- 30 రోజుల నుంచి 21కి గడువు కుదింపు
- కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ
- ఫిర్యాదుల నమోదుకు సీపీజీఆర్ ఏఎంఎస్ ప్లాట్ ఫామ్
- అన్ని మంత్రిత్వ శాఖలకు నోడల్ ఆఫీసర్లు
- కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రజా ఫిర్యాదుల పరిష్కార గడువును 30 రోజులనుంచి 21 రోజులకు కుదించింది. ఫిర్యాదుల పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్న సందర్భాల్లో, ప్రజలకు మెసేజ్‌ద్వారా విషయాన్ని తెలియజేయాలని నిర్ణయించింది. సింగిల్ విండో ఓపెన్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేసే ఇంటిగ్రేటెడ్ యూజర్ ఫ్రెండ్లీ సీపీజీఆర్ఏఎంఎస్ www.pgportal.gov.in పోర్టల్‌లో ప్రజలు దాఖలు చేసిన ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించేందుకు కేంద్రం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది.
అలాగే, పరిష్కరించిన ఫిర్యాదులపై ఫీడ్‌బ్యాక్‌ను ప్రజలకు ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా చేరవేస్తారు. కాల్‌సెంటర్ ద్వారా ఫీడ్‌బ్యాక్ సేకరిస్తారు. ఒకవేళ ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందకపోతే సీనియర్ అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు.
కొత్త మార్గదర్శకాలివే..
- అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ప్రజా ఫిర్యాదుల కోసం నోడల్ అధికారులను నియమిస్తారు. వారు ప్రజా ఫిర్యాదులను తక్షణమే, నిష్పాక్షికంగా, సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఫిర్యాదులు అధికంగా ఉన్న మంత్రిత్వ శాఖలు, శాఖలకు ప్రత్యేక నోడల్ ఆఫీసర్లు ఉండాలి.
- ప్రతి మంత్రిత్వ శాఖలో స్కీమ్స్, కార్యకలాపాలపై అవగాహన, తగిన వనరులతో కూడిన ప్రత్యేక గ్రీవెన్స్ సెల్స్‌ను ఏర్పాటు చేయాలి.
- మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో అప్పిలేట్ ఆఫీసర్లు, సబ్ నోడల్ అప్పిలేట్ఆఫీసర్ల అంచెలవారీగా నియామక ప్రక్రియను రూపొందించారు.
- ఫిర్యాదుల పరిష్కారం మొత్తం ప్రభుత్వ విధాన పరిధిలోనే ఉంటుంది. తీసుకున్న చర్యలపై నివేదికను రిడ్రెస్సల్ అధికారులు సీపీజీఆర్‌ఏఎంఎస్‌లో దాఖలు చేయాలి.
- ప్రజా ఫిర్యాదులను ఏఐ ఆధారిత టీ డ్యాష్ బోర్డ్, ఇంటెలిజెంట్ గ్రీవెన్స్ మానిటరింగ్ డ్యాష్ బోర్డును ఉపయోగించి అనలైజ్ చేస్తారు.
- నెలవారీగా మంత్రిత్వ, విభాగాల ర్యాంకింగ్ కోసం గ్రీవెన్స్ రీడ్రెస్సల్ అసెస్మెంట్ ఇండెక్స్‌ను విడుదల చేయాలి.
- సేవోత్తమ్ స్కీమ్ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 36 అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ సంస్థల ద్వారా గ్రీవెన్స్ అధికారులకు సీపీజీఆర్ఎఎంఎస్‌పై శిక్షణ అందిస్తారు.