స్థానికత ప్రకారమే పోస్టింగ్స్! 317 జీవోపై సీఎం రేవంత్‌కు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు

  • ఖాళీగా ఉన్న పోస్టుల్లో 317 జీవో బాధితుల సర్దుబాటు
  • అవసరమైతే సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేయాలని సూచన 
  • దీనిపై 26న కేబినెట్ మీటింగ్​లో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: 317 జీవో బాధితులకు స్థానికత ఆధారంగానే ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మ్యూచువల్, స్పౌజ్, మెడికల్ గ్రౌండ్ బదిలీలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే చాన్స్ ఉంది. 317 జీవోపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి ఈ మేరకు సూచనలు చేసినట్టు తెలిసింది.ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో 317 జీవో బాధితులను సర్దుబాటు చేయాలని.. మ్యూచువల్, స్పౌజ్, మెడికల్ గ్రౌండ్ బదిలీలు చేపట్టాలని.. ఆ తర్వాత ఇంకెవరైనా మిగిలితే సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేయాలని ప్రభుత్వానికి కమిటీ సూచించినట్టు సమాచారం. 

317 జీవో ఇష్యూపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్ గా.. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 8 నెలలు అధ్యయనం చేసి సర్కార్ కు రిపోర్టు ఇచ్చింది. ఈ రిపోర్టును సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు ఆదివారం అందజేశారు. కాగా, కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై సీఎస్ శాంతికుమారితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఆ తర్వాత ఈ నెల 26న జరగనున్న కేబినెట్ మీటింగ్ లో చర్చించి నిర్ణయం 
తీసుకోనున్నారు.  

8 నెలలు అధ్యయనం.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో 317 జీవోను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉద్యోగుల బదిలీలు చేపట్టింది. అయితే, ఈ జీవోను ఉద్యో గులు వ్యతిరేకించారు. స్థానికతను పరిగణనలోకి తీసు కోకుండా ఒక జిల్లాకు చెందిన ఉద్యోగులను మరో జిల్లాకు బదిలీ చేశారని ఆందోళనలు చేపట్టారు. ఈ బదిలీల వల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ జీవోపై అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ కూడా ఆందోళనలు చేశాయి. 317 జీవో బాధితులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. 

ఈ కమిటీ ఉద్యోగ, టీచర్ సంఘాలతో మాట్లాడి.. జీవోపై అభ్యంతరాలు, సవరణపై సలహాలు, సూచనలు తీసుకుంది. ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ఏర్పాటు చేసి ఆన్ లైన్ ద్వారా కూడా సలహాలు, సూచనలు తీసుకుంది. అలాగే అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతోనూ సమావేశాలు నిర్వహించింది. శాఖల వారీగా, పోస్టుల వారీగా ఖాళీల వివరాలు సేకరించింది. దాదాపు 12 సార్లు కేబినెట్ సబ్ కమిటీ 
భేటీ అయింది. 

జీవోలో సవరణకుత్వరలో కేంద్రానికి లేఖ.. 

317 జీవోతో నష్టపోయిన ఉద్యోగులు, టీచర్లు కలిపి దాదాపు 16 వేల మంది ఉంటారని అధికారులు అంచనా వేశారు. వీరిలో ఎక్కువగా ఎడ్యుకేషన్, హోమ్, హెల్త్ డిపార్ట్ మెంట్ నుంచి ఉన్నట్టు తేల్చారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో 317జీవో తెచ్చింది. అయితే ఆ జీవోలో సవరణ చేయాలంటే 36 నెలల గడువు ఉంటుంది. ఈ గడువు దాటితే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని రాష్ర్టపతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ గడువు దాటడంతో 317 జీవోలో సవరణకు కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం లేఖ రాయాల్సిన అవసరం ఉంటుందని న్యాయ నిపుణులు కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. 
ఈ నేపథ్యంలో త్వరలోకేంద్రానికి రాష్ట్ర సర్కార్లేఖ రాసే చాన్స్ ఉంది.