క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్: సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్

  • సెంథిల్ బాలాజీ విడుదల
  • మనీలాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు 

న్యూఢిల్లీ/చెన్నై: క్యాష్ ఫర్ జాబ్స్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌‌ కేసులో గతేడాది జూన్ లో అరెస్టైన తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్‌‌ బాలాజీ జైలు నుంచి విడుదలయ్యారు. బాలాజీకి సుప్రీంకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్‌‌ మంజూరు చేసింది. ఆ తర్వాత  కొన్ని గంటలకు ఆయన చెన్నైలోని సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు బయట ఆయనకు డీఎంకే కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. 

క్యాష్ ఫర్ జాబ్స్ స్కాం మనీలాండరింగ్‌‌ కేసులో గత ఏడాది జూన్‌‌14న సెంథిల్‌‌ బాలాజీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. అన్నాడీఎంకే సర్కారులో సెంథిల్‌‌ బాలాజీ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2014లో ఈ కుంభకోణం జరిగింది. 2018లో డీఎంకేలో చేరారు. జైలులో ఉన్నప్పటికీ బాలాజీని సీఎం స్టాలిన్‌‌ మంత్రివర్గంలోనే కొనసాగించారు. బాలాజీని మంత్రిగా కొనసాగించడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో 471 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు.