రుణమాఫీపై మాట తప్పిన సీఎం : ఎమ్మెల్యే హరీశ్‌‌రావు

  • తప్పైందని ఎములాడ రాజన్నను వేడుకో: హరీశ్​ 

వేములవాడ/జగిత్యాల/కోరుట్ల, వెలుగు: ఎములాడ రాజన్నపై ఒట్టుపెట్టి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్‌‌రెడ్డి.. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా మాట తప్పారని సిద్దిపేట బీఆర్ఎస్ ​ఎమ్మెల్యే హరీశ్‌‌రావు అన్నారు. సాకుల పేరుతో రుణమాఫీ సరిగా చేయలేదని రాజన్న దగ్గరికి వచ్చి తప్పయిందని అని వేడుకో అని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ- పదకొండు నెల్లలో ప్రజలు ఏం కోల్పోయారో.. ఏం కోల్పోలేదో ఆధారాలతో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్​ పాలనలో ప్రజలు ఏం పొందారో  చెప్పేందుకు మీరు సిద్ధమా అని ప్రశ్నించారు.

మంగళవారం హరీశ్​రావు వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత మీడియా సమావేశం నిర్వహించి సీఎం రేవంత్​పై ఆరోపణలు చేశారు. రేవంత్ పాలన చేపట్టాక రాష్ట్రంలో అన్ని బంద్ అయ్యాయని, స్టూడెంట్లు రోజు ఎక్కడో ఒక చోట ధర్నాలు చేస్తున్నారని, రైతు బంధు, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరలు ఆగిపోయాయన్నారు. ఆయా వర్గాలు దళిత బంధు, బీసీ బంధు, జర్నలిస్ట్ లు తమ హక్కులు కోల్పోయారని ఆరోపించారు.

‘‘రేవంత్​రెడ్డి.. ఇప్పటికైన పగలు ప్రతీకారలు మార్చిపోయి, పరిపాలనపై దృష్టి పెట్టి సీనియర్ల సలహా తీసుకో. నాలుగేండ్ల టైమ్ ఉందని నాలుగు రాళ్లు వెనకేసుకొని వెళ్తా అనుకుంటాన్నవేమో.. కానీ కేసీఆర్ వంద ఏండ్లు ముందుకు తీసుకెళ్లిన రాష్ట్రాన్ని నువ్వు వెనక్కి తీస్కపోతున్నవ్” అని హరీశ్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రైతులకు న్యాయం జరగాలని, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలగాలని రాజన్నను కోరుకున్న అని అన్నారు.

మూసీ ప్రాజెక్టుకు నిధులు ఎక్కడివి?

రైతుల రుణమాఫీకి లేని నిధులు మూసీ పునరుజ్జీవానికి ఎక్కడివని హరీశ్ ప్రశ్నించారు. ప్రభుత్వం రైతుల సమస్యలు తీర్చాలని మంగళవారం కోరుట్ల నుంచి జగిత్యాల వరకు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ చేపట్టిన పాదయాత్రలో హరీశ్​పాల్గొని మాట్లాడారు. సంజయ్ పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఇక ముందుంది సినిమా అని విమర్శించారు. సన్న వడ్లకు బోనస్, రైతు బంధు, రుణ మాఫీ ఎక్కడ పోయాయని ప్రశ్నించారు.

రేవంత్​రెడ్డి ప్రజలకు ఏమీ చేయకపోయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాత్రం తూకంలో పెట్టి కొన్నాడని ఆరోపించారు. రైతుకు కష్టం వచ్చిందని సంజయ్ పాదయాత్ర చేశాడన్నారు.  సంజయ్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం అవసరమైతే  ప్రాణాలు అర్పిస్తానని అన్నారు.