దేశంలో కులగణణ ఎందుకు .?

రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, ఆదేశిక సూత్రాల ప్రకారం సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకు తగిన ఆర్థిక, సామాజిక న్యాయం చేయాలి. కానీ.. నూతన ఆర్థిక విధానాల అమలు తర్వాత కొన్ని సామాజిక వర్గాలు తమ ఆర్థిక అవకాశాలను కోల్పోయాయని అనేక పరిశోధనలు చెప్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన కులాలకు కనీసం విద్యా, వైద్య రంగాల్లో కూడా తగిన న్యాయం జరగడం లేదని ఆ వర్గాలు నిరంతరం ఆందోళన చేస్తూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిన కులాల వాళ్లు తమకు రాజకీయ అవకాశాలు దక్కడం లేదని ఆర్థికంగా సంక్షోభంలో పడిపోతున్నామని నిరసనలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ దీన్ని జాతీయ అంశంగా చర్చకు తీసుకురావడానికి కారణం ఇదే. అందుకే కులం లెక్కలు కచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. 

అంతెందుకు.. దేశంలో రిజర్వేషన్లతో పాటు, సంక్షేమ పథకాలను కూడా కులాల ప్రాతిపదికనే అమలు చేస్తుంటారు. అలాంటిది దేశంలో ఏ కులంవాళ్లు ఎంతమంది ఉన్నారనేది తెలియకుంటే ఎలా? స్వాతంత్ర్యం వచ్చినప్పటి జనాభా ప్రకారమే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ.. బీసీల రిజర్వేషన్లు రాష్ట్రానికో రకంగా ఉన్నాయి. అవి ఆయా రాష్ట్రాలు చేపట్టిన సర్వేల ఆధారంగా ఉంటాయి. 

ఎస్సీ, ఎస్టీలకు వాళ్ల పూర్తి జనాభాకు తగిన నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇస్తే, బీసీలకు మాత్రం వాళ్ల జనాభాలో సగం నిష్పత్తికే రిజర్వేషన్ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మండల్ కమిషన్ అంచనా ప్రకారం.. దేశంలో బీసీలు 52 శాతం ఉన్నారు. కానీ.. వాళ్లకు 27 శాతం రిజర్వేషన్ ఉంది. ఇక ఓసీల జనాభా చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఎస్టీల కంటే ఎక్కువగా10 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి.. అసలు ఏ కులం పరిస్థితి ఏంటి? ఆయా కులాల్లో పేదల శాతం ఎంత? ఏ కులం వారు ఏ ప్రాంతంలో ఆర్థికంగా బలంగా ఉన్నారు? వంటి విషయాలు తెలిస్తేనే రిజర్వేషన్లతో పాటు సంక్షేమ పథకాల అమలు సరిగ్గా జరుతుంది. 

సమస్యల పరిష్కారానికి 

సామాజిక సమస్యలను ప్రజలే కాకుండా రాజకీయ పార్టీలు కూడా తమ ఎజెండాలోకి  తీసుకున్నప్పుడు మాత్రమే అది ఒక ప్రధాన అంశంగా మారుతుంది. కులగణన కూడా ఇప్పుడు ఒక ప్రధానాంశంగా మారింది. కులగణన అనేది దేశంలోని దాదాపు60 శాతం జనాభాకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, అభివృద్ధి అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పటికీ ‘సర్వసత్తాక సోషలిస్టు సెక్యులర్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ అని రాజ్యాంగ ప్రవేశిక​ చెప్పినప్పటికీ ఈ 60 శాతం జనాభా సమస్యలు పరిష్కరించకుండా, వాళ్ల ఉనికిని గుర్తించకుండా, కనీస అవసరాలను తీర్చకుండా ఎంతకాలం వాయిదా వేయగలరు? అందుకే కులగణన అనే అంశం రాబోయే రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలకు ఎజెండాగా మారే అవకాశం ఉంది. ఈ అంశం వెనక బలమైన అనేక కారణాలు కూడా ఉన్నాయి. 

అరవై శాతం వాళ్లే...

దేశం అభివృద్ధి చెందుతున్న దశలో 60 శాతం ప్రజలకు ఆ అభివృద్ధిలో సముచితమైన వాటా, అవకాశాలు లభించికపోతే అనేక అనర్థాలు జరుగుతాయి. వెనుకబడిన కులాల ప్రజలు తమ వృత్తులు, చిరువ్యాపారాలను కోల్పోయి ఉపాధి, ఉద్యోగాలు లేక అనేక ప్రాంతాలకు వలస వెళ్లడం సాధారణం అయిపోయింది. వాళ్లలో చాలామంది వ్యవసాయ భూములు లేక, కనీసం ఉండడానికి ఇల్లు లేక, పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించలేక తీవ్ర సామాజిక సంక్షోభంలోకి వెళ్లిపోతున్నారు. రాజ్యాంగం, స్వాతంత్రం ఉన్న ఈ దేశంలో ఈ 60% ప్రజలకు రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తగిన గుర్తింపు దక్కడం లేదు. రాజకీయ రంగంలో షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు తగిన రిజర్వేషన్లు లభించాయి. వెనుకబడిన కులాలకు ఎలాంటి రిజర్వేషన్లు లేకపోవడం వల్ల చట్టసభల్లో వాళ్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోయింది. అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీలు కూడా వెనుకబడిన వర్గాల అభ్యర్థులను నిలబెట్టడానికి జంకుతున్నాయి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఈ వర్గాల నాయకులకు పార్టీ టిక్కెట్లు ఇవ్వడానికి వెనకాడుతున్నారు. చట్టసభల్లో ముఖ్యంగా పార్లమెంటు శాసనసభలు మొదలగు సంస్థల్లో వెనుకబడిన కులాల ప్రతినిధులు 20 శాతానికి మించడం లేదు. ఆర్థికంగా బలహీనంగా ఉండడం, ఎన్నికల ఖర్చులు భరించలేకపోవడం లాంటి కారణాల వల్ల రాజకీయ పార్టీలు ఈ వర్గాల ప్రజలకు అవకాశాలు ఇవ్వడం లేదు. చట్టపరంగా రిజర్వేషన్లు ఉంటే తప్ప ఈ వర్గాలకు రాజకీయంగా న్యాయం జరిగే అవకాశం లేదు. 

ఉపాధి లేదు

నూతన ఆర్థిక విధానాల వల్ల వెనుకబడిన వర్గాల ప్రజలు కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న చిరు వ్యాపారాలు కనుమరుగయ్యాయి. కార్పొరేట్ సంస్థల ధాటికి, పోటీకి ఎదురు నిలువలేక క్రమంగా మార్కెట్ నుండి తప్పుకున్నాయి. ప్రభుత్వ విద్యావ్యవస్థలు అందరికీ నాణ్యమైన విద్య కల్పించలేవు. అలాగని ప్రయివేటు విద్యాసంస్థల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకోలేరు. అందుకే వెనుకబడిన కులాల వాళ్లు క్రమంగా విద్య, గౌరవప్రదమైన ఉపాధి, ఉద్యోగాలకు దూరమవుతున్నారు. ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ సామాజిక వర్గాల నాయకులు తమ వాటా కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. అందుకే వెనుకబడిన కులాల హక్కులు, అవకాశాలకు చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కులగణన ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.