జన్వాడ ఫామ్​హౌస్​..కూల్చివేతపై స్టే ఇవ్వలేం

  • 99 జీవో ప్రకారం హైడ్రా ముందుకు వెళ్లాలి: హైకోర్టు
  • కూల్చివేతలు ఆపాలంటూ కేటీఆర్​ సన్నిహితుడు ప్రదీప్​రెడ్డి పిటిషన్​
  • ఫామ్​హౌస్‌‌ నిర్మాణానికి 2014లో సర్పంచ్​ పర్మిషన్​ ఇచ్చారని వెల్లడి
  • 2019లో ఫామ్​హౌస్​తోపాటు పక్కనే 3.30 ఎకరాలు కొన్నట్లు ప్రస్తావన
  • చట్ట ప్రకారమే హైడ్రా ముందుకు వెళ్తున్నదన్న ప్రభుత్వం
  • ఫామ్​హౌస్​ నిర్మాణానికి సర్పంచ్​ పర్మిషన్​ చెల్లదని వ్యాఖ్య
  • స్టే ఇవ్వాలన్న పిటిషనర్​ విజ్ఞప్తిని తిరస్కరించిన కోర్టు
  • పర్మిషన్లన్నీ పరిశీలించాలని, నోటీసులివ్వాలని హైడ్రాకు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాను అడ్డుకునేందుకు బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్‌‌ టీం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేటీఆర్  నివాసముంటున్న జన్వాడ ఫామ్​హౌస్‌‌ ను హైడ్రా కూల్చివేస్తుందేమోనన్న అనుమానంతో ఆయన సన్నిహితుడు, బీఆర్ఎస్​ నేత, వ్యాపారవేత్త బద్వేల్ ​ప్రదీప్‌‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఫామ్​హౌస్​ను కూల్చివేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్​ వేశారు.

పిటిషనర్‌‌ చేసిన విజప్తిని హైకోర్టు తిరస్కరించింది. కూల్చివేతలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. జన్వాడ ఫామ్​హౌస్‌‌ కూల్చివేతల విషయంలో చట్టప్రకారం వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాకు సూచించింది. నిబంధనల ప్రకారమే హైడ్రా ముందుకు వెళ్లాలని.. భవన నిర్మాణ అనుమతులు, రసీదులతో సహా పత్రాలన్నీ పరిశీలించాకే చట్ట ప్రకారం చర్యలు ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఎఫ్‌‌టీఎల్‌‌ పరిధిలో ఉంటే నోటీసులు ఇవ్వండి..

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామం సర్వే నంబర్‌‌ 311 (311/7)లో 1,210 చదరపు గజాల్లోని 3,894 చదరపు అడుగులతో నిర్మించిన ఫామ్​హౌస్‌‌ను కూల్చకుండా స్టే ఉత్తర్వులు జారీ చేయాలంటూ ప్రదీప్‌‌రెడ్డి మంగళవారం పిటిషన్​ దాఖలు చేశారు. ఈ ఫామ్​హౌస్‌‌ ఉస్మాన్‌‌సాగర్‌‌ ఎఫ్‌‌టీఎల్‌‌(ఫుల్​ ట్యాంక్​ లెవల్​) పరిధిలో ఉందంటూ కూల్చేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారని, అడ్డుకోవాలని అందులో కోరారు.

దీనిపై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ కె.లక్ష్మణ్‌‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ చేసిన అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఎఫ్‌‌టీఎల్‌‌ పరిధిలో నిర్మాణాలు ఉంటే చట్ట ప్రకారం పిటిషనర్‌‌కు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది.  

