ఇతనో క్యాబ్ డ్రైవర్. మరయితే ఆ చేతులు కారు స్టీరింగ్ మీద కదా ఉండాలి. మరి ఇదేంటి... ఫుడ్ ఏదో ప్యాక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అనుకుంటున్నారా? అవును ఇతను ఒకప్పుడు క్యాబ్ డ్రైవరే! కానీ ఇప్పుడు కాదు. క్యాబ్ డ్రైవర్‌గా ఉన్నప్పుడు బుర్రలో పుట్టిన ఒక ఐడియాకు రూపం ఇచ్చాడు. ఇప్పుడు ఒక ఫుడ్ అవుట్‌లెట్‌కి ఓనర్ అయ్యాడు. భద్రాచలంకు చెందిన 32 ఏళ్ల ఈ యువకుడి పేరు
రాయల సందీప్.
సందీప్ చదివింది ఇంటర్మీడియెట్. తొమ్మిదేండ్లు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ పనిచేస్తున్నప్పుడు దేశంలో అనేక ప్రాంతాలకి వెళ్లేవాడు. తన క్యాబ్‌లో జర్నీ చేసిన టూరిస్ట్‌లు నచ్చిన ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని వెళ్లిన ప్రాంతాల్లో ఉండే హోటళ్లకు వెళ్లడాన్ని గమనించాడు. అప్పుడే అతనికి ఫుడ్‌కి సంబంధించిన బిజినెస్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అదికూడా తాను పుట్టిన ఊళ్లో చేస్తే ఇంకా బెటర్ అనుకున్నాడు.
అలాగని ఆలోచన ఒక్కటీ ఉంటే చాలదు కదా. అందులో ఎలా సక్సెస్ కావాలో కూడా తెలిసి ఉండాలి. అది తెలుసుకోవడం కోసం చాలా ప్రాంతాలు తిరిగాడు. అక్కడ వాళ్లు ఫుడ్ బిజినెస్‌లో ఎలా సక్సెస్ అవుతున్నారో తెలుసుకున్నాడు.
ఆ తరువాత పట్టణాలకే పరిమితమైన కొన్ని వంటకాలను భద్రాచలం మన్యంలోని వాళ్లకి రుచి చూపించాలి అనుకున్నాడు. ‘మిస్టర్ పలావ్’ను 2021 డిసెంబరు 4వ తేదీన ఐటీడీఏ రోడ్డులో మొదలుపెట్టాడు. ‘‘ఊరికి మూలగా ఉండే ఈ ప్రాంతంలో హోటల్ ఎలా నడుస్తుంది? ఇది మూణ్ణాల ముచ్చటే” అని నవ్వారు కొందరు. అయినా తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని వెరైటీగా ఆలోచించాడు. వ్యాపారంలో సక్సెస్ అయ్యాడు.
అందరిలా కాదు
ఊళ్లో హోటల్ అంటే... చికెన్, మటన్, రొయ్యలు, చేపల బిర్యానీలే కాకుండా మెట్రో సిటీల్లో దొరికే వెరైటీ వంటకాలు ఉండాలి అనుకున్నాడు. అందుకే ‘మిస్టర్ పలావ్’ హోటల్లో సాంబార్ రైస్ విత్ చికెన్, రాజుగారి పలావ్, కొత్తిమీర పలావ్, చికెన్ పలావ్, గోంగూర చికెన్ పలావ్... వంటి ఫుడ్ ఐటమ్స్ వడ్డిస్తున్నాడు. రూ.130లకే సాంబారు రైస్ విత్ చికెన్ ఇవ్వడంతో గిరాకీ బాగా పెరిగింది. దాంతో మిడిల్ క్లాస్ వాళ్లు వారాంతాల్లో హోటల్‌కు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.
అన్ని రకాల నాన్వెజ్ఫుడ్స్ తక్కువ ధరకే దొరకుతుండటంతో భద్రాచలం చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా మిస్టర్ పలావ్ హోటల్‌కు ‘క్యూ’ కడుతున్నారు. స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు బాగా వస్తున్నాయి. సాంబార్ రైస్ విత్ చికెన్‌కు డిమాండ్ ఉంది. టేస్టీ, క్వాలిటీ ఫుడ్ దొరికితే హోటల్ ఎంత మూలన ఉన్నా కస్టమర్లు వస్తారని నిరూపించాడు సందీప్. రోజుకు రూ.20వేల వ్యాపారం జరిగితే సిబ్బంది జీతాలు, కరెంట్, సరుకుల ఖర్చులకు రూ.13వేలు అవుతాయి.
- మొబగాపు ఆనంద్‌కుమార్ భద్రాచలం, వెలుగు
కష్టపడితే చాలు...
‘‘కష్టపడందే ఫలితం రాదు. మనం ఎంచుకున్న రంగంపై అవగాహన లేకపోతే ఎంత పెట్టుబడి పెట్టినా బూడిదలో పోసిన పన్నీరే. మన్యంలో అందరూ ఇష్టపడుతున్న సాంబార్ రైస్ విత్ చికెన్ వంటకం కోసం హైదరాబాదు నుంచి చెఫ్ తీసుకొచ్చా. ఆ చెఫ్ నా ఫ్రెండ్. అందుకని ఒక పక్కన కౌంటర్ చూసుకుంటూనే మరో పక్క ఆ వంటకం ఎలా తయారుచేయాలో నేర్చుకున్నా. నాన్‌వెజ్ రెసిపీలకు కావాల్సిన నాణ్యమైన మసాల దినుసులు, సాస్‌లను హైదరాబాదు నుంచి తెప్పిస్తా.
చుట్టు పక్కల గ్రామాల నుంచి స్వచ్ఛమైన గేదె నెయ్యి కొంటున్నా. నేపాల్‌తో పాటు, ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి వంటమాస్టర్లను తీసుకొచ్చా. హైదరాబాద్ నుంచి వచ్చిన చెఫ్ ఫ్రెండ్ రెండేండ్ల తర్వాత వెళ్లిపోయాడు. దాంతో సాంబార్ రైస్ విత్చికెన్ రెసిపీ నేనే చేస్తున్నా. భద్రాచలం టూరిస్ట్ స్పాట్. రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకే పలు ప్రాంతాల నుంచి వచ్చే టూరిస్టుల టేస్ట్‌కు తగ్గట్టు వెజ్ వంటకాలతో హోటల్ ఏర్పాటు చేయాలి అనే ఆలోచన ఉంది. ఆయా ప్రాంతాల్లో దొరికే టిఫిన్లు, భోజనాలు ఇక్కడే తయారు చేసి అందించాలి. త్వరలోనే ఆ కల కూడా సాకారం చేసుకుంటా ” అంటున్నాడు రాయల సందీప్.