- దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్
- కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: దేశంలో తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌ఐసీడీపీ) కింద దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 12 కొత్త ఇండస్ట్రియల్ స్మార్ట్‌సిటీ (స్మార్ట్ పారిశ్రామిక కారిడార్లు)ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త పారిశ్రామిక కారిడార్ల కోసం రూ.28,602 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. ఈ వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు అనేక దేశాలు ముందుకొస్తున్నాయని, ఈ రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Also Read:-హైదరాబాద్ లో దోమల బాధ
తెలంగాణలోని జహీరాబాద్, ఏపీలోని ఓర్వకల్లు, కొప్పర్తి, ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్పురపాటియాలా, మహారాష్ట్రలోని డిఘి, కేరళలోని పాలక్కడ్, యూపీలోని ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, బిహార్‌లోని గయ, రాజస్తాన్‌లోని జోధ్పుర్పాలిలో ఈ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వీటిద్వారా మరో 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని, దాదాపు రూ. 1.52 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని వెల్లడించారు.
ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులను సాధించడానికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయని తెలిపారు. ప్రపంచస్థాయి గ్రీన్ ఫీల్డ్ పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ‘ప్లగ్-ఇన్ప్లే’ , ‘వాక్ -టు-వర్క్’ కాన్సెప్ట్‌లతో నిర్మించనున్నట్టు తెలిపారు. అమృత్‌సర్–-కోల్‌కతా,
ఢిల్లీ-–ముంబై, వైజాగ్-–చెన్నై, హైదరాబాద్-–బెంగళూరు, హైదరాబాద్-–నాగ్‌పూర్, చెన్నై–-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లతో సహా ఆరు పారిశ్రామిక కారిడార్లలో ఈ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్టు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
మూడు కొత్త రైల్వే ప్రాజెక్టులు
రూ. 6,456 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 296 కిలోమీటర్ల పొడవున్న మూడు కొత్త రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ఆమోదం తెలిపింది. ఇందులో రెండు కొత్త రైల్వే లైన్ప్రాజెక్టులు కాగా, మరొకటి మల్టీట్రాకింగ్ ప్రాజెక్ట్. ఇవి దేశంలో రైలు కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుచనున్నట్టు కేంద్ర సర్కారు తెలిపింది. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్‌ప్లాన్ లో భాగంగా వీటిని చేపడుతున్నట్టు వెల్లడించింది.
ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్.. ఈ నాలుగు రాష్ట్రాలను కవర్‌చేస్తూ భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను సుమారు 300 కిలోమీటర్ల మేర పెంచుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా 14 కొత్త రైల్వే స్టేషన్లను నిర్మిస్తామని పేర్కొన్నది. ప్రాంతీయ అభివృద్ధికి, ప్రత్యేకించి ఒడిశాలోని నువాపాడా, జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ వంటి జిల్లాలల్లో అభివృద్ధికి దోహదపడుతాయని తెలిపింది.
ఈశాన్య రాష్ట్రాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్
ఈశాన్య రాష్ట్రాల్లో రూ. 4,136 కోట్ల వ్యయంతో 15 గిగావాట్ల సామర్థ్యం ఉన్న హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ఆమోదం తెలిపింది. ఈ రీజియన్‌లో వచ్చే 8 ఏండ్లలో మొత్తం 15,000 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 2024–25 నుంచి 2031–32 వరకు ఈ స్కీమ్ అమలు చేయనుంది. ఒక్కో ప్రాజెక్టుకు రూ.750 కోట్లు ఖర్చు చేయనున్నారు.
అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ విస్తరణ
రూ.లక్ష కోట్ల బడ్జెట్‌తో 2020లో ప్రారంభించిన అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్)ను విస్తరించనున్నట్లు కేంద్ర కేబినెట్ప్రకటించింది. దీని ద్వారా ప్యాక్ హౌస్‌లు, కోల్డ్ స్టోరేజీ, రిఫ్రిజిరేటెడ్ వాహనాలు, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు సదుపాయాలకు నిధులు అందనున్నాయి. ఈ నిర్ణయం రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు, వ్యవ సాయ రంగ బలోపేతానికి దోహదపడు తుందని కేంద్రం తెలిపింది.
234 నగరాల్లో ప్రైవేట్ఎఫ్ఎం రేడియో
దేశవ్యాప్తంగా 234 నగరాలు, పట్టణాల్లో ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ఫేస్-3లో భాగంగా 234 నగరాల్లో 730 చానళ్ల కోసం ఈ - వేలం నిర్వహించనున్నారు. వీటి అంచనా రిజర్వ్ ధర రూ. 784.87 కోట్లుగా నిర్ణయించింది. జీఎస్టీ మినహా స్థూల ఆదాయం లో 4 శాతంగా ఎఫ్‌ఎం చానెల్ వార్షిక లైసెన్స్ ఫీజు (ఏఎల్‌ఎఫ్) వసూలు చేసే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.