ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతగా పనిచేయాలి

  • పాలించే సత్తా బీఆర్‌‌ఎస్‌‌కే ఉందని అనుకోవద్దు
  • గాంధీ, కౌశిక్‌‌రెడ్డి గొడవ ఆ పార్టీ అంతర్గత వ్యవహారం
  • మంత్రి పొన్నం ప్రభాకర్ 

కరీంనగర్, వెలుగు :  పాలించే సత్తా బీఆర్‌‌ఎస్‌‌కే ఉందని అనుకోవద్దు, పరిపాలన చేయడం కాంగ్రెస్‌‌కు వెన్నతో పెట్టిన విద్య’ అని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ అన్నారు. కరీంనగర్‌‌ జిల్లా మానకొండూరులో ఆదివారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌‌లో గణేశ్‌‌ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహిస్తామని, ఇందులోఎలాంటి సందేహం లేదన్నారు. తాము భాగ్యనగర్‌‌ గణేశ్‌‌ ఉత్సవ సమితితో మాట్లాడామని, గతంలో ఎలాంటి ఏర్పాట్లు జరిగాయో.. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ జరుగుతాయని చెప్పారు.

లా అండ్‌‌ ఆర్డర్‌‌, హైదరాబాద్‌‌ బ్రాండ్‌‌ ఇమేజ్‌‌ను దెబ్బ తీసేలా కొందరు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్‌‌ ఆర్డర్‌‌కు ఇబ్బందులు ఎదురైతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్‌‌ ఇమేజ్‌‌ను దెబ్బతీసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని సూచించారు. పార్టీ ఫిరాయింపుల అంశం హైకోర్టులో ఉందని, ఆ విషయాన్ని శాసనసభ చూసుకుంటుందన్నారు.

గాంధీ, కౌశిక్‌‌రెడ్డి గొడవతో కాంగ్రెస్‌‌కు సంబంధం లేదు

గజ్వేల్‌‌ (వర్గల్), వెలుగు : ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్‌‌రెడ్డిల గొడవ బీఆర్‌‌ఎస్‌‌ అంతర్గత వ్యవహారం అని, ఆ గొడవతో కాంగ్రెస్‌‌కు సంబంధం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ చెప్పారు. సిద్దిపేట జిల్లా గౌరారంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలన్న కుట్రతో కేసీఆర్‌‌ ఫిరాయింపులకు ఆజ్యం పోశారని, ఇప్పుడు ఆ పాపం వారికే చుట్టుకుంటోందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 32 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న ఘనత కేసీఆర్‌‌కే దక్కుతుందన్నారు.

అప్పటి స్పీకర్‌‌ ఏ ఒక్కరిపై కూడా అనర్హత ప్రకటించలేదని, కేటీఆర్, హరీశ్‌‌రావు గతాన్ని మరిచి విమర్శలు చేస్తున్నారన్నారు. నిబంధనల ప్రకారమే పీఏసీ చైర్మన్‌‌ పదవిని గాంధీకి ఇచ్చామన్నారు. జంట నగరాల్లో అల్లర్లు సృష్టించేందుకు బీఆర్‌‌ఎస్‌‌ కుట్ర చేస్తోందని, వాటిని సహించేది లేదన్నారు. సమావేశంలో సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్‌‌ టి.నర్సారెడ్డి, నాయకులు హరికృష్ణ, శ్రీనివాస్‌‌గౌడ్‌‌, మోహన్‌‌, సందీప్‌‌రెడ్డి, జహీర్, రేగొండ గౌడ్, కరుణాకర్‌‌రెడ్డి, వెంకటేశ్‌‌ పాల్గొన్నారు.