ఖర్జూర సాగు.. లాభాల పంట..ఒక్కసారి నాటితే .. 80 ఏళ్లు దిగుబడి

తెలుగు రాష్ట్రాల్లో  ఖర్జూరం పంట రోజురోజుకు విస్తీర్ణం పెరుగుతోంది. ఇది ఒక్కసారి నాటితే చాలు, దీర్ఘకాలపు పంట, జీవితాంతం మనకు దిగుబడులను ఇస్తోంది. ఈ పంట ఇప్పటివరకు ఎడారి ప్రాంత దేశాలల్లో మాత్రమే సాగుచేసి దిగుబడులను తీసేవారు. ఎక్కువగా దిగుమతి అయ్యే ఖర్జూరంను వ్యాపార అవసరాల కోసం సాగు చేస్తుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

సాధారణంగా మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలలో ఖర్జూరం సాగు ఎక్కువ. ఇండియాలో రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో కూడా  ఖర్జూరం పండిస్తారు. ఇప్పుడు పంట వేసిన కొంతమంది రైతులకు దిగుబడి మొదలు కావడంతో తమకు ఆశాజనకంగా ఉందనే రైతులు చెబుతున్నారు. అయితే ఖర్జూర పంట సాగుపై రాయలసీమ ప్రాంత రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.ఎడారి దేశాలైన అరబ్ దేశాల్లో పండే ఈ ఖర్జూర పంట  రాయలసీమ ప్రాంతంలో కూడా సాగు చేస్తూ రైతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పెట్టుబడుల ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికిని మూడు నుండి నాలుగు సంవత్సరాలలో పంట చేతికి వస్తుంది. ఒకసారి మొక్కలు నాటితే దాదాపు 80 ఏళ్ల పాటు పంట దిగుబడి వస్తుండడంతో ఖర్జూర సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.

వ్యవసాయంపై మక్కువతో కొత్త సాగు విధానాలకు స్వీకారం చుట్టారు కొంతమంది ఆదర్శ రైతులు, ఖర్జూరాల సాగుతో విజయం సాధించారు. అధిక లాభాలను అర్జిస్తూ ఇతరులకు ఆదర్శప్రాయం అవుతున్నారు. రాయలసీమకు చెందిన ఓ  రైతు తనకున్న 5 ఎకరాల్లో ఈ ఖర్జూర పంటను సాగు చేశారు. ఎకరానికి 80 మొక్కలు చొప్పున నాటారు. అయితే మొక్కల కొనుగోలు తో పాటు ఇతర వ్యవసాయ ఖర్చులు మొత్తం కలిపి 20 లక్షల నుండి 25 లక్షల వరకు ఖర్చు చేశారు. మూడేళ్లపాటు మొక్కలను కాపాడుకుంటూ వచ్చాడు. మూడేళ్ల తర్వాత పంట దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. ఒక్కొక్క చెట్టు 100 కేజీల ఖర్జూరాల పంట దిగుబడిని ఇస్తుంది. ఇలా ఎకరానికి ఆరు టన్నుల నుండి ఏడు టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో రైతుకు ఎకరానికి 6 లక్షల నుంచి 7 లక్షల వరకు లాభం ఆర్జిస్తున్నాడు.

ఖర్జూర మొక్కలను నాటే ముందు భూముల్లో భూసార పరీక్షలు చేయించుకోవాలి. తర్వాత నాటే ముందు మొక్కకు మొక్కకు మధ్య 24 అడుగులు దూరం ఉండేలా నాటుకోవాలి. ఈవిధంగా ఎకరానికి 80 మొక్కలు నాటుకోవాలి. ఈమొక్కలకు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడాలి.ఎటువంటి రసాయనాలు వాడకూడదు.ఖర్జూరాల పంటలను మార్కెటింగ్ చేసుకోవడం అనేది రైతుకు చాలా ముఖ్య ఘట్టం.  మంచి రేటు వచ్చినప్పుడు  ఖర్జూరాలను అమ్ముకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడు, బెంగళూరుకు చెందిన వ్యాపారులు వీటిని కొనుగోలు చేస్తుంటారు. ఒక టన్ను ఖర్జూరాలు లక్ష రూపాయలతో కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి 7 వేల టన్నులు దిగుబడి రావచ్చు. ఈ లెక్కన ఏడు లక్షల ఆదాయాన్ని అర్జించవచ్చని వ్యవసాయాధికారులు అంటున్నారు.