గులాబీ కోటకు బీటలు

  • అసెంబ్లీ ఎలక్షన్​ తర్వాత జిల్లాలో చతికిలపడ్డ కారు పార్టీ     
  • పార్లమెంట్​ ఎన్నికల్లో  ప్రభావం చూపని ఎమ్మెల్యేలు
  •     రోజు రోజుకు ఉనికి కోల్పోతున్న బీఆర్ఎస్ పార్టీ

నిజామాబాద్​, వెలుగు : నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో 2003 నుంచి తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్ లో మూడు ఎమ్మెల్యే స్థానాల్లో  గెలిచిన గులాబీ పార్టీ పార్లమెంటు ఎన్నికలకు వచ్చే సరికి మరింత ఢీలా పడింది. నిజామాబాద్ జిల్లా పాలిటిక్స్ లో  పదేండ్లు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన కారు పార్టీ.. ఎంపీ ఎన్నికల్లో  డిపాజిట్ కోల్పోయి ఘోర ఓటమి మూటగట్టుకుంది.  ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ను గుర్తించిన జిల్లా  ప్రజలు 2003లోనే  కీలకమైన జడ్పీ చైర్మన్​ పదవిని కట్టబెట్టి గులాబీ జెండా ఎదుగుదలకు బీజం వేసి పార్టీని గుండెల్లో  పెట్టుకొని కాపాడారు.  

తెలంగాణ రాష్ట్రంలో 2014లో మొదటి సారి జరిగిన ఎలక్షన్​లో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ స్థానాన్ని గెలుచుకొని చరిత్ర సృష్టించగా..  2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా అదే హవాను  కొనసాగించింది.  దీంతో  ప్రతిపక్ష పార్టీ ఊసే లేకుండా డామినేట్​పాలిటిక్స్​నడిపిన బీఆర్ఎస్ ను 2023 అసెంబ్లీ ఎలక్షన్​లు ఊహించని విధంగా దెబ్బకొట్టాయి.  అప్పటి నుంచి పార్టీ మనుగడ  క్రమంగా మసకబారుతోంది. 

సొంత  తప్పిదాలే.. కొంపముంచాయా?

మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్​ వరకు బీఆర్ఎస్ పార్టీకి  ఉమ్మడి జిల్లా కంచుకోటగా ఉండేది. బాన్సువాడ సెగ్మెంట్​కు ప్రాతినిధ్యం వహించిన పోచారం శ్రీనివాస్​రెడ్డి స్పీకర్​గా, బాల్కొండకు చెందిన  వేముల ప్రశాంత్​రెడ్డి మంత్రిగావ్యవహరించగా బోధన్​, అర్బన్, రూరల్​, ఆర్మూర్​,  జుక్కల్​, కామారెడ్డి, ఎల్లారెడ్డి ( జాజుల సురేందర్​ చేరికతో)  మొత్తమంతా పార్టీ ఎమ్మెల్యేలే అధికారం చెలాయించారు.   సీఎం కేసీఆర్​ కూతురు ఎమ్మెల్సీ కవిత ఒంటి చేత్తో జిల్లా రాజకీయాలను శాసించారు.  ఆమె కనుసన్నల్లోనే ఎమ్మెల్యేలు పని చేసేవారు.

2014 లో ఎంపీగా కవిత గెలవగా..   జిల్లాలో ప్రతిపక్షం ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నాలు చేశారు. ఇతర పార్టీలకు చెందిన నేతలను, కార్యకర్తలను పార్టీలో  చేర్చుకున్నారు.  ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చినా  పార్టీ అధిష్టానం అండగా ఉండి రక్షించడంతో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంది. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి కేవలం 4,500 ఓట్ల మెజార్టీతో బయటపడగా..  స్పీకర్ గా చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తన సీనియారిటీని ఉపయోగించుకుని ఎమ్మెల్యేగా గెలిచాడు.

వీరు మినహా మిగతా ఎమ్మెల్యేలంతా చిత్తుగా ఓడిపోయారు. పార్టీ ఆవిర్భవించిన కొత్తలో 2003 జడ్పీ పీఠం కట్టబెట్టిన జిల్లా ప్రజలు బీఆర్ఎస్ కు ఉద్యమ సమయంలో ఎంతో అండదండగా నిలవగా.. 2023 లో అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 ఎంపీ ఎలక్షన్ లో కారును దూరం పెట్టారు.   బీఆర్ఎస్ అగ్ర నాయకులు చేసిన స్వయంకృతపరాధాలే పార్టీ ఓడిపోవడానికి కారణమని నాయకులు పదే పదే ఆయా మీటింగ్ లో ప్రస్తావిస్తుండటం గమనార్హం. 

ఎమ్మెల్యేల ప్రభావం నిల్​

పార్లమెంట్​ సెగ్మెంట్​ పరిధిలో బాల్కొండ, కోరుట్ల, జగిత్యాలలో ముగ్గురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలున్నా ఎంపీ ఎలక్షన్లలో  ఏ మాత్రం  ప్రభావం చూపించలేకపోయారు.  ఎమ్మెల్యేలుగా గెలవడానికి వారు పొందిన ఓట్లలో కనీసం ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్​కు సగం కూడా తీసుకురాలేకపోయారు.  మంత్రిగా పని చేసిన ప్రశాంత్ రెడ్డి బాల్కొండలో  కూడా ఓట్లు తగ్గిపోవడం బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను తెలుపుతోంది.  కేసీఆర్ కూతురు కవిత  లిక్కర్​ స్కాంలో జైలుపాలుకావడం కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది.  

పార్టీని వీడిన ప్రజాప్రతినిధులు.. 

అసెంబ్లీ ఎలక్షన్​ తర్వాత బీఆర్​ఎస్​ పార్టీ పరిస్థితి క్రమంగా దిగజారుతోంది.  ముఖ్య లీడర్లంతా కాంగ్రెస్ లో చేరగా.. ​  ఉన్న మార్క్​ఫెడ్​, డీసీసీబీ, ఐడీసీఎంఎస్ పదవులు పార్టీకి దూరమయ్యాయి.  ఎమ్మెల్సీ పదవులు నిర్వహించిన ఆకుల లలిత, డి.రాజేశ్వర్​, అరికెల నర్సారెడ్డి బీఆర్ఎస్ ను వీడారు.  బోధన్​, ఆర్మూర్​, కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిపోయాయి.  సింగిల్​ విండోతో పాటు లోకల్​ బాడీస్​లో ఉన్న బీఆర్​ఎస్​  ప్రతినిధులు అధిక శాతం మంది పార్టీని వీడి బయటకు వచ్చేశారు.  ఫిబ్రవరిలో సర్పంచ్​ పదవుల నుంచి దిగిపోయిన వారూ కూడా కారుకు గుడ్​బై చెప్పేశారు.  పరిణామాలన్నీ గ్రౌండ్​ లెవల్​లో పార్టీని చాలా వీక్​ చేశాయి.