ఎవనిదిరా కుట్ర .. లగచర్ల ఘటనపై ట్విట్టర్​లో సీఎం రేవంత్​పై రెచ్చిపోయిన కేటీఆర్​

  • దమ్ముంటే అరెస్ట్​ చేసుకో..  గర్వంగా తలెత్తుకొని జైలుకెళ్త
  • ఏం చేస్కుంటవో చేస్కో.. నాడు మోదీకి ఇదే చెప్పిన
  • కేసీఆర్​ కాదు.. ముందు నువ్వు ఫినిష్​కాకుండా చూస్కో
  • నీ పదవికి ఎసరుపెట్టేందుకు ఖమ్మం,నల్గొండ బాంబులు రెడీగున్నయ్​
  • లగచర్ల ఘటనను వదల.. ఎస్సీ, ఎస్టీ,మానవ హక్కుల కమిషన్​కు వెళ్త
  • ఇంత జరుగుతున్నా కోదండరాం,హరగోపాల్ ఏం చేస్తున్నారని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: లగచర్ల ఘటనకు సంబంధించిన రిమాండ్​ రిపోర్టులో తన పేరును చేర్చడంపై బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ మండిపడ్డారు. సీఎం రేవంత్​రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  గురువారం ట్విట్టర్​తోపాటు  మీడియాతో వన్​ టు వన్​ చిట్​చాట్​లో విరుచుకుపడ్డారు.  ‘‘ఎవనిది రా కుట్ర? ఏంది ఆ కుట్ర. నీకు ఓటేసిన పాపానికి రైతుల భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుడి కోసమో, అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? 

నీ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకు దూరం చెయ్యడం ఎవరి కుట్ర? పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర? మర్లవడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల లంచం బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాకుండా ఎలా కనిపిస్తుంది? మీ అల్లుడి కంపెనీ కోసం లాక్కుంటున్న భూములకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం కుట్రగానే కనిపిస్తుంది. మీ అన్న బెదిరింపులకు లొంగని రైతన్నల ధైర్యం కుట్రగానే కనిపిస్తుంది. 

ఇద్దరు వ్యక్తులు ఫోన్​లో మాట్లాడుకున్న మాటలు కుట్రలాగానే కనిపిస్తాయి. ప్రజలు సోషల్​ మీడియాలో వారి బాధలు పోస్ట్​ చేస్తే కుట్రగానే కనిపిస్తుంది. పేద గిరిజన రైతులకు అండగా నిలబడితే కుట్రగానే అనిపిస్తుంది. 9 నెలలు నీ అపాయింట్​మెంట్ కోసం ఎదురు చూసి.. నీ బెదిరింపులను తట్టుకుని చివరకు ఎదిరిస్తే అది నీకు కుట్రలాగానే కనిపిస్తుంది. పేద రైతన్నల కుటుంబాల మీద అర్ధరాత్రి దాడులు చేసి, అక్రమంగా అరెస్టు చేసి, వారిని చిత్రహింసలకు గురిచేసినప్పుడు నేను ప్రశ్నిస్తే కుట్రలాగానే అనిపిస్తుంది’’  అని రేవంత్​నుద్దేశించి కేటీఆర్​ వ్యాఖ్యానించారు. 

అరెస్ట్​ చేస్తే చేస్కో

తనను ఏదో కేసులో ఇరికించి అరెస్ట్​ చేస్తారని తనకు ఎప్పుడో తెలుసని కేటీఆర్​ అన్నారు. ‘‘ప్రతి నిత్యం భయంతో బతికే నీకు ఇవన్నీ కుట్రలాగానే కనిపిస్తాయి. ప్రతిక్షణం నువ్వు భయాన్ని శాసిస్తూ ఆ భయంలోనే బతుకుతున్నవ్​. పేద రైతన్నల పక్షాన నిలబడినందుకు నన్ను అరెస్ట్​ చేస్తానంటే చేస్కో. రైతుల తరఫున నిలబడి తలెత్తుకుని గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తా. నీ కుట్రలకు భయపడేవాళ్లెవరూ లేరు. నిజానికి ఉన్న దమ్మేందో తొందర్లోనే చూద్దువు’’  అని రేవంత్​నుద్దేశించి కేటీఆర్​ వ్యాఖ్యానించారు.

  రేవంత్​ రెడ్డికి తనపై ఎంతో ప్రేమ ఉన్నట్టుందని, అందుకే తనను టార్గెట్​ చేసుకున్నారని  అన్నారు.  ‘‘నేను డ్రగ్స్​ తీసుకోలేదు. ఫోన్లు ట్యాపింగ్​ చేయలేదు. అవినీతి అంతకన్నా చేయలేదు. ప్రధాని మోదీనే నేను మోదీయా.. బోడీయా అని అన్నాను. ఏం చేస్కుంటారో చేస్కో అన్నాను. రేవంత్​కు కూడా అదే చెబుతున్నా. ఏం చేస్కుంటవో చేస్కో. ఎంత ధైర్యం ఉంటే నేను ఈ మాట అంటాను. నిజాయతీకి ఉన్న ధైర్యం అది. కేసీఆర్​ను ఫినిష్​ చేస్తా అంటున్నవ్​. ముందు నువ్వు ఫినిష్​ కాకుండా చూసుకో. నీ పదవికి ఎసరు పెట్టేందుకు నల్గొండ, ఖమ్మం బాంబులు వేచి చూస్తున్నాయి. 

