Happy News : భక్తితో సంతోషంగా ఉండొచ్చా.. భక్తి అంటే గుడికి వెళ్లటమేనా..!

భక్తి అంటే ఏమిటి? సంతోషంగా ఉండాలంటే ఎలా జీవించాలి? భక్తితో సంతోషంగా ఉండొచ్చా? అవును, ఉండొచ్చు అని చెప్తున్నాయి ఆధ్యాత్మిక గ్రంథాలు.

దేవుడ్ని స్వార్థం లేకుండా పూజించాలి. కావాలి, అది కావాలి అనికోరుకోకూడదు. అనుకున్నది జరిగితే, కష్టం తీరితే మళ్లీ నీ దర్శనానికి వస్తాం... అని మొక్కకూడదు. దేవుడ్ని ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో చూడకూడదు. నిండు మనసుతో, తనను తాను అంకితం చేసుకోవడమే భక్తి. ఆ భక్తి కేవలం దేవుడి మీద మాత్రమే ఉంటే సరిపోదు. రోజువారీ జీవితంలో కూడా భాగం కావాలి. అప్పుడే సంతోషంగా ఉండగలరు. అదెలాగంటే..!

దొరకదు

ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారుతుందో చెప్పలేరు!? అలాగే ఎప్పుడూ ఒకేలా ఉండాలని ఎవరూ కోరుకోరు. ఉన్న దానికంటే ఇంకాబాగుండాలని కోరుకుంటారు. ఇంకా సంపాదించాలనుకుంటారు. కొత్త వస్తువులు కొనాలనుకుంటారు. ఎక్కువ డబ్బు కూడబెట్టాలనుకుంటారు. ఆస్తులు పోగేసుకోవాలనుకుంటారు. కానీ అవన్నీ సంతోషాన్ని ఇస్తాయా?,సుఖాన్ని ఇస్తాయా? అని ఆలోచించరు.

డబ్బు, వస్తువులు.. సుఖాన్ని మాత్రమే ఇస్తాయి. వాటికోసమే పరుగులు తీస్తున్నారు. దేవుడిని కోరుకునే కోర్కెలు కూడా ఇలాంటివే. కానీ సంతోషం అంటే భక్తిమార్గంలో వేరే అర్ధం ఉంది. జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలు, లాభనష్టాలు అన్నింటినీ ఒకేలా చూడాలి. లోకంలో దొరికే భౌతికమైన సుఖాల్లో సంతోషం దొరకదని వేదాల నుంచి పురాణాల వరకు అన్నీ చెప్తున్నాయి.

ప్రయాణం

సంతోషంగా బతకాలి అంటే జీవితాన్ని ఒక ప్రయాణంలా తీసుకోవాలి. అంతేగానీ, ఇది నాకే సొంతం. నాకే కావాలి. నా నుంచి ఎవరూ లాక్కోకూడదు అని ఆలోచించకూడదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరోశరీరంలోకి ప్రవేశిస్తుంది అని భగవద్గీత చెప్తుంది. ఆనందంగా బతకాలంటే జీవితాన్ని ఒక మజిలీలా మాత్రమే చూడాలి.

అప్పుడే 'నేను సంపాదించిన ఆస్తి ఎవరన్నా తీసుకెళ్తారేమో, నా అనుకున్న వాళ్లు దూరం అవుతారేమో. మా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పొలం మరొకరికి వెళ్తుందేమో' అనే భయాలు ఉండవు. ఈ ఆలోచనను బంధువులు, స్నేహితులకు కూడా అన్వయించుకోవాలి. అయితే ఇది ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాదు. అలవాటు చేసుకుంటే ఏమంత కష్టమూ కాదు. 

సంతోషం సాధ్యమే..

ఈశావాస్యోపనిషత్తు కేవలం ఒక విషయం గురించి తెలుసుకుంటే సరిపోదు. దాని లోతుపాతుల గురించి కూడా తెలుసుకోవాలి. అని చెప్తుంది. ఎక్కువమంది దేనినైనా చూసి ఆగిపోతారు, బాగుంది, బాగాలేదు అని మాత్రమే కామెంట్ చేస్తారు. కానీ సంతోషంగా బతకాలంటే దాన్ని వశం చేసుకోవాలని చెప్తుంది ఈ ఉపనిషత్తు. కొందరికి ఎంత ఉన్నా ఇంకా కావాలనే ఉంటుంది. అలాంటి వాళ్లు మనసు మాట వింటారు.

వాళ్లకు సంతోషం దొరకదు. ఎవరైతే మనసును కట్టడి చేసి, వాళ్ల మాట మనసు వినేలాచేసుకుంటారో వాళ్లకే తృప్తితో బతకడంసాధ్యమవుతుంది. దేనికీ లొంగకుండా, సుఖాలకు అంటీ అంటనట్లు ఉన్నవాళ్లే సంతోషంగా బతుకుతారు. భగవంతుడి గుణాల గురించి వేదాల్లో ఆకారం లేనివాడు, పాపంలేనివాడు, తేజోవంతుడు, స్వచ్ఛమైనవాడు అని చెప్పారు. అందువల్ల మనిషి కూడా పాపాలు చేయకుండా, స్వచ్ఛంగా, ఈ లోకంలో దొరికే వాటిపై ఆశపడకుండా బతకాలి. అలా జీవించినప్పుడే సంతోషం సొంతమవుతుంది.

భక్తిలో బతకడమే..

భక్తి అంటే.. గుడికెళ్లి దేవుడికి పూజలు చేయడం మాత్రమే కాదు, అదో జీవనమార్గం అని చెప్తాయి పురాణాలు. ప్రేమను ఇవ్వడం, ప్రేమను పొందడం. చిన్న చిన్న బంధాలు, స్నేహాలు, ఇష్టాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, చేతనైన సాయం చేయడాల్లో అంతులేని సంతోషం దాగి ఉంది అంటాయి. కోరికలను అదుపుచేసుకోవడం. విలువలతో బతకడం కూడా భక్తిలో భాగం అని చెప్తాయి. కన్ను, ముక్కు, నోరు, చర్మం లాంటి ఇంద్రియాల వల్ల కలిగే సుఖాలకు లోనుకాకుండా జీవించడం కూడా భక్తి మార్గమే.

మనసు మాయలోపడి తప్పులు చేయకుండా ఉండటం లాంటివన్నీ భక్తికి సంబంధించినవే. పాపం చేస్తే గుడికి వెళ్లి క్షమించమని అడిగితే సరిపోతుంది. దేవుడు పాపాలు కడిగేస్తాడు అనే ఆలోచన, పొరపాట్లు చేయడానికి మనిషిని ప్రేరేపిస్తుంది. ఏ పనైనా విశ్లేషణ, విచారణ, ఆచరణతోనే సాధ్యం అవుతుంది. సంతోషంగా బతకడం కూడా ఇలాంటిదే..