పిడుగుపాటుకు పాడి గేదె మృతి

తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న(2024 మార్చి 16 శనివారం) రాత్రి అకాల వర్షాలతో వడగండ్లు పడ్డాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో నిన్న రాత్రి ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఈ క్రమంలో పిడుగుపడి పాడి గేదె చనిపోయింది. రూ. 60 వేలు విలువ చేసే  జీవనోపాధి అయిన గేదె చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతు బుర్ర రమచంద్రం గౌడ్. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు. 

మరో రెండు వారాల్లో కోతలు షురూ కానుండగా అకాల వర్షాలు వరిపంటను దెబ్బతీశాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బాపునగర్ గ్రామంలో నిన్న(2024 మార్చి 16) సాయంత్రం వడగళ్ల వాన పడింది. దీంతో రైతులు పండించిన వరి పంటకు  తీవ్రంగా నష్టం వాటిల్లింది. అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను 2024 మార్చి 17 ఆదివారం  మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.

 నిజామాబాద్​జిల్లాలోని సిరికొండ, ఇందల్వాయి మండలాల్లో సుమారు 40 నిమిషాల పాటు వర్షం కురిసింది. ఆర్మూర్, మోపాల్​ మండలాల్లో చినుకులు పడ్డాయి. నిజామాబాద్​లో సుమారు గంటపాటు కరెంట్​సరఫరా నిలిచిపోయింది.

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ఈదురు గాలులకు  చిన్నచిన్న చెట్లు పడిపోయాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు ఏరియాల్లో కరెంట్​సప్లయ్ ​నిలిచిపోయింది. వడగళ్లతో పంట నష్టం జరిగినట్లు రైతుల నుంచి సమాచారం అందుకున్న రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్ ​భూపతిరెడ్డి అగ్రికల్చర్​ ఆఫీసర్లతో ఫోన్​లో మాట్లాడారు.