కెనడా వెళ్లాలనుకునే విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎస్‎డీఎస్ వీసాల స్కీమ్ రద్దు

ఒట్టావా: మన దేశంతో దౌత్య వివాదం వేళ.. కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్ట్ ట్రాక్ స్టూడెంట్ వీసాల స్కీమ్‎ను రద్దు చేసింది. ఇందుకోసం తీసుకొచ్చిన స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (ఎస్ డీఎస్) ప్రోగ్రామ్‎ను శుక్రవారం నుంచే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఇండియా సహా 14 దేశాల స్టూడెంట్లపై ప్రభావం పడనుంది. కెనడాలో చదువుకునేందుకు వెళ్లే విదేశీ స్టూడెంట్లకు త్వరగా వీసాలు జారీ చేసేందుకు స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (ఎస్ డీఎస్) ప్రోగ్రామ్ ను 2018లో అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద ఇండియా, చైనా, ఫిలిప్పీన్ సహా 14 దేశాల స్టూడెంట్లకు వేగవంతంగా వీసాలు జారీ చేస్తున్నది. 

అయితే దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో ఎస్డీఎస్ ప్రోగ్రామ్ ను రద్దు చేయాలని కెనడా సర్కార్ నిర్ణయించింది. 2025లో 4.37 లక్షల మందికి మాత్రమే స్టడీ పర్మిట్ ఇవ్వాలని డెసిషన్ తీసుకుంది. అలాగే వీసాల జారీ రూల్స్‎ను కఠినతరం చేసింది. కాగా, కెనడాలో చదువుకునేందుకు మన దేశ స్టూడెంట్లు ఎక్కువ మంది వెళ్తుంటారు. ఇప్పుడా దేశం ఎస్ డీఎస్  ప్రోగ్రామ్​ను రద్దు చేయడంతో స్టూడెంట్లు కూడా సాధారణ పద్ధతిలో వీసాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల వీసా రావడానికి నెలల పాటు టైమ్ పడుతుంది.