ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడ్తే..బీఆర్ఎస్‌‌కు 100 సీట్లు

  • రేవంత్​కు సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష : హరీశ్ రావు
  • మూసీపై పాదయాత్రకు సిద్ధం.. తానే రేవంత్​ను డీల్ చేస్తానంటూ కామెంట్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెడితే బీఆర్‌‌‌‌ఎస్ కు కనీసం వంద సీట్లు వస్తాయని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌‌రావు అన్నారు. ‘‘కాంగ్రెస్ సర్కార్‌‌‌‌పై పది నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌‌‌‌ను సీఎం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో గోల్ కొట్టేది, వికెట్లు తీసేది మేమే” అని చెప్పారు.

బుధవారం తెలంగాణ భవన్‌‌లో మీడియాతో హరీశ్ రావు చిట్ చాట్ చేశారు. రేవంత్‌‌కు, కేసీఆర్‌‌‌‌కు అసలు పోలిక లేదని ఆయన అన్నారు. రేవంత్‌‌ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని కామెంట్​చేశారు. తన కుర్చీని ఎవరు గుంజుకుంటరోనన్న భయం రేవంత్‌‌లో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీని సీనియర్లు గుంజుకోకుండా కాపాడుకోవాలని రేవంత్‌‌ రెడ్డికి సూచించారు. ‘‘ఈ మధ్య కాలంలో ఒక మంత్రి గవర్నర్‌‌ను కలిశాడు. ఇంకో మంత్రి హెలికాప్టర్ ఇవ్వలేదని అలిగాడు. మరో మంత్రేమో ఢిల్లీకి వెళ్లాడు. కొంతమంది మేం సీఎం అవుతామని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు” అని అన్నారు.

డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, మంత్రి పదవుల భర్తీకి హైకమాండ్‌‌ నుంచి రేవంత్‌‌కు అనుమతి రావడం లేదని ఎద్దేవా చేశారు. ‘‘మల్లన్నసాగర్‌‌‌‌లో 50 వేల ఎకరాలు ముంపునకు గురైందని రేవంత్‌‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి మూసీకి నీళ్లు తెచ్చేందుకు మా ప్రభుత్వ హయాంలోనే డీపీఆర్ తయారు చేశాం. ఇప్పుడు దాన్ని పక్కనబెట్టి మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తెచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. దీని వల్ల రూ.1,100 కోట్లతో పూర్తయ్యేది, రూ.7 వేల కోట్లకు పెరుగుతోంది” అని చెప్పారు. రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

మూసీ ప్రాజెక్టుకు అనుకూలమే.. 

మూసీ అభివృద్ధికి బీఆర్‌‌‌‌ఎస్ అనుకూలమేనని, అయితే సుందరీకరణ పేరుతో కమీషన్ల కోసం పేదల ఇండ్లు కూలగొడతామంటే ఒప్పుకోబోమని హరీశ్ రావు అన్నారు. ‘‘మల్లన్నసాగర్‌‌‌‌లో ఇచ్చినట్టు మూసీ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి. గచ్చిబౌలిలో ఉన్న 500 ఎకరాలు కేటాయించాలి. మూసీపై రేవంత్ తో పాదయాత్ర చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. గన్ మెన్లు లేకుండా‌‌ రేవంత్ రెడ్డి పాదయాత్రకు రావాలి” అని సవాల్ విసిరారు.

‘‘నన్ను రేవంత్‌‌ డీల్ చేయడం కాదు.. రేవంత్‌‌ను ఎలా డీల్ చేయాలనేది నేనే రాసి పెట్టుకున్నాను. కేటీఆర్ ప్రశ్నించే గొంతుక. అందుకే ఆయనను రేవంత్ పగబడుతున్నారు. ఫార్ములా ఈ రేసుపై ఏసీబీ విచారణ చేసుకోని.. ఏం కేసులు పెడతారో మేం కూడా చూస్తాం” అని వ్యాఖ్యానించారు.