యాహ్యా సిన్వర్ బంకర్‌‌లో నోట్ల కట్టలు

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ దాడుల నుంచి రక్షణ కోసం హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ ఆశ్రయం పొందిన బంకర్ లో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.. మిలియన్ల కొద్దీ డాలర్లతో పాటు బంకర్ లో అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని ఇజ్రాయెల్ బలగాలు తెలిపాయి. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రికార్డ్ చేసినట్లుగా భావిస్తున్న ఈ వీడియోలో బంకర్ లోపలి దృశ్యాలు కనిపిస్తున్నాయి.

లోపల వంట గదులు, పాలస్తీనా శరణార్థుల కోసం యునైటెడ్ నేషన్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ(యూఎన్ఆర్ డబ్ల్యూఏ) పంపిణీ చేసిన సహాయక సామగ్రి, పెర్ఫ్యూమ్స్, వ్యక్తిగత షవర్లు తదితర సదుపాయాలు ఉన్నాయి. సిన్వర్ వ్యక్తిగత క్వార్టర్‌‌లో మిలియన్ల కొద్దీ ఇజ్రాయెలీ షెకెల్‌‌(డబ్బు)లతో నిండిన పెద్ద లాకర్ ఉంది. బంకర్ తలుపు పక్కన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు ఉన్నాయి.

సిన్వర్ తన ఫ్యామిలీ, గార్డులు, సన్నిహితులతో కలిసి బంకర్‌‌లో ఆశ్రయం పొందాడు. ఇజ్రాయెల్ పై అక్టోబర్ 7 దాడిని సిన్వర్ ఇక్కడి నుంచే ప్లాన్ చేసినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నది. ఇజ్రాయెల్​పై హమాస్ దాడి తర్వాత సిన్వర్ తన ఫ్యామిలీని, ఇతర సామగ్రిని అక్కడి నుంచి తరలిస్తున్నట్లు వీడియోల ద్వారా తెలుస్తుంది. అనంతరం అతడు రఫాకు షిఫ్ట్ అయ్యాడు. యాహ్యా సిన్వర్ ఆచూకీ కోసం ఇజ్రాయెల్ సైన్యం నెలల తరబడి గాలించింది. అందులో భాగంగానే అక్టోబర్ 16న జరిపిన దాడుల్లో సిన్వర్ మృతి చెందాడు. 

ఇరాన్‌‌కు పారిపోయిన హెజ్బొల్లా డిప్యూటీ 

లెబనాన్​పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హెజ్బొల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ నయీమ్ ఖాసీం ప్రాణభయంతో ఇరాన్ పారిపోయినట్టు యూఏఈకి చెందిన 'ఎరెమ్ న్యూస్' ఓ కథనం ప్రచురించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగీ విమానంలోనే నయీమ్ ఈ నెల 5న బీరుట్ నుంచి పారిపోయినట్లు తెలిపింది. నయీమ్ ఖాసీంను ఇజ్రాయెల్ హత్య చేసే అవకాశం ఉందని ఇస్లామిక్ రిపబ్లిక్ నేతలు ఇటీవల హెచ్చరించారు.

హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందిన తర్వాత ఖాసిం మూడుసార్లు ప్రసంగించాడు. అందులో ఒకటి బీరుట్ నుంచి కాగా, రెండుసార్లు టెహ్రాన్ నుంచి మాట్లాడాడని ఎరెమ్ న్యూస్ పేర్కొంది. నస్రల్లా మృతి తర్వాత ఖాసిం క్రియాశీలకంగా మారాడు. అందుకే అతనిపై ఇజ్రాయెల్  ఫోకస్ పెట్టిందని ఇస్లామిక్ రిపబ్లిక్ నేతలు పేర్కొన్నారు.