సొంత నియోజకవర్గంపైన పట్టు లేని నువ్వు ఏం సీఎంవి. అధికారం పోయిందని నాకు ఎలాంటి ఫ్రస్ట్రేషన్​ లేదు. అధికారం వస్తుందని కలలో కూడా నేను ఊహించలేదు. పదేండ్లు ప్రజలు మాకు అవకాశం ఇవ్వడాన్ని అదృష్టంగా భావించాను. రేవంత్​ సర్కారు ఐదేండ్లు ఉండాలని కోరుకుంటున్నా. వాళ్లు పూర్తికాలం అధికారంలో ఉంటేనే బీఆర్ఎస్​ తర్వాత 15 ఏండ్లు అధికారంలో ఉంటుంది. ఎన్నికల సంస్కరణలు చేస్తే ఒక వ్యక్తి 2 సార్లు సీఎం లేదా పీఎంగా ఉండకూడదు. అలాంటి సంస్కరణలు తేవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కేటీఆర్​ అన్నారు. 

 కోదండరాం ఎందుకు మాట్లాడట్లేదు?

లగచర్ల భూసేకరణ అంశంలో తీవ్రంగా భంగపడిన ప్రభుత్వం  కుట్ర అంటూ దాన్ని కవర్​ చేసే ప్రయత్నం చేస్తున్నదని కేటీఆర్​ అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్నదన్నారు. 50 మంది రైతులను ఎస్పీ దగ్గరుండి పోలీసులతో దారుణంగా కొట్టించారని చెప్పారు. గతంలో మానవ హక్కుల గురించి మాట్లాడిన ప్రొఫెసర్​ కోదండరాం, ప్రొఫెసర్​ హరగోపాల్​ లాంటి వాళ్లు.. ఇప్పుడు రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతున్నా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పట్నం నరేందర్​ రెడ్డి తన పేరు చెప్పారని రిమాండ్​ రిపోర్టులో రాశారని, కానీ, అదంతా బక్వాస్​ అంటూ పట్నం నరేందర్​ రెడ్డి అఫిడవిట్​ ఇచ్చారని కేటీఆర్​ చెప్పారు. 

కూంబింగ్​ ఆపరేషన్​కు వెళ్లినట్టు రైతులపై పోలీసులు దాడి చేశారన్నారు. పోలీసులు రేవంత్​ ప్రైవేటు సైన్యంలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు, ఐపీఎస్​ అధికారులకు ఇంత స్వామి భక్తి పనికిరాదని, నాలుగేండ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామని అన్నారు.  ‘‘నాపై కేసు పెడితే ఊరుకుంటా అని రేవంత్​ అనుకుంటే.. ఆయనకన్నా పిచ్చోడు మరొకరు ఉండరు. జైలుకు వెళ్లొచ్చాక కూడా పోరాటం చేస్తా. ఈ విషయాన్ని ఇంతటితో నేను వదిలిపెట్ట. ఎస్సీ, ఎస్టీ కమిషన్​​, మానవహక్కుల కమిషన్​, మహిళా కమిషన్​ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తా. 

కొడంగల్​లో భూముల సేకరణకే ఇంత గొడవ జరిగితే.. ముచ్చర్లలో ఎంతో విలువైన భూములున్నాయి. మరి, అక్కడ ఇంకా ఎంత పెద్ద గొడవలు జరగాలి. మేం రైతులను ఒప్పించి.. మెప్పించి భూసేకరణ చేశాం. సీఎంకు తన సొంత నియోజకవర్గంపైనే పట్టు లేదు. సీఎం నియోజకవర్గంలో కలెక్టర్​పై దాడి చేసేంత బలమైన వ్యక్తులమా మేం? మేం చెబితే రైతులు దాడి చేస్తారా’’ అని ప్రశ్నించారు. 

గిరిజన కుటుంబాలకు అండగా ఉంటం

లగచర్ల ఘటనకు రాజకీయ రంగు పులిమి భూములు గుంజుకునేందుకు రేవంత్​ సర్కారు కుట్రలు చేస్తున్నదని కేటీఆర్​ఆరోపించారు. అధికారులపై దాడి చేసి అరెస్ట్​ అయిన వారి కుటుంబ సభ్యులు తెలంగాణ భవన్​లో కేటీఆర్​ను కలిశారు. సంబంధం లేకపోయినా తమవారిని తీసుకెళ్లారంటూ గిరిజన మహిళలు కేటీఆర్​కు చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. గిరిజన మహిళలను చూస్తుంటే ఎవరో చెబితే దాడి చేసే వారిలా కనిపిస్తున్నారా? అని  ప్రశ్నించారు. జానెడు భూమి కోసం పోరాటం చేస్తున్న రైతులపై ఇంత పాశవికంగా దాడి చేయడమేమిటని అన్నారు. గిరిజన రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని, వారిని విడిపించే వరకు తోడుగా ఉంటామని చెప్పారు.