విపత్తులోనూ.. వికృత రాజకీయ క్రీడేనా?

ప్రకృతి విపత్తులకు పరిమితుండదు. ఎప్పడెలా వస్తాయో చెప్పలేం. వ్యవస్థలు, వర్గాలపై ప్రకృతి వైపరీత్యాల ప్రభావం పడుతూనే ఉంటుంది. విపత్తులు– నివారణ మార్గాలపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు, పలు సంస్థలు హెచ్చరికలు, ఆ దిశగా ప్రభుత్వాలు అంతగా స్పందించకపోవడం  వంటి అంశాలపై సమగ్ర చర్చ జరుగుతూనే ఉన్నది.  ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏటా 560 ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని ఒక అంచనా.  

అంటే, రెండు రోజులకు మూడు విపత్తులున్నమాట.  చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం తప్ప నివారణ మార్గాల వైపు పార్టీలు, ప్రభుత్వాలేవీ ప్రజలను అప్రమత్తం చేయలేకపోతున్నాయని అనేక సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే, విపత్తులు సంభవించినప్పుడు విజ్ఞులు వివేకంగా ఆలోచిస్తారు. సంయమనంతో  ప్రభుత్వాలకు, ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తారు.  ఈ సందర్భంలో ప్రజల గోస  ప్రభుత్వం గోసగా, ఆయా పార్టీలు తమ గోసగా మలుచుకునేదే ప్రజాహితం. పార్టీలు విపత్తుల సమయంలో అన్నీ పక్కనపెట్టి సహాయక చర్యల్లో నిమగ్నం కావాల్సి ఉంటుంది.  కానీ,  ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయంగా మలుచుకోవడం బాధాకరం.

గడిచిన మూడు రోజుల నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో సంభవించిన ప్రళయం అంతా ఇంతా కాదు. ఖమ్మంలో భారీ వర్షాలు ఆ జిల్లాను కోలుకోలేకుండా చేశాయి. 70 ఏండ్లలో  ఇంత పెద్ద ఆస్తి, ప్రాణ నష్టం అక్కడ జరగలేదు.  మహబూబాబాద్, సూర్యాపేటల్లోనూ పరిస్థితి అట్లనే ఉన్నది.  తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఐదున్నర వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా. ఈ సందర్భంగా పలువురు విరివిగా విరాళాలు ప్రకటించి సర్కారుకు అండగా నిలుస్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. 

Also Read : దేశాన్ని అభివృద్ధి చేసే వారిని అందించేది టీచర్లే.. ఆచార్య దేవోభవ

ప్రకృతి విపత్తుపై బీఆర్ఎస్​ రాజకీయాలు

 ఈ విపత్తు టైంలో జనానికి భరోసా కల్పించాల్సిన రాజకీయ పార్టీలు తమ ఉనికి కోసం పోరాటం చేసుకుంటున్నట్టు కనపడుతున్నాయి. ముఖ్యంగా విపక్ష పాత్రలో ఉన్న బీఆర్ఎస్​పై, ఆ పార్టీ నాయకత్వ వైఖరిపై చర్చ జరుగుతున్నది. పదేండ్లు ప్రభుత్వంలో ఉండి అనేక ఆటుపోట్లను చూసినవాళ్లు, జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ఆతృత పడుతున్నట్టే కనిపిస్తున్నది. 

చేతనైతే సహాయం చేయాలి..లేదంటే సూచించాలి.  అంతేకానీ,  రాజకీయ వికృత క్రీడ ఆడుకోవడం విమర్శలకు తావిస్తున్నది.  ప్రభుత్వం కొలువుదీరి పదినెలలు కాకముందే సంభవించిన ఘోర విపత్తుపై  ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యవహరించిన తీరు పలెల్లో, పట్నంలో పలు విమర్శలకు తావిస్తున్నది. 

బీఆర్ఎస్ హయాంలో వానలు పడలేదా? వరదలు రాలేదా? అంతులేని విషాదాలు అలుముకోలేదా? అప్పుడు ప్రజలు అరిగోస పడలేదా? పదేండ్లలో ప్రకృతి వైపరీత్యాలు వాళ్లకేమైనా కొత్తనా?  కష్టనష్టాల్లో జనాల ఆక్రందనలు సోషల్ మీడియాలో తిప్పి వాటి ఆధారంగా రాజకీయం చేస్తున్న వైనం చూసి సాక్షాత్తు వరద బాధిత ప్రాంతాల ప్రజలే ముక్కున వేళ్లేసుకుంటున్నారు.  

మరెందుకు ఉలికిపాటుకులోనై వివేకం లేని విమర్శలు చేస్తున్నారనే ప్రశ్న రాక మానదు.  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారీ వర్షాలను, వరదలను అంచనా వేయలేకపోయిందని, అందుకు అనువైన కార్యాచరణ చేపట్టలేకపోయిందన్నది బీఆర్ఎస్ ఆరోపణ. అలాంటపుడు జనాల్లో ముందే ఉండి ప్రజల వైపు ఎందుకు నిలబడలేదు? 39 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతలను కట్టబెట్టిన ప్రజల వైపు బీఆర్ఎస్ ఉండాలి కదా అనే ప్రశ్న ఎవరికైనా వస్తుంది.

