చేపల పెంపకం 50 శాతమే

  • పంపిణీ కోటాను తగ్గించిన ప్రభుత్వం
  • సందిగ్ధంలో మత్స్యకారులు
  • ఉపాధిపై తప్పని ప్రభావం

నిర్మల్, వెలుగు:  చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లల పెంపకం వ్యవహారం గందరగోళంగా మారుతోంది. మూడు నెలల క్రితమే జరగాల్సిన చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఇప్పటివరకు కూడా మొదలు కాకపోవడంతో జిల్లాలోని మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చేప పిల్లల టెండర్ల వ్యవహారంలో తీవ్రమైన జాప్యం జరగడం, పంపిణీదారులు సిండికేట్ గా ఏర్పడడంతో ప్రక్రియ ఇప్పటివరకు మొదలు కాలేదు. ఇప్పటికే మూడు నెలల కాలం గడిచిపోవడంతో వేసవి వరకు పూర్తిస్థాయిలో చేప పిల్లల పెంపకం కష్టసాధ్యమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ప్రభుత్వం నిర్దేశించిన జిల్లాల వారి కోటా నుంచి కేవలం 50 శాతం మాత్రమే చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. 

4 కోట్ల 75 లక్షల చేప పిల్లల పంపిణీ లక్ష్యం

నిర్మల్​జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో గతేడాది 4 కోట్ల 15 లక్షల చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈసారి మొత్తం 4 కోట్ల 75 లక్షల పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈసారి 3 కోట్ల 37 లక్షల చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొత్తం 664 చెరువులతో పాటు ఎస్సారెస్పీ, కడెం, గడ్డన్న వాగు, స్వర్ణ, పల్సీకర్ రంగారావు ప్రాజెక్టుల్లో కూడా చేప పిల్లలను వదలనున్నారు.

ఉపాధిపై ప్రభావం

జిల్లాలోని 214 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 13,300 మంది సభ్యులున్నారు. సభ్యత్వం లేక కుల సంఘాల్లో ఉన్నవారిని కూడా కలుపుకుంటే దాదాపు 20 వేల మంది జిల్లా వ్యాప్తంగా చేపల వేటపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. చేపలను నాగపూర్, యవత్మాల్, నాందేడ్ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈసారి చెరువుల్లో చేప పిల్లలను వదలడం ఆలస్యం కావడం, నిర్దేశించిన కోటా లక్ష్యాన్ని కన్నా 50 శాతం తక్కువగా పంపిణీ చేస్తుండడంతో మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం చూపనుంది. వ్యవధి తక్కువగా ఉండడంతో వాటి పెరుగుదలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నెల 7 తర్వాత పంపిణీ

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ ఏడాది 50 శాతం చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేయనున్నాం. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈనెల 7 తర్వాత జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేపడతాం. 2 కోట్ల 37 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయబోతున్నాం. మత్స్యకారుల ఉపాధికి భరోసా కల్పిస్తాం.- విజయ్ కిరణ్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి, నిర్మల్