కరీంనగర్​ జిల్లాలో సెల్యులైటిస్ భయం

 

  • బాక్టీరియల్  ఇన్ఫెక్షన్  బారిన వందలాది మంది

  • స్కిన్  ఎలర్జీ, బోదకాలు, వెరికోస్  వెయిన్స్, షుగర్, హెచ్ఐవీ బాధితుల్లో ఎక్కువగా వ్యాప్తి

కరీంనగర్, వెలుగు: దురద కారణంగా కాలి పిక్కలకు గాయాలై జిల్లాలో వందలాది మంది జనం అవస్థ పడుతున్నారు. దురదతో గోకడం వల్ల కాళ్లు క్రమంగా ఎరుపు రంగులోకి మారి వాపు రావడంతో ఆందోళనకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. సెల్యూలైటిస్ గా పిలిచే ఈ వ్యాధి గతంలో ఎన్నడూ లేనంతగా ఈ వర్షాకాలం సీజన్ లో విజృంభిస్తోంది. గడిచిన నెల రోజుల్లో  వందలాది మంది ఆస్పత్రుల పాలు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వ్యాధి మామూలు బాక్టీరియల్  ఇన్ఫెక్షనే అయినప్పటికీ పేషెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శరీరమంతటికీ సోకి ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇన్ఫెక్షన్  సోకే  అవయవాలను తొలగించాల్సిన పరిస్థితి కూడా రావొచ్చంటున్నారు. సైల్యులైటిస్ వ్యాధి ప్రధానంగా వెరికోస్  వెయిన్స్, షుగర్, స్కిన్  ఎలర్జీ, పైలేరియా, హెచ్ఐవీ బాధితులకు ఎక్కువగా వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

దోమకాటుతో మొదలవుతున్న దురద..

సాధారణంగా వర్షాకాలంలో దోమకాటుతో పాటు గతంలో మానకుండా ఉండిపోయిన గాయాల ఇన్ఫెక్షన్, బోదకాల సమస్యతో బాధపడేవారికి ఎక్కువగా సెల్యులైటిస్  సోకుతోంది. దోమ కాటుకు గురైన వ్యక్తులు ఆ ప్రాంతంలో దురద పెట్టడంతో గోకగానే గోటిగాట్ల ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి సెల్యులైటిస్  సక్రమిస్తుంది. ఆ తర్వాత ఈ ఇన్ఫెక్షన్  రక్తనాళాలు, కండరాల్లోకి చేరడం వల్ల ప్రమాదకరంగా మారుతుంది. దీంతో తొలుత చర్మం ఎరుపు రంగులోకి మారి వాపు వచ్చి నొప్పి ఎక్కువవుతుంది. ఇన్ఫెక్షన్  కారణంగా జ్వరం, చలి జ్వరం వస్తుంది. సెల్యులైటిస్​ వచ్చిన ప్రాంతాల్లో మచ్చలతోపాటు నీటి పొక్కుల్లా చర్మం మారిపోతుంది. కొందరిలో చర్మంపై పగుళ్లు ఏర్పడుతాయి. చర్మం వదులైన తోలు మాదిరిగా కనిపిస్తుంది. ప్రతి ఏడాది ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉంటున్నప్పటికీ.. ఈ సారి వందల్లో నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దోమలు వృద్ధి చెందడంతోనే సెల్యులైటిస్  ఎక్కువ మందికి సోకుతున్నట్లు తెలుస్తోంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. 

సెల్యులైటిస్  ఎక్కువగా వర్షాకాలం, చలికాలంలోనే వస్తుంది. కాబట్టి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఘాటైన రసాయనాలతో కూడిన సబ్బులు వాడవద్దు. మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల మాయిశ్చరైజర్ ​వంటివి రాసి తేమగా ఉండేలా చూసుకోవాలి. చర్మం పగుళ్లు బారి, తోలు రేగిన ప్రాంతాల్లో వాటిని గిల్లడం, గోకడం వంటివి చేయకూడదు. ఎక్కడైనా చర్మం తెగినా, గాయపడ్డా డాక్టర్ల సలహా మేరకు తగిన యాంటీబయాటిక్స్​ వాడాలి. డయాబెటిస్​ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇదొక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్..  

సెల్యూలైటిస్  అనేది బ్యాక్టీరియల్  ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్  అనేది చర్మానికే పరిమితం కాకుండా చర్మం పొరల్లో ఉండే కండరాల పొరలు, బోన్  వరకు సోకినప్పుడు దానిని సెల్యులైటిస్  అంటారు. ప్రాథమికంగా ఇన్ఫెక్షన్  తక్కువగా ఉన్నప్పుడే జాగ్రత్తపడాలి. బోదకాలు, షుగర్, వెరికోస్ వెయిన్స్, స్కిన్  ఎలర్జీ, హెచ్ఐవీ బాధితులు మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఒకసారి వచ్చిపోయిన వాళ్లకు సెల్యూలైటిస్  మళ్లీ రావొచ్చు. 


–డాక్టర్  నవీన్ కుమార్, డెర్మటాలజిస్టు