ఆడబిడ్డల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా? : వేముల ప్రశాంత్ రెడ్డి

  • తులం బంగారం హామీ ఏమైంది
  • ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ,వెలుగు : ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన తులం బంగారం హామీపై మాట్లాడితే కాంగ్రెస్​ లీడర్లు దాడులు చేస్తారా? అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ముప్కాల్ లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్​ గా మారింది. చెక్కుల పంపిణీకి ముందు తులం బంగారం హామీ ఏమైందని ఎమ్మెల్యే ప్రశ్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్​ ఇచ్చిన హామీని గుర్తుచేస్తే తప్పేంటి అనడంతో  మహిళా లబ్ధిదారులు కాంగ్రెస్​ లీడర్లను నిలదీశారు. 

తులం బంగారం ఎప్పుడు ఇస్తారని పట్టుబట్టడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భృతి, దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లపై చర్చ పెడుదామా? అని కాంగ్రెస్​ లీడర్ ప్రశ్నించడంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని మహిళలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీంతో పోలీసులు ఇరు పార్టీల లీడర్లను బయటికి పంపారు. ఎమ్మెల్యే  చెక్కులు పంచి వెళ్లిపోయారు.

తప్పులు కప్పిపుచ్చుకునేందుకే తులం బంగారం ప్రస్తావన : పీసీసీ జిల్లా ప్రెసిడెంట్ మానాల

గత బీఆర్ఎస్ ప్రభుత్వం  చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తులం బంగారం ప్రస్తావిస్తున్నారని పీసీసీ జిల్లా ప్రెసిడెంట్, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆరోపించారు. చెక్కుల పంపిణీలో కావాలనే ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. 

గత పాలకుల తప్పులను సరిదిద్దుతూ సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ చిత్తశుద్ధితో పనిచేస్తుంటే కాంగ్రెస్​ ప్రభుత్వంపై  బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రెండేళ్ల కింద పెండింగ్ లో ఉంచిన చెక్కులను కాంగ్రెస్​ పంపిణీ చేస్తోందన్నారు.