-
మహిళా మంత్రులను బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తున్నది
-
ఆ పార్టీకి మహిళలంటే చులకన కాబట్టే ట్రోల్ చేస్తున్నరు: మంత్రి సీతక్క
-
మహిళలు రాజకీయాల్లో ఉండాలా ? వద్దా? అని ఫైర్
కరీంనగర్, వెలుగు: మహిళా మంత్రులు, కాంగ్రెస్ మహిళా నేతల వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తోందని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు మహిళలంటే చులకన అని, అందుకే ట్రోల్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ కాలనీలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి అన్న దుర్మార్గుల పార్టీ బీఆర్ఎస్ అని ఆమె దుయ్యబట్టారు. మహిళా మంత్రిగా తాను, సోదర మంత్రి పొన్నం ప్రభాకర్ పవిత్రమైన అసెంబ్లీలో మాట్లాడిన ఫొటోలను మార్ఫింగ్ చేసి దుర్మార్గంగా వ్యవహరించారని గుర్తుచేశారు. సహచర మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ రఘునందన్‌రావు నూలు దండ వేస్తే దాన్ని వక్రీకరించి దారుణంగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలు రాజకీయాల్లో ఉండాలా? వద్దా? బీఆర్ఎస్ స్పష్టం చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. అంతకుముందు మంత్రి మానకొండూరులో మీడియాతో మాట్లాడుతూ.. మూసీ పరీవాహక ప్రాంతంలో ఇండ్లు కోల్పోతున్న పేదలకు స్థిర నివాసం కల్పిస్తామని వెల్లడించారు. మూసీ వెంట గత పదేండ్లలో అనేక అక్రమ కట్టడాలు వచ్చాయని, అందులో ఎక్కువగా రాజకీయ నాయకులే బిల్డింగ్స్ కట్టుకుని అద్దెకు ఇచ్చుకున్నారని తెలిపారు. ఇండ్లు కోల్పోతున్న పేదలకు మాత్రమే ప్రభుత్వం స్థిరనివాసం కల్పిస్తుందని స్పష్టం చేశారు. నిర్వాసితుల విషయంలో టీవీల్లో, సోషల్ మీడియాలో తమను బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా తిట్టిస్తున్నారని.. మిడ్ మానేరు, మల్లన్నసాగర్ లో వారు ఎంత బలవంతంగా ఖాళీ చేయించారో తెలియదా? అని బీఆర్ఎస్ నేతలను మంత్రి ప్రశ్నించారు.
ప్రతిపక్షాలు మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలి: మంత్రి పొన్నం
బాధ్యతగల ప్రతిపక్షాలు మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై విమర్శలు చేయదలుచుకుంటే ఓ హద్దు ఉండాలన్నారు. మహిళా మంత్రులను అవమాన పరిచేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.