రతన్ టాటా ఇక లేరు..

  • వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో కన్నుమూత 
  • దేశ పారిశ్రామిక గతిని మార్చిన దిగ్గజం 
  • ఇటు వ్యాపారం, అటు దాతృత్వంతో చెరగని ముద్ర 
  • ఉప్పు నుంచి విమానం దాకా అన్నింట్లో టాటా 
  • సంపాదనలో 60 శాతం దానధర్మాలకే..
  • రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల దిగ్భ్రాంతి 

ముంబై : భారత పారిశ్రామిక చరిత్రలో ఓ శకం ముగిసింది. దేశ కీర్తిని ఖండాంతరాలకు చాటిన వ్యాపార దిగ్గజం నేలకొరిగింది. టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ రతన్ టాటా ఇకలేరు. వృద్ధాప్య సంబంధమైన అనారోగ్యంతో బుధవారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. 86 ఏండ్ల రతన్ టాటాకు ఇటీవల బీపీ సడెన్​గా పడిపోవడంతో హాస్పిటల్​కు తరలించారు. బుధవారం ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగించారు. చివరకు పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారని టాటా గ్రూప్ ప్రకటించింది. 

రతన్ టాటా ఆరోగ్యంపై ఇటీవల ఆందోళనలు వ్యక్తమవడంతో తాను బాగానే ఉన్నానని ఆయన ప్రకటన చేశారు. రొటీన్ మెడికల్ చెకప్ కోసమే హాస్పిటల్ లో చేరానని తెలిపారు. కానీ బుధవారం ఆయనను ఐసీయూకు షిఫ్ట్ చేశారన్న వార్తలు రావడంతోనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. అయితే, టాటా గ్రూప్ అధికారిక ప్రకటనకు ముందే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంక ఈ విషయాన్ని కన్ఫమ్ చేస్తూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ట్వీట్ చేశారు. 

‘‘గడియారం ఆగిపోయింది. టైటాన్ ఇక లేరు. సమగ్రత, నైతికత, నాయకత్వం, దాతృత్వాలకు రతన్ టాటా ఒక ద్వీప స్తంభంలా నిలిచారు. ప్రపంచ వాణిజ్య రంగంపై ఆయన చెరగని ముద్ర వేశారు. మన జ్ఞాపకాల్లో ఆయన ఎల్లప్పటికీ నిలిచి ఉంటారు” అని ఆయన పేర్కొన్నారు. 

ముంబైలో జననం, విద్యాభ్యాసం..  

ముంబైలో నావల్ టాటా, సూనీ టాటా దంపతులకు 1937 డిసెంబర్ 28న రతన్ టాటా జన్మించారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్ జీ టాటా ఈయనకు ముత్తాత. పదేళ్ల వయస్సులో తల్లిదండ్రులు విడిపోవడంతో రతన్ టాటా అమ్మమ్మ నవాజ్​బాయి టాటా వద్ద పెరిగారు. క్యాంపియన్ స్కూల్, కేథడ్రల్, ముంబైలోని జాన్ కానన్ స్కూల్, సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్లో ఆయన స్కూలింగ్ కొనసాగింది. న్యూయార్క్​లోని రివర్ డేల్ కంట్రీ స్కూల్ నుంచి పట్టభద్రుడయ్యారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్వాన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ పూర్తిచేశారు. 1955 ఏడాదిలో హైస్కూల్ నుంచి పట్టా పొందాక టాటా కార్నెల్ యూనివర్శిటీలో చేరారు.

అక్కడే ఆయన 1959లో ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. 1961లో టాటా కంపెనీలో చేరారు. అక్కడే ఆయన టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో పనిచేశారు. ఆ తర్వాత 1991లో టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. వ్యాపార రంగంలో అసాధ్యాలను సుసాధ్యం చేసి భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు.   

పెండ్లి పీటలెక్కని ప్రేమ

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉండగా రతన్ టాటా ఓ అమ్మాయిని ప్రేమించారు. ఈ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. కానీ ఆ సమయంలో అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో రతన్ టాటా అత్యవసరంగా భారత్‌ కు తిరిగి వచ్చారు. తను ప్రేమించిన అమ్మాయిని కూడా తీసుకుని రావాలని అనుకున్నా.. చైనాతో యుద్ధం కారణంగా మన దేశంలో పరిస్థితులు బాగాలేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పంపించలేదు. దీంతో తన ప్రేమ అక్కడితోనే ముగిసిపోయిందని రతన్ టాటా ఓ సందర్భంలో చెప్పారు. ప్రేమ విఫలం అయిన తర్వాత ఆయన మళ్లీ పెళ్లి ఊసే ఎత్తకుండా ఒంటరిగా మిగిలిపోయారు.  

సంపాదన, లాభాల్లో 60% దానధర్మాలకే.. 

మధ్య తరగతి ప్రజల కలలను సాకారం చేయడానికి రతన్ టాటా 2015లో నానో కారును తీసుకొచ్చారు. రూ. లక్షకే దీనిని అందుబాటులోకి తెచ్చారు.  ప్రపంచవ్యాప్తంగా టాటా నానో సామాన్యుల కారుగా పేరుగాంచింది. కాగా, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ను స్థాపించి తన కంపెనీల ద్వారా వచ్చిన లాభాలలో 60 నుంచి 65 శాతం దాతృత్వ ప్రయోజనాల కోసం  రతన్ టాటా విరాళంగా అందించారు. రతన్ టాటాను కేంద్రం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. దేశవిదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలు ఆయనను గౌరవ డాక్టరేట్​లతో గౌరవించాయి.

గ్యారేజీలో విలువైన కార్లు..

రతన్ టాటా అభిరుచులలో కార్ల సేకరణ కూడా ఒకటి.. ఆయన గ్యారేజీలో పాత తరం కార్ల నుంచి లేటెస్ట్ మోడల్ వరకు విలువైన కార్లు దర్శనమిస్తాయి. టాటా నిక్సన్, మెర్సిడెస్​బెంజ్, కార్డిలాక్​ఎక్స్​ఎల్ఆర్, క్రిస్లెర్​ సెబ్రింగ్, టాటా ఇండిగో తదితర కార్లు ఉన్నాయి. 

రాష్ట్రపతి, ప్రధాని సంతాపం

రతన్  టాటా మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ‘రతన్ టాటా దూరదృష్టిగల వ్యాపారవేత్త. ఆయన మెరుగైన సమాజంకోసం తాపత్రయపడేవారు. సమాజానికి తిరిగివ్వాలనుకునే కొద్దిమందిలో టాటా గ్రూపు దిగ్గజ చైర్మన్ ఒకరు. విద్యవైద్య రంగంలో ఆయన విశేష సేవలు అందించారు. నేడు రతన్ టాటా మన మధ్య లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్​చేశారు. అలాగే, రతన్ టాటా మృతి కలిచివేసిందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ట్వీట్ చేశారు.రతన్ టాటా లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ బిజినెస్​మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. లెజెండ్స్ ఎప్పటికీ చనిపోరని, ఆయనను ఎప్పటికీ మరువలేమని ట్వీట్  చేశారు.

కేవలం డబ్బు సంపాదించడం కోసమే వ్యాపారం చేయొద్దు.. సమాజహితమే లక్ష్యంగా ముందుకు సాగాలి.

వేగంగా నడవాలనుకుంటే  ఒంటరిగా నడవండి. కానీ, చాలా దూరం నడవాలనుకుంటే మాత్రం అందరితో కలిసి నడవండి.
- రతన్​ టాటా