నామినేటెడ్​ పదవులపై..చిగురిస్తున్న ఆశలు

  •     కీలక నేతల పైరవీలు మొదలు..!
  •     మహిళా నేతలకే వ్యవసాయ మార్కెట్ ​కమిటీలు
  •     ఎమ్మెల్యేలు మాటిచ్చినా వారికి అవకాశం లేకపాయె
  •     మార్కెట్ పదవులు సవాలే

నాగర్​ కర్నూల్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగియడంతో ​నామినేటెడ్ ​పోస్టులపై జిల్లా కాంగ్రెస్​ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రస్థాయి కార్పొరేషన్స్ డైరెక్టర్ పోస్టులు మొదలుకొని ఇక్కడి ప్రముఖ దేవాలయాలు, మార్కెట్ కమిటీలు ఎక్కడ అవకాశం ఉన్నా దక్కించుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఇటీవల జిల్లా నుంచి కొల్లాపూర్​ జగదీశ్వర్​రావుకు మైనర్​ఇరిగేషన్​ కార్పొరేషన్​చైర్మన్​ పదవి దక్కగా, జడ్పీ వైస్ ​చైర్మన్ ​బాలాజీ సింగ్​కు పీసీబీ మెంబర్​గా అవకాశం వచ్చింది. ఐక్యతా ఫౌండేషన్​చైర్మన్​ సుంకిరెడ్డి రాఘవేందర్​రెడ్డి ప్రస్తుతం రేసులో ఉన్నారు.

జిల్లాలోని నాలుగు వ్యవసాయ మార్కెట్​కమిటీ చైర్మన్​పదవుల్లో మూడు మహిళలకు రిజర్వ్​ చేయగా, కొల్లాపూర్ మార్కెట్ చైర్మన్​పదవిని ఎస్టీ జనరల్​కు కేటాయించారు. అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్​ కర్నూల్​ను వరుసగా​ఎస్సీ, బీసీ–బీ, ఓసీ మహిళలకు ఇచ్చారు. దీంతో తమ సతీమణులను మార్కెట్ ​చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టాలన్న లక్ష్యంతో కాంగ్రెస్​ కీలక నేతలు పైరవీలు చేస్తున్నట్లు సమాచారం.

పదవి కత్తిమీద సామే.. 

మార్కెట్​ చైర్మన్లుగా బాధ్యత స్వీకరించే వారికి పదవి కత్తిమీద సాములా మారనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మార్కెట్​యార్డుల్లో ఏటా రూ.వందల కోట్లలో లావాదేవీలు జరుగుతాయి. లావాదేవీల విలువ ఆధారంగా ఒక శాతం పన్నుతో మార్కెట్లకు రూ.కోట్లల్లో ఆదాయం సమకూరుతుంది. మూడేళ్ల ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని మార్కెట్ యార్డుల్లో చేపట్టే వార్షిక నిర్వహణ, అభివృద్ధి పనులు, జీతభత్యాలకు బడ్జెట్ విడుదల చేస్తారు.వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే జరుగుతుంటాయి.

రైతులు మార్కెట్​ తెచ్చే వాటిలో పల్లీ, మొక్కజొన్న ముఖ్యమైనవి. పల్లీ రైతులు మార్కెట్ల కంటే వ్యాపారులకు అమ్మడానికే మొగ్గు చూపిస్తారు. కొనుగోలు ధరపై ఒక శాతం మార్కెట్​ ఫీజు చెల్లించి, పల్లీ పలుకు బయటి మార్కెట్లకు తరలించే అవకాశం ఉన్నా చాలా వరకు జీరో దందా నడుస్తోంది. ఒక శాతం మార్కెట్​ ఫీజు కడితే 4 శాతం వ్యాట్​చెల్లించాలనే నిబంధన ఉంది. దాని తప్పించడానికి జీరో దందాకు వ్యాపారులు ఊతమిస్తున్నారు. అలాగే గోదాములు, షాపుల నిర్వహణ, ట్రేడర్లు, కమీషన్​ ఏజెంట్ల లైసెన్సులు, రైస్, ఆయిల్​ మిల్లులు, డికార్డి గేటర్లు

పత్తి మిల్లుల నెలవారీ కొనుగోలు లావాదేవీల అసెస్​మెంట్ ​రిపోర్ట్స్, కూరగాయల మార్కెట్​తదితర అంశాలపై చైర్మన్లు నిరంతరం పర్యవేక్షణ, నిఘా పెట్టాలి.  ఇవేకాకుండా మార్కెట్​లో రైతులకు కనీస మద్దతు ధర, కనీస వసతులు, నిలువ నీడ, తాగేందుకు నీళ్లు, వర్షాకాలంలో టార్పాలిన్లు​ సమకూర్చాల్సి ఉంటుంది. మార్కెట్లోకి పందులు, పశువులు వచ్చి ధాన్యం పాడు చేయకుండా గేట్ల ముందు యానిమల్ గ్రిల్స్​ ఏర్పాటు చేయాలనే ప్రొవిజన్​ ఉంది. మార్కెటింగ్​ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాముల్లో ధాన్యానికి ఇన్యూరెన్స్ చెల్లించి భద్రత కల్పించాలి. గతంలో ఇన్సు​రెన్స్​ రెన్యువల్​ చేయకుండా  డబ్బులును వాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

వాళ్లంతా అప్పటివరకు ఆగాల్సిందే..!

అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల్లో కష్టపడిన సీనియర్​ లీడర్లకు మార్కెట్​ కమిటీ చైర్మన్లుగా అవకాశం ఇస్తామని ఎమ్మెల్యేలు మాటిచ్చినా రిజర్వేషన్లతో ఆ అవకాశం లేకుండా పోయింది. వ్యవసాయ మార్కెట్​కమిటీ పాలక మండళ్ల ఏర్పాటుకు 2014లో జారీ చేసిన జీఓకు 2018లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం సవరణలు చేసింది. మొదటి సారిగా మార్కెట్ చైర్మన్​ పదవుల్లో  జనరల్​, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు.

చైర్మన్​ పదవిని రెండేళ్లుగా నిర్దేశిస్తూ ఆరు నెలల చొప్పున రెండు సార్లు పొడిగించేందుకు వెసులుబాటు ఇచ్చారు. రిజర్వేషన్ రొటేషన్​ విధానంలో ఐదు విడతలుగా విభజించి అన్ని వర్గాలు అవకాశం పొందేలా నిబంధనలు విధించారు.  దీంతో పదేళ్లుగా నామినేటెడ్​ పదవులకు దూరంగా ఉన్నసెకండ్​ క్యాడర్​ లీడర్లు రిజర్వేషన్ ​టర్మ్​ ముగిసే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి.