నిజామాబాద్ జిల్లాలో కుల గణన సర్వే షురూ..

  • 3.69 లక్షల ఇండ్లు, 27.47 లక్షల జనాభా
  • 3,245 బ్లాక్​లకు 3,343 మంది ఎన్యుమరేటర్లు 
  • మండలాల వారీగా సీనియర్​ ఆఫీసర్ల సూపర్​వైజింగ్​
  • 8 తేదీ వరకు ఇండ్లకు స్టిక్కరింగ్​

నిజామాబాద్,  వెలుగు: జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే  బుధవారం ప్రారంభమైంది.  కుటుంబంలోని వ్యక్తుల ఆర్థిక, సామాజిక, విద్య, ఉపాధి, కులం, రాజకీయ నేపథ్యం, ఆస్తులు, అప్పుల వివరాల సేకరణకు అధికార యంత్రాంగం కదిలింది. ప్రభుత్వం​చేపట్టిన ఈ సర్వేను వంద శాతం సక్సెస్​ చేయడానికి ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేశారు.  సిబ్బంది చేసే సర్వే పర్యవేక్షణకు మండలం స్థాయి అధికారులతో పాటు  జిల్లా లెవల్​ సీనియర్​ ఆఫీసర్లను నియమించారు. సర్వే చేసే ఇండ్లను గుర్తించి 8వ తేదీ వరకు స్టిక్కరింగ్​ చేస్తారు.  బుధవారం తొలిరోజు ఇండ్ల స్టిక్కరింగ్​ మొదలైంది. 

రిటైర్మెంట్​ దగ్గరున్న వారికీ డ్యూటీలు

సార్వత్రిక ఎన్నికల​ టైంలో పోలింగ్​ స్టాఫ్​ను సర్​ప్లస్​గా తీసుకున్నట్లే సర్వే చేసేందుకు కూడా అవసరమైనదానికన్నా పది శాతం ఎక్కువ తీసుకున్నారు.  ఎన్యూమరేటర్లు 1,873 మంది ప్రైమరీ స్కూల్​ ఎస్జీటీలు కాగా 2,182 అంగన్​వాడీ టీచర్లు, 1,273 ఆశా కార్యకర్తలు, 537 మంది పంచాయతీ సెక్రటరీలు, మెప్మా స్టాఫ్, ఆయా శాఖల ఎంప్లాయీస్​ను నియమించారు. ఏడాదిలోపు రిటైర్మెంట్​ఉన్న వారిని సర్వే కోసం నియమించగా.. మినహాయించాలని  కోరుతూ బుధవారం నోడల్​ ఆఫీసర్లను సంప్రదించారు. 

అద్దెకు ఇండ్లు ఇచ్చిన వారి అభ్యంతరం

2014లో అప్పటి బీఆర్ఎస్​ సర్కారు సమగ్ర కుటుంబ సర్వే తరువాత ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం​ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. మొత్తం 75 ప్రశ్నలతో కూడిన వివరాలను ప్రతీ ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు నమోదు చేయాలి. వ్యక్తులు కలిసి ఉన్న ఇండ్లు, భూములు తదితర ఆస్తులు, అప్పుల వివరాలతో పాటు చదువు,  జాబ్, క్యాస్ట్, సబ్​క్యాస్ట్,  పొలిటికల్​ పార్టీలలో పొందిన పోస్టుల సమాచారం సేకరించాలి.  వివరాల సేకరణ కోసం ఎవరినీ బలవంతపెట్టొద్దని, వారిచ్చే సమాచారాన్ని మాత్రమే నమోదు చేయాలని ఎన్యుమరేటర్లకు ఆఫీసర్లు స్పష్టం చేశారు.

ఒక ఇంట్లో ఒకటికి మించి కుటుంబాలు నివాసం ఉంటే ఫ్యామిలీ వారీగా సర్వే చేయాలని ఆదేశాలున్నాయి.  అలాంటి వాటిని గుర్తించి బుధవారం నుంచి ఎన్యుమరేటర్లు స్టిక్కర్లు వేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల అద్దెకు ఇండ్లు ఇచ్చిన ఓనర్లు అందులో నివాసముంటున్న వారి సర్వే కోసం ఎన్యుమరేటర్లు స్టిక్కర్లు వేయొద్దని అభ్యంతరం చెప్పారు.  అలాంటి ఫీల్డ్​ లెవెల్​ అనుభవాలను మండల ఆఫీసర్లు సేకరించారు. నలుగురు సభ్యులున్న ఒక ఇంట్లో 75 ప్రశ్నలతో కూడిన ఫారం నింపడానికి విలేజ్​లలో 40 నిమిషాలు పట్టవచ్చునని అంచనా వేస్తున్నారు. బుధవారం కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు సర్వే తీరు పరిశీలనకు ధర్పల్లి మండలంలో పర్యటించారు.

70 శాతం ఇండ్లు గ్రామాలవే..

జిల్లాలో నిజామాబాద్​ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలు, 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జనాభా 27.77 లక్షలు.  మొత్తం ఇండ్ల సంఖ్య 3,69,031 ఉన్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీటిలో పల్లెల్లో ఉన్న ఇండ్లు 70.42 శాతం కాగా టౌన్​లో 29.58 శాతం ఉన్నాయి. ఈ మొత్తాన్ని 3,245 ఎన్యూమరేటర్​ బ్లాక్​లుగా డివైడ్​ చేశారు. 3,343 మందిని ఎన్యూమరేటర్లు, 370 మందిని సూపర్​వైజర్లుగా నియమించారు. వీరి పనితీరు పర్యవేక్షించేందుకు ఎంపీడీవోలు, మున్సిపల్​ కమిషనర్లను అపాయింట్​ చేసి 31 మంది జిల్లా లెవల్​ సీనియర్​ ఆఫీసర్లను స్పెషల్​ ఆఫీసర్లుగా నియమించారు.