బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు ఇప్పుడు రైతులు యాదికొస్తున్నరా.?

అధికారం పోయేసరికి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలకు హఠాత్తుగా రైతులు గుర్తుకు వస్తున్నారు. పంట పొలాలు కూడా గుర్తుకు వస్తున్నాయి. గత పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలో ప్రతి సంవత్సరం వరదలు సంభవించి లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు లబోదిబోమన్నా వారి వైపు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు కన్నెత్తి చూడలేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌‌‌‌, కామారెడ్డి,  సిరిసిల్ల జిల్లాల్లో కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. వెనువెంటనే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు రంగంలోకి దిగి కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయటం మొదలుపెట్టారు. 

కేటీఆర్‌‌‌‌ ఒక అడుగు ముందుకువేసి ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీల్లో రైతుల కన్నీళ్లు ముఖ్యమంత్రికి పట్టడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. పంట దెబ్బతిన్న  ప్రతి రైతుకు నష్ట పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉంది.  పంట నష్టంపై సర్వే చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.  నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఆకాల వర్షంతో  దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి జూపల్లి కృష్ణారావు,  రాష్ట్ర  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి పరిశీలించారు. అయినా, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు కోడిగుడ్డుపై ఈకలు లాగే పని పెట్టుకున్నారు. 

గతంలో కన్నెత్తి చూడని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులు

గత  సంవత్సరం జులై నెలలో కురిసిన వర్షాలకు రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలలో  తీవ్రంగా  పంట నష్టం జరిగింది. 15 వేల ఎకరాలలో ఇసుక మేటలు వేసింది.  వేలాది విద్యుత్‌‌‌‌ స్తంభాలు, ట్రాన్స్​ఫార్మర్లు నేలకూలాయి. ఈ వరదలలో  49 మంది ప్రాణాలు కోల్పోయారు. భూపాలపల్లి జిల్లాలోని  మోరంచపల్లి గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. ఈ ఒక్క గ్రామంలోనే 13 మంది మృతి చెందారు. వరదలు వస్తాయని ఐఎండి హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో ఇంత ప్రాణ నష్టం జరిగింది. ఇండ్లలోని సామాను మొత్తం పనికిరాకుండా పోయింది.  మొత్తం రూ.4,600 కోట్లు నష్టం వాటిల్లింది. అప్పటి  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు, విద్యుత్‌‌‌‌ స్తంభాల పునరుద్ధరణకు సరిపడే నిధులు మాత్రమే విదిలించింది. గత ఏడాది మార్చిలో రాష్ట్రంలో వడగండ్ల వాన కురిసి 2.28లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ ప్రకటించింది. 2022 జులైలో వచ్చిన వరదలలో 13 లక్షల ఎకరాలలో పంటలు దెబ్బతిని రూ.3 వేల కోట్ల పంట నష్టం జరిగింది, లక్ష మంది తీవ్రంగా నష్టపోగా 38 మంది మృతి చెందారు. కానీ, అప్పటి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారు రైతులకు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. 

వరదల వెనక విదేశీ కుట్ర ఉందన్న కేసీఆర్‌‌‌‌

గతంలో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ విచిత్రంగా వరదల వెనక విదేశీ కుట్ర ఉందనే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. తన హయాంలో  అకాల వర్షాలు  కురిసినప్పుడల్లా.. అసలేమీ జరగలేదన్నట్లు వ్యవహరించిన కేసీఆర్​ 2023 జులైలో వర్షాలు కురిసినప్పుడు.. ఎన్నికలు వస్తున్నాయనే హడావుడితో  రైతులపై ప్రేమ ఒలకబోశారు. గతంలో ఎన్నడూ  రైతులకు ముఖం చూపని అప్పటి ముఖ్యమంత్రి  కేసీఆర్‌‌‌‌.. తన మంత్రులను, అధికారులను వెంటపెట్టుకొని  ఖమ్మం, మహబూబాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌ జిల్లాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు. అకాల వర్షాలకు విదేశీ కుట్ర ఉన్నట్లు అనుమానం కలుగుతున్నదని అన్నారు. 

