పెద్దపల్లి-మణుగూరు రైల్వే లైన్‌‌‌‌కు గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌

  •  భూసేకరణ చేపట్టాలని రైల్వేశాఖ నోటిఫికేషన్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ 
  •  నాలుగు జిల్లాలను కలుపుతూ 207 కిమీ రైల్వే లైన్​
  •  ఇప్పటికే స్టార్ట్​అయిన పెద్దపల్లి బైపాస్​ రైల్వే లైన్​ పనులు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి– మణుగూరు రైల్వే మార్గానికి గ్రీన్​సిగ్నల్​ ఇస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈనెల 21న నోటిఫికేషన్‌‌‌‌ విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే రైల్వే లైన్​పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా  పోతుందని రైల్వే శాఖ నోటిఫికేషన్​లో పేర్కొంది. దీనిద్వారా ఈ జిల్లావాసులకు రైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పెద్దపల్లి రైల్వే స్టేషన్​ జంక్షన్‌‌‌‌గా కొనసాగుతుండగా.. దీనిమీదుగా కాజీపేట, మహారాష్ట్ర, నిజామాబాద్‌‌‌‌, కరీంనగర్ వైపు రైళ్ల రద్దీ ఉంది. ఈ క్రమంలో పెద్దపల్లి జంక్షన్‌‌‌‌కు​బైపాస్​ లైన్​ ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించి పనులు ప్రారంభించింది. 

సింగరేణి బెల్ట్​ను కలుపుతూ...

పెద్దపల్లి–మణుగూరు రైల్వేలైన్​ 207 కిలో మీటర్ల పరిధిలో సింగరేణి కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌లను కలుపుతూ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రైల్వే లైన్​ నిర్మాణం కానుంది. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లను కూడా గుర్తించినట్లు తెలిసింది. ఈ లైన్​ నిర్మాణం పూర్తయితే ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను సందర్శించడం సులువవుతుంది.

 ప్రస్తుతం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ప్రయాణికులు భద్రాద్రి కొత్తగూడెం పోవాలంటే కాజీపేట మీదుగా తిరిగిపోవాల్సి వస్తోంది. కొత్త రైల్వే లైన్​ పూర్తయితే పెద్దపల్లి నుంచి నేరుగా ములుగు, భూపాలపల్లి మీదుగా కొత్తగూడెం వెళ్లొచ్చు. ఈ క్రమంలో వందల కిలోమీటర్ల దూరం తగ్గిపోనుంది. దీంతోపాటు ఈ జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కానుంది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశానుసారం ఆయా జిల్లాల కలెక్టర్లు తొందరలోనే భూసేకరణ పనులు మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

1999లోనే సర్వే.. 

 పెద్దపల్లి నుంచి మణుగూరు వరకు రైల్వే లైన్​ ఏర్పాటు చేయాలని నిర్ణయించి  1999లోనే సర్వే కూడా చేయించారు. కానీ పలు కారణాల వల్ల ఆ పనులు ముందుకు సాగలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్​ పార్టీ ఈ రైల్వే లైన్​ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది. అనంతరం కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడడంతో ఈ లైన్ విషయంపై కేంద్రం దృష్టికి తీసుకుపోయి ఒప్పించారు. ఈ నేపథ్యంలోనే రైల్వే శాఖ పెద్దపల్లి, మణుగూరు రైల్వే లైన్​ నిర్మాణానికి  భూసేకరణ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆదేశించింది.  

ఇప్పటికే బైపాస్‌‌‌‌ పనులు.. 

పెద్దపల్లి రైల్వే జంక్షన్ కావడంతో నిజామాబాద్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చే రైళ్లకు ఇక్కడే ఇంజిన్లను మారుస్తారు. దీనికి సుమారు అరగంట నుంచి గంట వరకు పడుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో 2021లో పెద్దపల్లిలో బైపాస్ స్టేషన్‌‌‌‌ నిర్మించి ప్రత్యేక లైన్‌‌‌‌ ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.  ఇప్పటికే పెద్దపల్లి నుంచి పెద్దబొంకూర్​మీదుగా పనులు నడుస్తున్నాయి.