గంగాధర మండలంలో.. సమస్యల్లో శ్మశాన వాటికలు

గంగాధర, వెలుగు :   గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన శ్మశాన వాటికలు,  నిరుపయోగంగా ఉంటున్నాయి.   కురిక్యాల, చిన్న ఆచంపల్లి శ్మశానవాటికలను చెరువు శిఖంలో నిర్మించారు. ఏటా  కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండుకుండలా మారుతుండడంతో శ్మశానవాటికల్లో దహనసంస్కారాలు చేసే పరిస్థితి లేకుండాపోయింది. 

 దీంతో ఆయా గ్రామాల్లో ఎవరైనా చనిపోతే వారి పంటచేలల్లో, పంట చేలు లేనివారు చెరువు కట్ట పక్కన దహన సంస్కారాలను కానిచ్చేస్తున్నారు. హిమ్మత్​నగర్​లో శ్మశానవాటికను ఒర్రె పక్కన నిర్మించి ఒర్రెలో పైపులు వేసి రోడ్డు నిర్మించారు. మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో శ్మశానవాటికలోకి వెళ్లేందుకు దారిలేకుండాపోయింది.

 కురిక్యాలలో డంపింగ్​యార్డును చెరువు శిఖంలో నిర్మించగా పూర్తిగా నీటితో నిండిపోయింది. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఈ మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా అధికారులు ఇకనైనా స్పందించి శ్మశానాలను దారి నిర్మించి వినియోగంలోకి తీసుకురావాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.