క్యాంప్​ రాజకీయాలు షురూ.. మహబూబ్‌‌నగర్‌‌ లోకల్‌‌ ఎమ్మెల్సీ కోసం కాంగ్రెస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ కసరత్తు

మహబూబ్‌‌నగర్‌‌ లోకల్‌‌ బాడీ ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్‌‌ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,439 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ మెంబర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటు వేయనున్నారు. స్థానిక సంస్థల్లో మొదట్లో బీఆర్ఎస్‌‌కు బలం ఉన్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ అధికారంలోకి రావడంతో బలాబలాలు తారుమారయ్యాయి. బీఆర్‌‌ఎస్‌‌ క్యాండిడేట్‌‌ నవీన్‌‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌‌రెడ్డితో పాటు మాజీమంత్రులు నిరంజన్‌‌రెడ్డి, శ్రీనివాస్‌‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కష్టపడుతున్నారు. చాలామంది లోకల్​బాడీల ప్రజాప్రతినిధులు బీఆర్‌‌ఎస్‌‌కు గుడ్‌‌బై చెప్పి కాంగ్రెస్‌‌లో చేరిపోయారు. 

మిగిలిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను, కౌన్సిలర్లను కుటుంబసమేతంగా కర్నాటక, గోవా తదితర ప్రాంతాల్లో క్యాంప్‌‌లకు తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులను మాజీ ఎమ్మెల్యేలు దగ్గరుండి మరీ గురువారం బస్కెక్కించారు. బస్సుల్లో అంతదూరం జర్నీ చేయలేమని కొందరు, ఫ్యామిలీతో సహా రావాలని ఆహ్వానించినప్పటికీ కొందరు మహిళా ప్రతినిధులు క్యాంప్‌‌లకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌‌ లీడర్లు శుక్రవారం బయలుదేరనున్నారు. కర్నాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో క్యాంప్‌‌లు ఏర్పాటు చేశారు. విహారయాత్రలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా నియోజకవర్గానికి ఓ ఇన్‌‌చార్జిని నియమించారు. 

‘స్థానిక’ లీడర్లకు ఆఫర్లు

బీఆర్‌‌ఎస్‌‌ అధికారంలో ఉన్నన్ని రోజులు లోకల్​బాడీస్‌‌ ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు స్థానిక లీడర్లను ఖాతరు చేయలేదు. ఏడాదిన్నర కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ నుంచి పోటీ లేకపోవడంతో రెండు సీట్లను బీఆర్‌‌ఎస్సే గెలుచుకుంది. ఇప్పడు పరిస్థితి మారడంతో ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లకు స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్లు ముందు పెడుతున్నారు. ఎంపీటీసీలకు రెండు పార్టీలు ఆఫర్లు ఇస్తుండగా, కౌన్సిలర్లను పార్టీల వారీగా కట్టడి చేస్తున్నారు. జిల్లాలో బీజేపీకి చెందిన సభ్యలు కాంగ్రెస్‌‌కు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్యాంపుల్లోనే సంప్రదింపులు పూర్తి చేసి వారి డిమాండ్లను నెరవేర్చనున్నట్టు సమాచారం.