సొంత రాష్ట్రానికి వెళ్లండి..ఐఏఎస్​, ఐపీఎస్​లకు కేంద్రం ఆదేశం

  • తెలంగాణలో పని చేస్తున్న8 మంది ఏపీ కేడర్​ 
  • లిస్టులో వాణీప్రసాద్​, వాకాటి కరుణ, ఆమ్రపాలి, రొనాల్డ్​ రోస్,  ప్రశాంతి, అంజనీకుమార్​, అభిలాష బిస్త్, అభిషేక్​ మహంతి 
  • ఏపీలో పనిచేస్తున్న ఐదుగురు తెలంగాణ కేడర్​ ఐఏఎస్​లకూ వర్తింపు

హైదరాబాద్, వెలుగు : తమను తెలంగాణ కేడర్​లో కొనసాగించాలని విజ్ఞప్తి చేసిన 8 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం నో చెప్పింది.  ఈ నెల16వ తేదీలోగా సొంత కేడర్​ ఆంధ్రప్రదేశ్​లో రిపోర్ట్​ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం డిపార్ట్​మెంట్​ ఆఫ్​ పర్సనల్​ అండ్​ ట్రైనింగ్ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ లిస్ట్​లో సీనియర్​ ఐఏఎస్​లు వాణీప్రసాద్​, వాకాటి కరుణతోపాటు ఆమ్రపాలి కాటా

రొనాల్డ్​ రోస్,  ప్రశాంతి ఉన్నారు.  ఐపీఎస్​లలో అంజనీకుమార్​, అభిలాష బిస్త్, అభిషేక్​ మహంతి ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్​లో పని చేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారులు ఎస్‌‌ఎస్‌‌ రావత్, అనంత్ రాము, లోతేటి శివశంకర్, సృజన్​, హరికిరణ్​ను కూడా తెలంగాణకు రిలీవ్‌‌ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు ఇచ్చింది. 

దీపక్​ కమిటీ నివేదిక ఆధారంగా

ఉమ్మడి ఏపీలో కొనసాగిన ఆలిండియా సర్వీస్​ అధికారులను రాష్ట్ర విభజన తర్వాత  తెలంగాణ, ఏపీ కేడర్​లకు డీవోపీటీ కేటాయించింది. ఇట్ల కేటాయించిన వారిలో పలువురు ఏపీ కేడర్‌‌  అధికారులు.. ఏపీకి వెళ్లకుండా తెలంగాణలో కొనసాగుతున్నారు. వివిధ కారణాలు చూపిస్తూ తమను తెలంగాణ కేడర్‌‌లో కొనసాగించాలని కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. ఈ విషయంలో  గతంలో క్యాట్‌‌(సెంట్రల్​ అడ్మినిస్ట్రేటివ్​ ట్రిబ్యునల్​)ను  ఆశ్రయించారు. ఆ అధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న క్యాట్​ వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

కాగా, క్యాట్‌‌ తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆఫీసర్ల అభ్యర్థనలను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం అభ్యంతరాల పరిశీలన కోసం రిటైర్డ్​ ఐఏఎస్‌‌  దీపక్‌‌ తో కేంద్రం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక మేరకు అధికారుల అభ్యర్థనలను తోసిపుచ్చుతూ తాజాగా డీవోపీటీ నిర్ణయం తీసుకుంది.

కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లాలని ఐఏఎస్‌‌, ఐపీఎస్‌‌లకు కేంద్రం ఆదేశాలిచ్చింది. వాస్తవానికి ఏపీ కేడర్​ నుంచి తెలంగాణలో కొనసాగుతున్నవారిలో మొత్తం 11 మంది ఆల్​ఇండియా ఆఫీసర్లున్నారు. వీరిలో మాజీ సీఎస్​ సోమేశ్‌‌ కుమార్‌‌, అనంతరామ్​, హరికిరణ్​ ఇప్పటికే రిటైర్​ అయ్యారు.

8 మందిలో ఎవరెక్కడ పనిచేస్తున్నారంటే..!

తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్​ ఐఏఎస్​లలో 1995 బ్యాచ్​కు చెందిన సీనియర్​ ఐఏఎస్​ వాణీ ప్రసాద్ యూత్​ అఫైర్స్​, టూరిజం, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2004 బ్యాచ్​కు చెందిన  ఐఏఎస్ ఆఫీసర్​ వాకాటి కరుణ స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా,  2006 బ్యాచ్ కు చెందిన రోనాల్డ్ రాస్ విద్యుత్​ శాఖ సెక్రటరీగా,  2010  బ్యాచ్ కు చెందిన ఆమ్రపాలి కాటా జీహెచ్​ఎంసీ కమిషనర్​గా, 2009 బ్యాచ్ కు చెందిన ప్రశాంతి ఫారెస్ట్​ అడిషనల్​ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

ఇక ఐపీఎస్​లలో  1990  బ్యాచ్ కు చెందిన మాజీ డీజీపీ అంజన్ కుమార్ ప్రింటింగ్​, స్టేషనరీ కమిషనర్​గా,   1994  బ్యాచ్​కు చెందిన అభిలాష బిస్త్ పోలీస్​ అకాడమీ డీజీగా, 2011బ్యాచ్​కు చెందిన అభిషేక్ మహంతి కరీంనగర్​ పోలీస్​ కమిషనర్​గా పని చేస్తున్నారు. వీరందరినీ ఇప్పుడు సొంత కేడర్​ రాష్ట్రాని(ఏపీ)కి వెళ్లాలని డీవోపీటీ ఆదేశించింది.