కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ కేసును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రాష్ట్రాల్లో వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుండటంతో.. శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకోసారి నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి రిపోర్టులు పంపాలని ఉత్తర్వులిచ్చింది హోంశాఖ. వాటి ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
కోల్ కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనపై సంబంధిత అధికారుల నుంచి సరైన సమాచారం, మద్దతు లేకపోవడం, పోలీసులు నిందితుడికి సహకరిస్తున్నారనే ఆరోపణలతోనే.. ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించిందని తెలిపింది కేంద్రహోంశాఖ.
కోల్ కతా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనతో దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలకు గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది నేషనల్ మెడికల్ కమిషన్. జాతీయ స్థాయిలో డాక్టర్లు, వైద్య విద్యార్థులు, కాలేజీ, హాస్పిటల్ పరిసరాల్లో భద్రతకు తగిన విధానాన్ని రూపొందించాలని సూచించింది. ఈ రక్షణ చర్యలు ఓపీడీ, వార్డులు, క్యాజువాలిటీ, హాస్టల్స్, నివాస ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లోనూ ఉండేలా చేయాలని తెలిపింది.