కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్.. మూసీ పేరుతో కాంగ్రెస్ అవినీతి

ఆ రెండు పార్టీలు అవినీతితో కంపు కొడుతున్నాయి: ఎంపీ బండి సంజయ్

కరీంనగర్, వెలుగు: కాళేశ్వరం  పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడితే.. మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్షన్నర కోట్లు అప్పు తెచ్చి కాంగ్రెస్ అవినీతికి తెర తీస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆ రెండు పార్టీలు అవినీతితో కంపు కొడుతున్నాయని మండిపడ్డారు. 

జీతాలకే పైసల్లేక అల్లాడుతుంటే మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. అవినీతి, వారసత్వ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని ఆయన విమర్శించారు. సోమవారం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. అయ్యప్ప సొసైటీ అక్రమాల కూల్చివేత పేరుతో అప్పట్లో హడావుడి చేసిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడితే.. ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు హైడ్రా కూల్చివేతల పేరుతో సంపన్నుల నుంచి వసూళ్లకు తెరతీశారని ఆయన ఆరోపించారు. హైడ్రా పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను కూల్చివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.