చిరుతను తప్పించబోయి కారు బోల్తా.. భార్య మృతి.. భర్తకు గాయాలు

నిజామాబాద్, వెలుగు: చిరుత పులిని తప్పించబోయి కారు బోల్తా పడటంతో భార్య స్పాట్​లోనే చనిపోగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని మోపాల్​లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన మాలోత్ ప్రభాకర్, లలిత దంపతులు. మోపాల్ మండలంలోని బంధువుల ఇంటికి కారులో వచ్చారు. రాత్రి భోజనం చేశాక యాచారం బయలుదేరారు.

మంచిప్ప ఫారెస్ట్ ఏరియాకు రాగానే ఒక్కసారిగా చిరుత పులి కారుకు ఎదురుపడింది. డ్రైవింగ్ చేస్తున్న మాలోత్ ప్రభాకర్.. భయంతో స్టీరింగ్​పై కంట్రోల్ తప్పాడు. దీంతో కారు పల్టీ కొట్టింది. లలిత (32) స్పాట్​లోనే చనిపోయింది. కారు బోల్తా పడిన సౌండ్​కు చిరుత పులి భయపడి అడవిలోకి పారిపోయింది. వెహికల్​లోనే అపస్మారక స్థితిలో ఉన్న ప్రభాకర్​ను స్థానికులు జీజీహెచ్ హాస్పిటల్​కు తరలించారు. ఈ మేరకు మోపాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.