ఫామ్​హౌస్‌‌‌‌కు చెందిన జాగా రిజిస్ట్రేషన్‌‌‌‌ డాక్యుమెంట్స్, నిర్మాణ అనుమతులు, ఇంటి పన్ను రసీదులన్నింటినీ మొత్తం పరిశీలించాక చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని చెప్పింది. ఉస్మాన్‌‌‌‌సాగర్‌‌‌‌ ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ ప్రాథమిక, తుది నోటిఫికేషన్‌‌‌‌ సమర్పించాలంది. అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో  హైడ్రా ఏర్పాటు జీవో 99లోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రాథమికంగా ఆక్రమణదారులు చేపట్టే అనధికార నిర్మాణాలను గుర్తించాక, వాళ్ల హక్కులకు చెందిన డాక్యుమెంట్స్‌‌‌‌ పరిశీలించాలని, జీహెచ్‌‌‌‌ఎంసీతోపాటు మున్సిపాలిటీలు

గ్రామ పంచాయతీల నుంచి తీసుకున్న నిర్మాణ అనుమతులు కూడా పరిశీలించాలని చెప్పింది. అరవై నుంచి వంద గజాల లోపు జాగా ఉన్నవారి విషయంలోనూ, ఎకరా జాగా ఉన్న వారి విషయంలోనూ ఒకే తరహాలో చర్యలు ఉండాలని, వివక్షకు ఆస్కారం లేకుండా చూడాలని హైడ్రాకు స్పష్టం చేసింది. జీవో 99లో పేర్కొన్న నిబంధనలను అమలు చేయాలని హైకోర్టు తెలిపింది. జీవో మేరకు హైడ్రా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వసనీయత ఏర్పడుతుందని పేర్కొంది. 

ఏకపక్షంగా చర్యలుండవు : ప్రభుత్వం

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌ ఖాన్‌‌‌‌ వాదిస్తూ.. జీహెచ్‌‌‌‌ఎంసీ ఇతర మున్సిపాలిటీలకు హైడ్రా సమన్వయకర్తగా వ్యవహరిస్తుందన్నారు. నోటీసులు జారీ చేశాక చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని, ఏకపక్షంగా చర్యలు ఉండబోవని చెప్పారు. నిబంధనల ప్రకారమే చర్యలుంటాయని, అందువల్ల ఈ పిటిషన్‌‌‌‌లో ఏవిధమైన మధ్యంతర స్టే ఆదేశాలు జారీ చేయవద్దని న్యాయస్థానాన్ని కోరారు. అక్రమ కట్టడాల కూల్చివేత చర్యలను అడ్డుకోవద్దన్నారు.  పిటిషనర్‌‌‌‌ తరఫున సీనియర్‌‌‌‌ అడ్వకేట్​ హరిహరన్‌‌‌‌ వాదిస్తూ..

ఫామ్​హౌస్‌‌‌‌ నిర్మాణానికి 2014లో  సర్పంచ్​ అనుమతి ఇచ్చారని, దీనిని పిటిషనర్‌‌‌‌ 2019లో కొన్నారని, అక్కడే మరో 3.30 ఎకరాలు కొనుగోలు చేసి కాంపౌండ్‌‌‌‌ వాల్‌‌‌‌ నిర్మాణం చేశారని చెప్పారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో ఒక నేతతో పిటిషనర్‌‌‌‌కు సంబంధం ఉందన్న కారణంగా రాజకీయ దురుద్దేశాలతో ఫామ్​హౌస్‌‌‌‌ను కూల్చేందుకు కుట్ర జరుగుతున్నదని వ్యాఖ్యానించారు. ఈ నెల 14న ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు ఇద్దరు వచ్చి పరిశీలించారని, ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలో ఫామ్​హౌస్‌‌‌‌ ఉందని చెప్పి, హైడ్రా ఆఫీసర్లు వస్తారని కూడా చెప్పి వెళ్లారని తెలిపారు. ఈ దశలో ఏఏజీ  ఇమ్రాన్​ఖాన్​ జోక్యం చేసుకుని.. ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలోని నిర్మాణాల  కూల్చివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇదేమీ వివక్ష కాదని పేర్కొన్నారు. కక్ష సాధింపు అసలేకాదన్నారు. ఫామ్​హౌస్‌‌‌‌ నిర్మాణానికి సర్పంచ్‌‌‌‌ అనుమతులు చెల్లవని, పంచాయతీ కార్యదర్శి పర్మిషన్‌‌‌‌ ఇవ్వాలని తెలిపారు.