ఫాంహౌస్ దాటని కేసీఆర్​

ప్రతిపక్ష నేత కేసీఆర్​ ప్రజల కష్టకాలంలోనూ ఫాంహౌస్​ దాటి రాకపోవడంపై జనంలో చర్చ జరుగుతున్నది.  పదేండ్లుగా ప్రజలిచ్చిన అధికారాన్ని అనుభవించిన ఆ పార్టీ ఇప్పుడు కష్టకాలంలో ప్రజల వైపు ఉండకపోవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోతున్నారు. అయ్యో..సార్ ఇప్పుడైనా ఫాంహౌస్​ దాటి ఖమ్మం వెళ్తే బాగుండన్నవాళ్లే ఎక్కువున్నారు.

ప్రజల సొమ్ముతో  ప్రధాన ప్రతిపక్ష నేత హోదాననుభవిస్తున్న  కేసీఆర్ బయటకు రాలేకపోయినా ఆయన నుంచి చిన్న ప్రకటననైనా ఇవ్వలేకపోయిండా?  చీటికిమాటికి  ప్రకటనలిచ్చే  కేసీఆర్  కనీసం విచారం తెలపలేకపోయారంటే..  ప్రజల పట్ల ఆయనెంత కఠినంగా ఉండదల్చుకున్నారో స్పష్టమవుతున్నది. కేవలం ఓట్లేయ్యకుంటే జనం గోడు పట్టదా? ప్రజల్ని అంత శత్రువుల్లా చూడాల్నా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క పిలుపుకే  అగ్గి రాజేస్తానన్న ఆ పిలుపు ఎక్కడ పోయిందన్న ప్రశ్నలొస్తున్నాయి.  సరే,  కేసీఆర్ నుంచి ఇలాంటి తక్షణ స్పందనను ఆశించలేమనేవాళ్లకు కూడా ఆయన వ్యవహారశైలి విసుగు పుట్టించకమానదు. 

కేసీఆర్ రాడు.. కేటీఆర్ అందుబాటులో ఉండడు

 ప్రజల పక్షాన సేవా కార్యక్రమాల్లో ఉండాల్సిన ప్రధాన ప్రతిపక్షమే క్షేత్రంలో ఉండకుండా సోషల్ మీడియా వేదికగా రాజకీయ ఆజ్యం పోయడంతో విమర్శల ఘాటు మరింత పెరిగింది. వరద ప్రభావిత ప్రాంతాలకు ఆ కల్వకుంట్ల కుటుంబమే దూరంగా ఉందన్న అపవాదును ఎదుర్కోవాల్సి వచ్చింది. సూర్యాపేట జిల్లా కూడా వానలు, వరదలకు అతలాకుతలమైంది. సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేటకు వెళ్లి సమీక్ష చేసి బాధితులతో మాట్లాడుతుంటే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటలో కానరాకుండా తెలంగాణ భవన్​లో ప్రత్యక్షమై వరదలపై  ఉత్తర కుమార వాగ్బాణాలొదిలారు.  

పదేండ్ల పాఠం ఏం నేర్పింది?

 జంట నగరాల్లో చెరువులు, కుంటలు, నాలాలు మాయమవ్వడం వల్లే ఈ దుస్థితి అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ, అందుకు తగ్గ కార్యాచరణేది సిద్ధం చేయకపోవడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. 2021లో వరంగల్ మునకతో  కొండాయి, ఏటూరు నాగారం ఏజెన్సీ అతలాకుతలమైనా పైసా పరిహారం లేకపోగా ఒక్కరినీ ఓదార్చలేదు. దాదాపు 30 మంది పైగా చనిపోయారు. బాధిత కుటుంబాలను కూడా  కేసీఆర్ పరామర్శించలేదు. అంతకు ముందు నిర్మల్, మంచిర్యాల పట్టణాలను వరద ముంచెత్తినా అటువంక చూసిన పాపానపోలేదు. 

మచ్చుకైనా కనిపించని మానవత్వం

అధికారంలో ఉన్నప్పుడు తన మెదక్ జిల్లాలో మసాయిపేట వద్ద  రైల్వే ట్రాక్  ప్రమాదం జరిగి 8 మంది బడి పిల్లలు చనిపోతే,  నేరెళ్ల ఘటనలో ముగ్గురు కన్నుమూసినా, కొండగట్టులోని 63 మంది మృతులకు చెందిన కుటుంబాలను ఓదార్చలేదు. 2023లో శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ఘటనలో 9 మంది చనిపోయినా  కేసీఆర్ అటు వంక వెళ్లలేదు. గూడ అంజన్న,  కేశవరావ్ జాదవ్ లాంటి ఉద్యమకారులు చనిపోయినా కనీసం సంతాపం లేదు.  ఇలా చెప్పుకుంటేపోతే  కేసీఆర్​లో మనిషి మాయమైపోతున్నాడని, మానవత్వం మచ్చుకైనా లేదని ఆయన సంబంధీకులే చెబుతున్నారు.

విదేశాల్లో ఉన్నా సోషల్ మీడియా ప్రచారం

బీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ అందుబాటులో లేరు. ఆయన అమెరికా పర్యటనలో ఉండి కూడా రోజు వారి ట్వీట్లతో సోషల్ మీడియాలో ఆరోపణలను, విమర్శలు సంధిస్తున్నారు. విపత్తులో ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో తలమునకలవుతుంటే పరిహారంపై  కేటీఆర్ ట్వీట్ చేసి రాజకీయ ఆజ్యం పోశారు. గతంలో రూ.4లక్షలున్న పరిహారాన్ని ఒక లక్ష పెంచి 5 లక్షలు చేశారు. పాడిపశువులు, మేకలు గొర్రెల పరిహారాన్ని ప్రభుత్వం పెంచింది.

వెంకట్ గుంటిపల్లి
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం