అవిశ్వాసంపై హైకోర్టుకు డీసీసీబీ చైర్మన్​

  •     డైరెక్టర్​ హోదాలోని డీసీవో శ్రీనివాస్​రావుకు నో కాన్ఫిడెన్స్​లెటర్​ఎలా ఇస్తరు..?
  •     ఇరువర్గాల వాదనలు పూర్తి.. 
  •     కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ​
  •     క్యాంపులోనే అనుకూల, వ్యతిరేక డైరెక్టర్లు 
  •      రేపటి  స్పెషల్​ మీటింగ్​ఏర్పాట్లలో డీసీవో బిజీ

నిజామాబాద్, వెలుగు : డీసీవో శ్రీనివాస్​రావు అవిశ్వాస తీర్మాన లెటర్​ తీసుకొని మీటింగ్ కు​ఏర్పాట్లు చేయడాన్ని చైర్మన్​ పోచారం భాస్కర్​రెడ్డి హైకోర్టులో సవాల్​  చేస్తూ పిటిషన్​ దాఖలు చేశారు. మంగళవారం ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వులో పెట్టడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గురువారం నో కాన్ఫిడెన్స్​ స్పెషల్ ​మీటింగ్​కు డీసీవో శ్రీనివాస్​రావు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ పరిణామాలు గమనిస్తూ చైర్మన్​ భాస్కర్​రెడ్డి అనుకూల, వ్యతిరేక డైరెక్టర్లు ఇంకా క్యాంపుల్లోనే కొనసాగుతున్నారు.   

25 మంది పాలక డైరెక్టర్లు.. 

ఉమ్మడి జిల్లాలోని143 సింగిల్ విండోలకు ప్రాతినిథ్యం వహిస్తున్నవారిలో 20 మంది డైరెక్టర్లు డీసీసీబీలో ఉంటారు. వారిలో నుంచి ఒకరు చైర్మన్​గా, మరొకరు వైస్​చైర్మన్​గా ఎన్నికవుతారు. ఈ డైరెక్టర్లకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. అదనంగా మరో ఐదుగురు డైరెక్టర్లను ఆఫీసర్ల నుంచి అపాయింట్​చేస్తారు. డీసీవో, నాబార్డు డీడీఎం, టెస్కాబ్​డీజీఎం, బ్యాంకు సీఈవో,  ప్రొఫెషనల్​ డైరెక్టర్​గా ఒకరిని నామినేట్​చేస్తారు. పాలకవర్గం నిర్ణయాల్లో డైరెక్టర్లుగా వీరి భాగస్వామ్యం ఉన్నా వీరికి ఓటు హక్కు మాత్రం ఉండదు. తనతోపాటు డైరెక్టర్​గా వ్యవహరించే డీసీవోకు డైరెక్టర్లు అవిశ్వాస లెటర్​ఇవ్వడం

దానిని ఆమోదించి ఆయన స్పెషల్​మీటింగ్ ఏర్పాటు చేయడాన్ని చైర్మన్ భాస్కర్​రెడ్డి హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. జిల్లా కలెక్టర్ ​లేదా సహకారశాఖ కమిషనర్​కు మాత్రమే ఆ రైట్స్ ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అవిశ్వాస మీటింగ్​ నిర్వహించే పవర్స్​డీసీవోకు లేనందున ఆ మీటింగ్​రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని ఆయన తరపు లాయర్​ కోర్టులో వాదించారు. డీసీవో తరఫున గవర్నమెంట్​లాయర్​ వాదనలు వినిపించారు. మంగళవారం ఇరువురి వాదనలు విన్న జడ్జి తీర్పును రిజర్వు చేశారు. దీంతో అందరిలో టెన్షన్​ఏర్పడింది. చైర్మన్​కు అనుకూలంగా తీర్పు వస్తే అవిశ్వాస మీటింగ్​ రద్దవుతుంది. 

మీటింగ్​ ఏర్పాట్లలో డీసీవో బిజీ..

ఇంతకుముందు నిర్ణయించిన ప్రకారం డీసీవో శ్రీనివాస్​రావు నో కాన్ఫిడెన్స్​మీటింగ్​ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 4న చైర్మన్​పోచారం భాస్కర్​రెడ్డిపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ 14 మంది డైరెక్టర్లు అందించిన లెటర్ పై సంతకాలు కన్ఫార్మ్ ​చేసుకున్నాక.. నిబంధనల ప్రకారం 15 రోజుల గడువుతో ఈనెల 21న మీటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చని డైరెక్టర్లకు తెలిపానని ​డీసీవో తరపున లాయర్​ కోర్టుకు వివరించారు. ఆ ప్రకారం స్పెషల్​మీటింగ్​కు ఆయన రెడీ అవుతున్నారని చెప్పారు.

శతవిధాలా ప్రయత్నాలు.. 

బీఆర్ఎస్​ ప్రభుత్వంలో స్పీకర్​గా వ్యవహరించిన పోచారం శ్రీనివాస్​రెడ్డి ఆయన కొడుకును నాలుగేండ్ల కింద పోచారం భాస్కర్​రెడ్డి డీసీసీబీ చైర్మన్​ పదవికి ఎంపిక చేశారు. ఓటు హక్కు ఉన్న 20 మంది డైరెక్టర్లలో 14 మంది ఆయనపై నో కాన్ఫిడెన్స్​ వ్యక్తం చేస్తున్నారు. భాస్కర్​రెడ్డికి మద్దతుగా ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు. 11 మంది డైరెక్టర్లతో అవిశ్వాస మీటింగ్​నిర్వహించవచ్చు, అయితే అవిశ్వాసాన్ని గెలిపించడానికి 2/3 అంటే14  మంది డైరెక్టర్ల ఓట్లు అవసరం. వైస్​చైర్మన్ ​రమేశ్​రెడ్డి నాయకత్వంలో ఆయనకు మద్దతుగా నో కాన్ఫిడెన్స్​ వ్యవహారాలు నడుస్తున్నాయి.

ఆయన క్యాంపులో ఉన్న 14  మంది డైరెక్టర్లలో ఒక్కరిని లాక్కొని అవిశ్వాసం వీగిపోయేలా చేసేందుకు భాస్కర్​రెడ్డి పావులు కదుపుతున్నారు. ఆయనకు ఎవరూ చిక్కకుండా రమేశ్​రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కోర్టుకు వెళ్లి పదవి కాపాడుకునేందుకు చైర్మన్​భాస్కర్​రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫైనల్​గా కోర్టు తీర్పుపై వారి భవిష్యత్ ఆధారపడి ఉంది.