- కేంద్ర విపత్తు నిర్వహణ అంచనా నిపుణుల బృందం
హుజూర్‌నగర్/కోదాడ, వెలుగు : సెప్టెంబర్‌లో సూర్యాపేట జిల్లాలో వచ్చిన వరదల వల్ల జరిగిన పంట నష్టం వివరాలు, పరిహారం విషయంపై కేంద్రానికి నివేదిక పంపిస్తామని కేంద్ర విపత్తు నిర్వహణ, అంచనా నిపుణుల టీమ్ సభ్యులు చెప్పారు. బుధవారం వారు హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని బూరుగడ్డ, చౌటపల్లి, మఠంపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వరదల వల్ల దెబ్బ తిన్న చెరువులు, నష్టపోయిన పంటలు, కొట్టుకుపోయిన రోడ్ల వివరాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వారికి వివరించారు.
బూరుగడ్డ నల్లచెరువు కట్ట కొట్టుకుపోవడం వల్ల 1,570 ఎకరాల్లో పంట దెబ్బతినగా, మరో 360 ఎకరాల్లో పూర్తిగా కొట్టుకుపోయినట్లు తెలిపారు. అనంతరం కోదాడ మండలంలోని తొగర్రాయి చెరువు, మఠంపల్లి మండలంలోని మామిళ్ల చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ వరదల వల్ల ప్రజలు, రైతులతో పాటు అనుబంధ శాఖలైన ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ రంగాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసినట్లు తెలిపారు.
కేంద్ర విపత్తు నిర్వహణ అంచనా నిపుణుల బృందం సభ్యులు ఎ.ప్రదీప్‌కుమార్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ పవన్ స్వరూప్, సీనియర్ సైంటిస్ట్ చిదంబరం, చీఫ్ సైంటిస్ట్‌లు కనుంగో, అజయ్ చౌరస్య, ఇరిగేషన్ ఈఎన్‌సీ విజయ్‌కుమార్, పంచాయతీరాజ్ ఆఫీసర్ ఇమామ్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎస్‌ఎం సుభాని, అర్బన్ సెక్టార్ సభ్యులు రచన , ఆర్‌అండ్‌బీ ఆఫీసర్లు సీతారామయ్య, హుజూర్‌నగర్, కోదాడ ఆర్డీవోలు శ్రీనివాసులు, సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.