ఆ ఫామ్​​హౌస్​ నాది కాదు..నా దోస్తుది!..లీజుకు తీసుకున్న: కేటీఆర్​

  • రూల్స్​కు వ్యతిరేకంగా ఉంటే నేనే దగ్గరుండి కూల్చేయిస్త
  • కాంగ్రెసోళ్లవి కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నయ్​
  • హైడ్రానో, అమీబానో తెండీ.. ముందు వాళ్లవి కూల్చండి అని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు : తనకంటూ సొంత ఫామ్ హౌస్​లు లేవని, జన్వాడలో తన ఫ్రెండ్‌‌కు ఫామ్​హౌస్​ ఉంటే దాన్ని లీజ్‌‌కు తీసుకున్నానని బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒకవేళ ఆ ఫామ్​హౌస్​ ఎఫ్‌‌టీఎల్‌‌ పరిధిలో గానీ, బఫర్ జోన్‌‌లో గానీ ఉంటే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని ప్రకటించారు. తాను తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌‌లో  కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘‘నాకంటూ ఏ ఫామ్​హౌస్​ లేదు. నా మిత్రుడి ఫామ్​హౌస్​ ఉంటే, ఏడెనిమిదేండ్ల నుంచి లీజ్‌‌కు తీసుకున్నం. ఒకవేళ అది బఫర్‌‌‌‌ జోన్‌‌లో ఉండి ఉంటే, దగ్గరుండి నేనే కూలగొట్టిస్త. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సిందే’’ అని అన్నారు.

‘‘అయితే, నేరుగా అక్కడి నుంచి బయల్దేరి పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎల్ పరిధిలో, బఫర్ జోన్‌‌‌‌‌‌‌‌ పరిధిలో కట్టిన రాజభవనాలకు తీసుకెళ్త. వాటిని కూడా కూలగొట్టించాలి. హైడ్రానో, అమీబానో తీసుకుని నేరుగా ఆ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్​ల దగ్గరకే వెళ్దాం. అక్కడి నుంచే కూల్చివేతలు ప్రారంభిద్దాం. ఈ విషయంలో ఎవరి మీద యాక్షన్ తీసుకున్నా అభ్యంతరం లేదు. నేను తప్పు చేస్తే నా మీద తీసుకోవచ్చు” అని కేటీఆర్​ అన్నారు. ‘‘సీఎం తొలుత తన ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్​ను కూల్చివేయించుకుని, ఇతరులకు ఆదర్శంగా నిలవాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. 

రుణమాఫీ పేరుతో దగా

రుణమాఫీ పేరుతో రైతులను రాష్ట్ర ప్రభుత్వం దగా చేసిందని కేటీఆర్ ఆరోపించారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలంలో 20,239 మంది రైతులకుగాను 8,527 మంది రైతులకే రుణమాఫీ జరిగిందన్నారు. అందరికీ రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌తో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని చెప్పారు. ధర్నాలు ప్రారంభించే ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయాలని బీఆర్​ఎస్​ నేతలకు సూచించారు. ఆందోళనలు చేస్తున్న రైతులపై ప్రభుత్వం కేసులు బుక్ చేసిందని కేటీఆర్ ఆరోపించారు.

ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం బజార్ హత్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైతులపై ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ నమోదు చేశారని, ఏడేండ్లు శిక్ష పడే సెక్షన్ల కింద కేసులు పెట్టారని అన్నారు. ఈ కేసులను వెంటనే ఉప సంహరించుకోకపోతే, జైల్ భరో కార్యక్రమం చేపడుతామని ఆయన హెచ్చరించారు. కాగా, గురువారం చేవెళ్లలో జరగనున్న ధర్నాలో కేటీఆర్, ఆలేరులో జరగనున్న ధర్నాలో హరీశ్‌‌‌‌‌‌‌‌రావు పాల్గొననున్నారు. యాదగిరిగుట్టకు పోయి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ను క్షమించాలని దేవునికి మొక్కుతానని 
హరీశ్‌‌‌‌‌‌‌‌రావు చెప్పారు.