కులగణన రిపోర్టు వచ్చిన రెండు వారాల్లో...బీసీ రిజర్వేషన్లపై నివేదిక : వెంకటేశ్వర్‌‌రావు 

  • బీసీ డెడికేటెడ్  కమిషన్  చైర్మన్  వెంకటేశ్వర్‌‌రావు 

కరీంనగర్, వెలుగు: కులగణన సర్వే రిపోర్టు ప్రభుత్వానికి అందిన రెండు వారాల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్  ఎలా ఉండాలనే అంశంపై నివేదికను అందిస్తామని బీసీ డెడికేటెడ్  కమిషన్  చైర్మన్  బూసాని వెంకటేశ్వర్ రావు తెలిపారు. రాష్ట్రంలో వివిధ సంఘాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో శనివారం ఉమ్మడి జిల్లా బీసీ సంఘాల ప్రతినిధులు, కులస్తుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. వివిధ కుల సంఘాల ప్రతినిధులు, నాయకులు చైర్మన్ కు 25 వినతిపత్రాలు అందాయి.

తమలో ఉన్న ఐదు కులాలను ఒకటిగానే పరిగణించాలని విశ్వబ్రాహ్మణ సంఘం, ఈడబ్ల్యూఎస్  రిజర్వేషన్  కోటాతో తాము తీవ్రంగా నష్ట పోతున్నామని బీసీ సంఘాలు కోరాయి. ఈ సందర్భంగా కమిషన్  చైర్మన్  మీడియాతో మాట్లాడుతూ గతంలో జిల్లాల్లో పర్యటించిన  నిరంజన్  కమిషన్  ఎదుట బీసీల సమస్యలు, రిజర్వేషన్ల కేటగిరి మార్పు వంటి అంశాలపై ప్రజలు, కుల సంఘాల నాయకులు వినతిపత్రాలు సమర్పించారని, తాము కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై మాత్రమే విజ్ఞప్తులు స్వీకరించామని తెలిపారు.

హైకోర్టు ఆదేశాలతో తమ కమిషన్  ఏర్పడిందని, రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో విచారణ పూర్తయిందని తెలిపారు. ఆయన వెంట కమిషన్  సెక్రటరీ బి. సైదులు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్  రమేశ్, అడిషనల్  కలెక్టర్  ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాశ్  ఉన్నారు.