మదర్ డెయిరీ ఎన్నికల్లో.. క్యాంపు పాలిటిక్స్​ షురూ

  • ఈనెల 13న ఎన్నికలు.. కాంగ్రెస్​, బీఆర్ఎస్ మధ్యనే పోటీ
  • ఓటర్లను కాపాడుకునేందుకు ఇరువర్గాలు ముమ్మర ప్రయత్నాలు

నల్గొండ, వెలుగు : మదర్​ డెయిరీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి.  శని, ఆదివారాలు సెలవు రోజులు కాగా.. సోమవారం నుంచి క్యాంపు పాలిటిక్స్ షురూ చేసేందుకు  ఇరు వర్గాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఆలేరు కేంద్రంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ మహేందర్​రెడ్డి మధ్య నువ్వా నేనా..అనే రీతిలో హోరాహోరీ నడుస్తున్నాయి. ఈనెల13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరువర్గాలు తమ ఓటర్లను క్యాంపులకు తరలించేందుకు సిద్ధమవుతున్నాయి.  297 మంది సొసైటీ చైర్మన్లు ఓటర్లు. దీంట్లో కాంగ్రెస్​ఓటర్లు రెండొందలకు పైగా ఉండగా..  బీఆర్ఎస్​ ఓటర్లు 80 మందికి పైగా ఉన్నారు. ఎ న్నికల నాటికి ఓటర్లు చేజారిపోకుండా ఉండేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.  డెయిరీ ఎన్నికల బాధ్యతలు నిర్వరిస్తున్న ఎమ్మెల్యే అయిలయ్య తనవర్గాన్ని కాపాడుకునేందుకు వ్యూహాన్ని రూపొందించారు. 

డీసీసీబీలో మెజార్టీ డైరెక్టర్లు బీఆర్ఎస్​ వైపే ఉన్నప్పటికీ  తన చైర్మన్​పీఠాన్ని కాపాడుకోవడంలో మహేందర్​రెడ్డి విఫలమయ్యారు. అవిశ్వాస తీర్మానం పెట్టేవరకు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా ఆలేరులో రాజకీయంగా తన ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఓటుకు రూ.30 వేల వరకైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడేది లేదని ఇరువర్గాలు సవాల్​చేస్తున్నాయి. అయిలయ్య మద్దతుదారుడు మధుసూదన్​ రెడ్డి చైర్మన్​అభ్యర్థిగా బరిలో ఉండగా, మహేందర్​రెడ్డి ప్యానల్ నుంచి కొండల్​రెడ్డి పోటీలో ఉన్నారు.  డెయిరీ ఎన్నికల్లో క్రాస్​ ఓటింగ్​అనేది సర్వసాధారణం. అయితే ఆలేరులోనే 130 మంది పైగా ఓటర్లు ఉండటంతో ఇరువర్గాల్లో టెన్షన్​నెలకొంది.