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే చర్యలు తీసుకుంటామని చెప్పారు. విచారణ సమయంలో హైకోర్టు.. ఒక శాఖ రిజిస్ట్రేషన్‌‌‌‌ చేయించుకుంటే మరో శాఖ బిల్డింగ్‌‌‌‌ కట్టేందుకు పర్మిషన్‌‌‌‌ ఇస్తుందని, ఇప్పుడు హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణమని కూల్చేస్తామని చెబుతోందని, 10 ఏండ్ల తర్వాత అక్రమ నిర్మాణమని చెబితే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కాదా అని  ప్రశ్నించింది. ‘‘2011 పర్మిషన్లు తీసుకుని 60 గజాల జాగాలో ఇల్లు కట్టుకున్న వ్యక్తి విషయంలోను, 60 ఎకరాల్లోని ఫామ్​హౌస్‌‌‌‌ ఉన్న వ్యక్తి  విషయంలోనూ ఒకే తీరుగా ఉండాలి.

పిటిషనర్‌‌‌‌ ఫామ్​హౌస్‌‌‌‌ విషయంలో తీసుకునే చర్యలు జీవో 99 ప్రకారమే ఉండాలి. అన్ని డాక్యుమెంట్స్‌‌‌‌ పరిశీలించాలి. ముందుగా నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాతే తగిన చర్యలు చట్ట ప్రకారం తీసుకోవాలి” అని హైడ్రాకు ఆదేశించింది. విచారణను సెప్టెంబర్‌‌‌‌ 12కి వాయిదా వేసింది.

కూల్చివేతలపై హైడ్రాకు హైకోర్టు ప్రశ్నలు

జన్వాడ ఫామ్​హౌస్‌‌‌‌ వ్యవహారంపై దాఖలైన కేసులో హైడ్రా ముందు హైకోర్టు పలు ప్రశ్నలు ఉంచింది. ‘‘హైడ్రాకు ఉన్న పరిధులు ఏమిటి.. హైడ్రాకు ఉన్న అధికారాలు ఏమిటి.. ఎప్పుడో రిజిస్ట్రేషన్లు జరిగి లోకల్‌‌‌‌బాడీ పర్మిషన్లతో కట్టిన ఇండ్లను పదేండ్ల తర్వాత కూల్చేందుకు హైడ్రా వస్తే అది సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకం అవ్వదా..  నోటీసు ఇవ్వకుండా కూల్చివేతలు చేయకూడదు కదా..

జన్వాడ ఫామ్​హౌస్‌‌‌‌ ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలో ఉందని ఎలా నిర్ధారణకు వచ్చారు.. ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ పరిధిలో ఫామ్​హౌస్‌‌‌‌ ఉందనే ప్రాథమికంగా నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేశారా, ఎప్పుడు చేశారు”అని న్యాయస్థానం ప్రశ్నించింది. జన్వాడ ఫామ్​హౌస్‌‌‌‌ ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌కు సంబంధించిన వివరాలు కూడా సమర్పించాలని.. ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేసిన నిర్మాణాలు, అక్రమ నిర్మాణాల గుర్తింపు వంటి వివరాలు సమర్పించాలని ఉత్తర్వులు  జారీ చేసింది.

చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. అయితే ఆ చర్యలు హైడ్రా ఏర్పాటుకు చెందిన జీవో 99 ప్రకారమే ఉండాలి. చర్యలు తీసుకునే ముందు ప్రాథమికంగా ఆక్రమణదారుల టైటిల్‌‌ డీడ్‌‌లను ఆఫీసర్లు పరిశీలించాలి. జీహెచ్‌‌ఎంసీతోపాటు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి తీసుకున్న పర్మిషన్లను కూడా పరిశీలించాలి.

ముందుగా నోటీసులు ఇవ్వాలి. ఆక్రమణల తొలగింపు విషయంలో ఎలాంటి వివక్ష ఉండొద్దు.  జన్వాడలోని 3,894 చదరపు అడుగుల ఫామ్​హౌస్‌‌ విషయంలో కూడా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలి. ఫామ్​హౌస్‌‌ కూల్చివేతను అడ్డుకునేందుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం.