సారూ.. ఆదుకోండి.. కేంద్ర బృందానికి వరద బాధితుల ఆవేదన

ఖమ్మం టౌన్, వెలుగు: మున్నేరు వాగు వరద ముంపుతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన  కేంద్ర బృందం గురువారం రెండో  రోజు ఖమ్మం జిల్లాలో పర్యటించింది. దెబ్బతిన్న ఇండ్లు, సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన కుటుంబాలను కలిసి, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలో మహేశ్ కుమార్, శాంతినాథ్ శివప్ప, ఎస్కే కుష్వాహ, టి. నియాల్ కన్సన్, శ్రీ శశివర్ధన్ రెడ్డి రెండు టీమ్ లుగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. 

అనంతరం వరద నష్ట వివరాలను ఫొటో ఎగ్జిబిషన్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వివరించారు. అదేవిధంగా రాష్ట్ర గనులు, భూగర్భ ఖనిజాల శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ పర్యటించారు. భారీ వర్షాలు, వరదల విధ్వంసాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లు, జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదికగా సమర్పించనున్నట్లు కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన కల్నల్ కేపీ సింగ్ తెలిపారు. కేంద్ర బృందం వెంట ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అఖిలేష్ అగస్త్య, ట్రైనీ అడిషనల్ కలెక్టర్  మ్రిణాల్ శ్రేష్ఠ, ఆర్డీవోలు జి. గణేశ్, రాజేందర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

కోదాడ, వెలుగు: వరదల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, మమ్మల్ని ఆదుకోవాలని ఇండ్లు కోల్పోయిన బాధితులు, పొలాలు మునిగిపోయిన రైతులు కేంద్ర బృందాన్ని వేడుకున్నారు. ఇటీవలి భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు గురువారం సెంట్రల్ టీమ్ సూర్యాపేట జిల్లాలోని కోదాడ, అనంతగిరి, చిలుకూరు మండలాల్లో పర్యటించింది. వరదలతో దెబ్బతిన్న రోడ్లు , ఇండ్లు, ఇసుక మేటలు వేసిన పొలాలను పరిశీలించింది. జిల్లాలో జరిగిన నష్టాన్ని అధికారులకు కలెక్టర్ వివరించారు.  గురువారం కేంద్ర బృంద సభ్యులు కల్నల్ కేపీ సింగ్, మహేశ్ కుమార్, శాంతినాథ్​శివప్ప  ఖమ్మం నుంచి నేరుగా అనంతగిరి మండలం గోండ్రియాలకు వెళ్లగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆహ్వానం పలికారు. గోండ్రియాలలో కూలిన గూటి పార్వతమ్మ, గంటు గరతయ్య ఇండ్లని పరిశీలించారు.  

వరదల్లో సామాగ్రి కొట్టుకుపోయిన ఇండ్లను కూడా చూశారు. పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితుల ఇబ్బందులను తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా బ్లీచింగ్ చల్లించాలని, యాంటీ లార్వా స్ప్రే, 15 రోజుల్లో 3 సార్లు డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే చేయాలని స్థానిక పంచాయతీ కార్యదర్శి, వైద్యాధికారులకు సూచించారు. అనంతరం కోదాడ మండలం తొగర్రాయికి వెళ్లి తెగిన రోడ్డు, వంతెనను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన వరద ముంపు ఫొటో ఎగ్జిబిషన్‎పై కేంద్ర బృందానికి కలెక్టర్ వివరించారు. ఇండ్లు కూలిన, సామగ్రి కొట్టుకుపోయిన బాధితులకు నష్ట పరిహారం అందేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు. 

వరదతో పంటలు, ఇసుక మేటలు వేసిన పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడారు.  అనంతరం నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద  ఎన్ఎస్ పీ ఎడమ కాల్వకు పడిన గండిని చూశారు. పాలేరు రిజర్వాయర్ లో 9 అడుగులు మేర నీరు ఎక్కువ రావటంతో  వాటర్ వెనక్కి వచ్చి గండి పడిందని కలెక్టర్ వివరించారు. స్పీడ్ గా కాలువ లైనింగ్ పనులు, గండి పూడ్చి  ఆయకట్టుకి నీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశింశారు. సెంట్రల్ టీమ్ వెంట ఆర్డీవో సూర్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, ఇరిగేషన్ డీఈ రఘు, తహసీల్దార్లు హిమ బిందు, వాజిద్ అలీ, సరిత, ఎంపీవో పాండు రంగన్న, కార్యదర్శిలు వీర ప్రభాకర్, అభిలాశ్, అధికారులు, 
సిబ్బంది ఉన్నారు. 

సాగర్ ఎడమ కాల్వ కట్ట పరిశీలన

నడిగూడెం (మునగాల): భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద గండిపడిన సాగర్ ఎడమ కాల్వ కట్టను సెంట్రల్ టీమ్  పరిశీలించింది. గండి పడటానికి కారణాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకుంది. గండి పూడ్చివేత పనులకు టెండర్లను పిలిచామని, రెండు, మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని వివరించారు. త్వరగా పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని టీమ్ ఆఫీసర్లను ఆదేశించింది. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ , వివిధ శాఖల అధికారులు ఉన్నారు. 


చెరువు కబ్జాతోనే  మా పొలాలు మునిగినయ్

మేళ్లచెరువు (హుజూర్ నగర్) : భారీ వానలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, తాము సన్నకారు రైతులమని, ప్రభుత్వం ఆదుకోవాలని బూరుగ్గడ్డ రైతులు కేంద్ర అధికారుల బృందానికి మొరపెట్టుకున్నారు. హుజూర్ నగర్ మండలం బూరుగ్గడ్డ ను సందర్శించి తెగిపోయిన చెరువును, ముంపు పొలాల్లోని ఇసుక మేటలను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్ ను చూశారు. 

అనంతరం గ్రామానికి చెందిన బాధిత రైతులతో మాట్లాడా రు. చెరువు150 ఎకరాల విస్తీర్ణంలో ఉండేద ని, కబ్జాలకు గురై  ప్రస్తుతం 50 నుంచి 70 ఎకరాల్లో చెరువు మిగిలిందని రైతులు వివరించారు. ఆక్రమణల వల్లే వరద నిలిచేం దుకు చోటు లేక చెరువు తెగి తమ పొలాలను, ఇండ్లను ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి లక్ష పరిహారం అంద జేయాలని సీపీఎం నేతలు సెంట్రల్ టీమ్ కు వినతిపత్రం ఇచ్చారు. ఆర్డీఓ శ్రీనివాసులు, ఇరిగేషన్ ఆఫీసర్లు, సిబ్బంది  ఉన్నారు.