పంటలు ఎండిపోవడం ప్రకృతి వైపరీత్యం కాదు పాలకుల వైఫల్యమే : జగదీష్ రెడ్డి

తెలంగాణలో  పంటలు ఎండిపోవడం  ప్రకృతి వైపరీత్యం కాదు పాలకుల వైఫల్యమేనని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో  రావి చెరువును స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.  నాలుగేళ్లుగా కాళేశ్వరం జలాలతో కళకళలాడిన రావి చెరువు ఎండిపోవడానికి కారణం పాలకుల నిర్లక్ష్యమేనని చెప్పారు.  ప్రభుత్వ కక్షపూరిత వైఖరినే రైతుల దుస్థితికి కారణమన్నారు.  పంటలు ఎండిపోతున్న జిల్లా మంత్రులకు సోయి, అవగాహన లేదన్నారు.  నీళ్లున్నా, కేసీఆర్ , బీఆర్ఎస్ పై కక్షతో రైతులకు కాంగ్రెస్ శిక్ష వేసిందన్నారు. 20 టీఎంసీలు ఎత్తిపోసినా ఒక ఎకరం కూడా ఎండిపోయేది కాదని చెప్పారు.  

రైతాంగానికి 2014 నాటి ముందు పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని తెలిపారు జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ తరఫున ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.  రైతుల నష్టానికి ఎండిపోయిన ప్రతి గింజకు బాధ్యులు పాలకులేని చెప్పారు.  మంత్రులు, ఎమ్మెల్యేల చేతకానితనంతోనే రైతులు బీఆర్ఎస్ నాయకుల్ని ఆశ్రయిస్తున్నారన్నారు. 

పది రోజులుగా జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కనబడటం లేదని విమర్శించారు జగదీష్ రెడ్డి.  రైతుల ఆగ్రహానికి ఎక్కడ గురవుతామోనని ముఖం చాటేస్తున్నారని విమర్శించారు.  మంత్రులకు దమ్ముంటే మొనగాళ్లు అయితే, రైతుల దగ్గరికి రావాలని..   రైతాంగానికి  ఊరటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పారు.