జగిత్యాల జిల్లాలో తాళ్లతో కట్టేసి.. చంపుతామని బెదిరించి.. రూ. 10 లక్షల విలువైన ఆభరణాలు దోపిడీ

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా బీర్పూర్  మండల కేంద్రానికి చెందిన వ్యాపారి కాసం ఈశ్వరయ్యను తాళ్లతో కట్టేసి రూ.10 లక్షల విలువైన నగలు ఎత్తుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి.. కాసం ఈశ్వరయ్య,  భాగ్యలక్ష్మి దంపతుల ఇంట్లో తెల్లవారుజామున ప్రహరీగోడ లోపల ఉన్న బాత్రూంలో నలుగురు దొంగలు మాస్కులు ధరించి మాటు వేసి ఉన్నారు. వ్యాపారి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం బాత్రూంకు వెళ్లగా, అప్పటికే బాత్రూంలో ఉన్న దొంగలు వ్యాపారిపై దాడికి దిగారు.

వ్యాపారి నోరు మూసి ఇంట్లోకి లాక్కెళ్లి తలపై కొట్టి మెడలో ఉన్న గొలుసు, చేతి బ్రాస్లెట్, ఉంగరం లాక్కున్నారు. గదిలో ఉన్న శంకరయ్య భార్య భాగ్యలక్ష్మి మెడలో పుస్తెలతాడు, కాళ్ల పట్టీలు దోచుకున్నారు. 10 తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ సొత్తు పేదలకు పంచుతాం.. పోలీసులకు చెప్పవద్దంటూ తనను బెదిరించారని బాధితుడు చెప్పాడు. స్థానికులు బాత్రూంలో దొంగలు బంధించిన శంకరయ్యను విడిపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ రఘుచందర్  ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎంక్వైరీ చేపట్టారు.