్యాపారులకు, ఎలాంటి ఆధారం లేని వారి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.  మహబూబ్​నగర్​లో ఎంత మందికి ఈ స్కీమును వర్తింపజేశారని ఆయన ప్రశ్నించారు. అగ్రికల్చర్​, రేషన్ షాపులు, వైద్యారోగ్య శాఖ, విద్యా శాఖ, ఇరిగేషన్,  ఫారెస్ట్, కో ఆపరేటివ్, బ్యాంకు, ఉద్యాన శాఖ, పరిశ్రమలు, చేనేత శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి, మున్సిపాలిటీలలో అమృత్ స్కీం, గిరిజన సంక్షేమం, ఆర్​అండ్​బీ, నేషనల్​ హైవేస్​, బీఎస్​ఎన్​ఎల్​, పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమం, విద్యుత్ శాఖలపై రివ్యూ చేశారు.