రెండేండ్లుగా.. చైర్మన్​ కుర్చీ ఖాళీ

  • కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఖాళీగానే ఏనుమాముల మార్కెట్​ కమిటీ చైర్మన్ పదవి
  • పత్తి విక్రయ సీజన్ కావడంతో తరలొస్తున్న రైతులు
  • ధరలు, కాంటాల సమస్యతో నిత్యం రైతుల ఆందోళనలు
  • తమ అనుచరులకు చైర్మన్​గిరి కోసం ఎమ్మెల్యేల ప్రయత్నం

వరంగల్, వెలుగు: ఆసియాలోనే రెండో అతిపెద్ద ఏనుమాముల మార్కెట్ చైర్మన్ పీఠం ఖాళీగా ఉంది. గతేడాది బీఆర్ఎస్​ ప్రభుత్వంలో ఈ కుర్చీ కోసం ఎమ్మెల్యేల మధ్య కాంపిటీషన్ నడిచింది. ప్రభుత్వం పడిపోవడంతో కారు పార్టీ నేతల ఆశలు ఆవిరయ్యాయి. కాగా, మరో కొద్దిరోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా, ఏనుమాముల చైర్మన్ పదవిలో ఎవరినీ నియమించలేదు. 

నిన్నమొన్నటి వరకు మిర్చి పంటతో నిండిన మార్కెట్, ఇప్పుడు పత్తి సీజన్ కావడంతో తెల్ల బంగారం బస్తాలతో కళకళలాడుతోంది. ఈ సమయంలో పంటకు సరైన ధర కేటాయించట్లేదని, తూకంలో మోసాలు, తేమ పేరుతో దోపిడీ అంటూ రైతులు నిత్యం ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు అనుచరులకే చైర్మన్ పీఠం దక్కేలా పలువురు ఎమ్మెల్యేలు హైకమాండ్ వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు.

మార్కెట్ పాలకమండలి లేక రెండేడ్లు..

రెండేండ్లుగా ఏనుమాముల మార్కెట్ కమిటీ పాలకవర్గం ఖాళీగానే ఉంది. అప్పటి చైర్మన్ దిడ్డి భాగ్యలక్ష్మితో కూడిన పాలకమండలి పదవీకాలం 2022 ఆగస్టు 18న ముగిసింది. అప్పటి నుంచి సమస్యల పరిష్కారానికి రైతులు, జీతాల కోసం ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఇతర మార్కెట్ల నుంచి జీతాల కోసం నిధులు తీసుకువచ్చారు. 

సమస్య అలానే ఉండడంతో చెక్కులపై సంతకాలు చేసేందుకు మరో మూడు నెలలు ఎక్స్​టెన్షన్ కల్పించారు కానీ, పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. అప్పటి ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి తమ అనుచరులకు చైర్మన్​గిరి కట్టబెట్టేందుకు పోటీ పడడంతో అప్పటి ప్రభుత్వం కొంత గడువు తీసుకుంది. అంతలోనే ఎలక్షన్ కోడ్ రావడంతో చైర్మన్ పీఠం ఖాళీగానే ఉంది. 

ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య పోటీ..

ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్మన్, డైరెక్టర్ పోస్టుల కోసం హస్తం పార్టీ ఎమ్మెల్యేల మధ్య పోటీ నెలకొంది. గతంలో మార్కెట్ పరిధి వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలో ఉండడంతో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్​రెడ్డి అనుచరులు మార్కెట్​ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమవారికే చైర్మన్ పదవి దక్కేలా ఎమ్మెల్యేలు సైతం హైకమాండ్ వద్ద ముందస్తుగా పోటీ పడ్తున్నారు.

చైర్మన్ రిజర్వేషన్​పై టెన్షన్​

ఈసారి మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ రిజర్వేషన్ వారికి కేటాయిస్తారనేదానిపై ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్​ రెండో టర్ములో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరుడు కొంపెళ్లి ధర్మరాజుకు చైర్మన్ పదవి దక్కగా, అతడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆపై ధర్మారెడ్డి మరో అనుచరుడు చింతం సదానందానికి అవకాశం ఇప్పించాడు. ఆయన పదవీకాలం ముగిశాక వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆప్తుడు, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి భార్య దిడ్డి భాగ్యలక్ష్మికి చైర్మన్ పోస్ట్ కట్టబెట్టారు.

 ఆమె పాలకవర్గం ముగిశాక రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ మహిళకు కేటాయించాల్సి ఉందని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ ప్రయత్నం చేసినా, బీఆర్ఎస్ ఓటమితో అవకాశం దక్కలేదు. కాగా, ప్రస్తుతం ఎస్సీ మహిళకు అవకాశం కల్పిస్తారా లేదంటే కులగణన ఆధారంగా రిజర్వేషన్ మారుస్తారా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ ఏదైనా తమ అనుచరులకే పీఠం దక్కేలా హస్తం పార్టీ ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు.

వ్యాపారుల తీరుతో పత్తి రైతుల గోస..

ప్రస్తుతం పత్తి సీజన్ నడుస్తుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు ఖమ్మం, కరీంనగర్, నల్గొండతోపాటు ఇతర ప్రాంతాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ఏనుమాముల మార్కెట్​కు తరలొస్తున్నారు. నిత్యం టన్నులకొద్ది పత్తి బస్తాలు వస్తుండడంతో మార్కెట్ యార్డు తెల్ల బంగారంతో కళకళలాడుతోంది. గతంలో రూ.11 వేలు, పోయినేడాది కష్టకాలంలో కూడా రూ.8,600  క్వింటాల్ పలికిన పత్తి ధర, ఇప్పుడు రూ.6 వేల నుంచి రూ.7 వేలు మాత్రమే చెల్లించడంపై మండిపడుతున్నారు. 

వ్యాపారులు సిండికేట్​గా మారి పత్తి రంగు మార్పు, తేమ శాతాన్ని ఎక్కువగా చూపించి రైతుల నడ్డివిరుస్తున్నారంటూ ధర్నాలకు దిగుతున్నారు. కాంటాల్లో మోసాలు జరుగున్నా అధికారులు పూర్తిస్థాయిలో పట్టించుకోవడంలేదంటున్నారు. సమస్యలపై చర్చించడానికి మార్కెట్ పాలకవర్గం లేకపోవడంతో పంట విక్రయించడానికి వచ్చిన తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.