పంటల బీమా పథకం పొడిగింపు

వ్యవసాయానికి కీలకమైన డై అమోనియం ఫాస్ఫేట్​(డీఏపీ) ఎరువుపై అదనపు రాయితీ కింద రూ.3 వేల 850 కోట్ల వరకు వన్​టైం ప్యాకేజీగా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం రైతులకు 50 కిలోల డీఏపీ బస్తా రూ.1350కే అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్​లో పెరిగిన ధరల భారం రైతులపై పడకుండా రాయితీ రూపంలో ప్రభుత్వం భరించనున్నది. 2025, జనవరి 1 నుంచి మొదలై తదుపరి ఉత్తర్వుల ఇచ్చే వరకు అమల్లో ఉంటుంది. ఇదివరకు ప్రకటించిన రూ.2 వేల 675 కోట్ల రాయితీ 2024, డిసెంబర్​ 31తో ముగిసింది.

ప్రధాన మంత్రి పంటల బీమా పథకం(పీఎంఎఫ్​బీవై), పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం(ఆర్​డబ్ల్యూబీసీఐఎస్) అమలును 15వ ఆర్థిక సంఘం పదవీకాలానికి అనుగుణంగా కొనసాగించేందుకూ క్యాబినెట్​ అంగీకరించింది. ఇందుకోసం 2021–22 నుంచి 2024–25 మధ్యకాలానికి రూ.66 వేల 550 కోట్లు కేటాయించింది. ఈ పథకం అమలు చేస్తోన్న రాష్ట్రాల్లో పండించే పంటలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ కల్పించడానికి వీలవుతుంది.

నవకల్పనలు, సాంకేతిక నిధి

పంటల బీమా పథకం అమలులో పారదర్శకత పెంచి క్లెయిమ్​ల పరిష్కారాన్ని వేగవంతం చేసేందుకు రూ.824.77 కోట్లతో నవకల్పనలు, సాంకేతిక నిధి ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ద్వారా కొత్త సాంకేతిక అంశాలను జోడించడంతోపాటు పరిశోధన, అభివృద్ధి అధ్యయనాలు చేపడుతారు. పంట ఉత్పత్తిని అంచనా వేయడానికి సాంకేతికత వాడుకతో దిగుబడి అంచనా వేసే వ్యవస్థ(ఈల్డ్​ ఎస్టిమేషన్​ సిస్టమ్​ యూజింగ్​ టెక్నాలజీ ఎస్​–టెక్​) ద్వారా రిమోట్​ సెన్సింగ్​ సాంకేతికతను ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉపయోగిస్తున్నాయి. త్వరగా మిగతా రాష్ట్రాలను కూడా దీని పరిధిలోకి తీసుకువస్తారు. 

వాతావరణ సమాచారం, గణాంకాల వ్యవస్థ

మండల స్థాయిలో ఆటోమేటిక్​ వాతావరణ కేంద్రాలు, పంచాయతీ స్థాయిలో ఆటోమేటిక్​ వర్షమానినిల ఏర్పాటు కోసం వాతావరణ సమాచారం, గణాంకాల వ్యవస్థ అమల్లోకి తీసుకురానున్నారు. దీనివల్ల వాతావరణ వివరాల సేకరణ వేగంగా పూర్తవుతుంది. ప్రస్తుతం దీనిని అమలుచేసే దిశగా కేరళ, యూపీ, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, అసోం, ఒడిశా, కర్ణాటక, ఉత్తరాఖండ్, రాజస్తాన్డచర్యలు తీసుకుంటున్నాయి. ఈ సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకునేలా మిగిలిన రాష్ట్రాలను కూడా ప్రోత్సహిస్తారు. 2024–25లో ఈ విధానాన్ని అమలుచేసిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం 90: 10 నిష్పత్తిలో నిధులు ఇవ్వనున్నది.
 

-వెలుగు, సక్సెస్-