సరైనా డైట్ పాటించకపోతే క్యాన్సర్ వస్తుందా?

టెన్షన్లు, ఒత్తిడి, వాతావరణ కాలుష్యం వంటి వాటి వల్ల క్యాన్సర్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా డైట్ సరిగా లేక కూడా క్యాన్సర్లు వస్తాయి. మహిళల్లో ప్రొటీన్​, ఇమ్యూనిటీ తగ్గడం వల్ల క్యాన్సర్ కారకాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు క్యాన్సర్​ ఉందని కనిపెట్టడం ఆలస్యం అవుతోంది. ఈ మధ్యకాలంలో మహిళలు కూడా ఆల్కహాల్ తీసుకోవడం పెరిగింది. అన్​హెల్దీ డైట్, ప్రాసెస్డ్ ఫుడ్​, లైఫ్​ స్టయిల్ డిజార్డర్స్, ఓవర్ వెయిట్, ఒబెసిటీ, డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ క్యాన్సర్​ రిస్క్​ ఫ్యాక్టర్స్. రసాయన ఉత్పత్తులు వాడడం, పండ్లు, కూరగాయలు తక్కువగా తినడం కూడా క్యాన్సర్​కు వెల్​కం చెప్పినట్టు అవుతున్నాయి. అదే మగవాళ్లలో చూస్తే పొగ తాగడం, ఆల్కహాల్​ తీసుకోవడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. పూర్వం ఇలాంటివన్నీ లేవు కాబట్టి క్యాన్సర్ అనేది ఎక్కడో ఒకచోట కనిపించేది. 

కానీ, ఇప్పుడు క్యాన్సర్​ చాలా కామన్​ అయిపోయింది. అడ్వాన్స్డ్ ట్రీట్​మెంట్​ వస్తున్నా. అందుకు సమానంగా కేసులు కూడా పెరుగుతున్నాయి. వేసవి కాలంలో ఎండ ఎక్కువ ఉండడం వల్ల యూవీ రేస్​కి ఎక్స్​పోజ్ అయ్యే ఛాన్స్​ పెరుగుతుంది.  ఈ సీజన్​లో ఎక్కువగా దొరికేది మామిడి. ఇందులో విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే ఆరెంజ్​, పుచ్చకాయలు తినాలి. పండ్లను ఎక్కువగా తినే సీజన్​ ఇదే. వానాకాలం, చలికాలాల్లో పండ్లు ఎక్కువగా తినాలనిపించదు. కాబట్టి వేసవిలో దొరికే పండ్లన్నీ తినడం ఆరోగ్యాని​కి మంచిది. మొత్తంమీద చెప్పొచ్చేదేంటంటే... తినే తిండి​తోనే క్యాన్సర్​కి అడ్డుకట్ట వేయొచ్చు. అలాగే స్క్రీనింగ్ టెస్ట్​లు చేయించుకునేం దుకు జంకకూడదు. ఎర్లీ స్టేజ్​లో డయాగ్నసిస్ చేసుకోవడం చాలా ముఖ్యం.

క్యాన్సర్​ ట్రీట్​మెంట్ తీసుకునేవాళ్లు పచ్చి ఆహారం తినకూడదు. అలాగే ప్రాసెస్డ్​, దుమ్ము, ధూళి పడుతూ ఆరు బయట అమ్ముతున్న పదార్థాలు తినొద్దు. మాంసాహారం తినకూడదు. ఎందుకంటే ట్రీట్​మెంట్​లో భాగంగా కీమో, రేడియేషన్ ఇస్తుంటారు. దానివల్ల వాళ్లు బలహీనంగా అవుతారు.  అందుకని ఎక్కువగా జొన్నలు, మెంతులు, రాజ్మా వంటి ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినాలి. వీటిలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. 

ట్రీట్​మెంట్ తీసుకుంటున్న వాళ్లకు ఈ ఫుడ్ చాలా అవసరం. ట్రీట్​మెంట్ జరిగేటప్పుడే కాదు ఆ తర్వాత కూడా డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే శరీరం వీక్​గా ఉండి క్యాన్సర్ సెల్స్ మళ్లీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఇదే పొరపాటు చేస్తుంటారు. క్యాన్సర్​ ట్రీట్​మెంట్ తరువాత నార్మల్ డైట్​కి వచ్చేస్తారు. దానివల్ల మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. అలాకాకుండా... మంచి ఫుడ్ తిని, ఎక్సర్​సైజ్​ చేస్తూ, చుట్టూ ఉన్న వాతావరణం హెల్దీగా ఉంచుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు. 

డా.సుజాత స్టీఫెన్ చీఫ్ న్యూట్రిషనిస్ట్
యశోద హాస్పిటల్స్, హైదరాబాద్