ఫసల్​ బీమా వద్దన్నారు, తామూ బీమా ఇవ్వలేదు

2016లో  కేంద్ర ప్రభుత్వం  ప్రధానమంత్రి  ఫసల్‌‌‌‌ బీమా యోజన పథకాన్ని ప్రారంభించింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతింటే ఈ పథకం కింద రైతులకు నష్టపరిహారం అందిస్తారు. ఈ పథకం వలన రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగటం లేదని, దీనికన్నా మెరుగైన బీమా పథకాన్ని తెస్తామని చెప్పి 2019లో  దీని నుంచి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌  ప్రభుత్వం వైదొలిగింది. కానీ, ఆ తరువాత ఎటువంటి బీమా పథకాన్ని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం తేలేదు. దీనితో ప్రతి సంవత్సరం లక్షల ఎకరాల్లో అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులకు ఏవిధమైన పరిహారం అందలేదు. 2020లో  5.10లక్షల ఎకరాల్లో వరి,  7.75లక్షల ఎకరాల్లో  ఇతర పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. ఈ సహాయం కోసం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. విపత్తుల నిర్వహణ కింద కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే నిధుల్లో రూ.188కోట్లు  వాడుకోవటానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. వీటికి రాష్ట్ర  ప్రభుత్వం కొంత డబ్బులు కలిపి రైతులకు సహాయం చేస్తే ఉపయోగకరంగా ఉండేది.  కానీ,  రాష్ట్ర ప్రభుత్వం రైతులకు  ఒక్క పైసా  కూడా  పరిహారం  అందించకపోగా  కేంద్రమిచ్చిన నిధులను సైతం రైతులకు ఇవ్వకుండా ఎగనామం పెట్టింది.  

వరద బాధితులను పట్టించుకున్న పాపాన పోలేదు

వరదల వల్ల గోదావరి బేసిన్‌‌‌‌లోని జనం తీవ్రంగా గోస పడ్డారు. ఆదిలాబాద్‌‌‌‌ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు వరద సృష్టించిన బీభత్సం మాటలకు అందనిది. ఏ వైపు నుంచి ఎలాంటి సాయం ఎవరు అందిస్తారా? అని ప్రజలు దీనంగా ఎదురుచూశారు. సర్వస్వం వరదల్లో కోల్పోయిన కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూశాయి. వారివైపు కేసీఆర్‌‌‌‌గాని, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులుగాని కన్నెత్తి చూడలేదు. రోమ్​ నగరం తగలబడుతుంటే ఫిడేల్​ వాయించిన నీరో చక్రవర్తిలా కేసీఆర్​ ప్రగతిభవన్,  ఫామ్ హౌస్​లోనే జాతీయ రాజకీయాలకు చక్రం తిప్పే పనిలో ఉన్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాల పేరుతో  పశ్చిమ బెంగాల్‌‌‌‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌‌‌‌ కేజ్రీవాల్‌‌‌‌,  తమిళనాడు సీఎం స్టాలిన్‌‌‌‌  తదితర  నేతలతో  ఫోన్‌‌‌‌లో మాట్లాడుతూ రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. 

పంట నష్టపరిహారానికి ఎగనామం పెట్టిన కేసీఆర్​

వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10వేలు సహాయం చేస్తామని కేసీఆర్‌‌‌‌ ఇదే సందర్భంగా ప్రకటించారు. దీనికోసం తక్షణమే రూ.228 కోట్లు విడుదల చేస్తామని, కౌలు రైతులకు సైతం పరిహారం ఇస్తామని, పది రోజుల్లోనే సాయం అందజేస్తామన్నారు.  దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతులకు సహాయం అందిస్తున్నామని అప్పటి మంత్రులు గొప్పగా ప్రచారం చేసుకున్నారు.  కానీ, పరిహారం అందించే  సమయానికి  మాట మార్చి 2.28లక్షల ఎకరాలను 1.51లక్షల ఎకరాలకు కుదించారు. 33శాతం కంటే ఎక్కువగా పంట నష్టపోతేనే పరిహారం అందిస్తామని నిబంధన పెట్టడం వలన పరిహారం ఇచ్చే రైతుల సంఖ్య తగ్గిపోయింది. పరిహారాన్ని రూ.228 కోట్ల  నుంచి  రూ.151 కోట్లకు కుదించారు. పది రోజుల్లో పరిహారం అందిస్తామని ప్రకటించినా రైతులకు ఒక్క రూపాయి  ఇవ్వలేదు. తీరా ఎన్నికల టైమ్​ దగ్గరపడ్డాక కొన్ని నిధులు విడుదల చేసి మమ అనిపించారు.

వచ్చే ఖరీఫ్‌‌‌‌ నుంచి ఉచితంగా పంటల బీమా

వరదల కారణంగా  రైతులకు సంభవిస్తున్న నష్టాలను గుర్తించి వచ్చే ఖరీఫ్‌‌‌‌  సీజన్‌‌‌‌ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని రేవంత్‌‌‌‌రెడ్డి సర్కార్‌‌‌‌ నిర్ణయం తీసుకుంది.  రైతులపై నయా పైసా ఆర్థిక భారం పడకుండా రాష్ట్ర సబ్సిడీతోపాటు రైతుల తరఫున ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించటం రైతులకుఅతిపెద్ద ఊరట. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్‌‌‌‌ దాకా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులందరూఆ పార్టీని వీడి వెళుతున్నారు. ఎంపీ  సీట్లకు పోటీ చేసేందుకు అభ్యర్థులు వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది.  కనీసం ఒక్క సీటు అయినా గెలుస్తామా? అనే భయంబీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నాయకులను వెంటాడుతోంది. అందుకే ఈ ఎన్నికల్లో  చెప్పుకోవటానికి ఏ ఎజెండా లేక అకాల వర్షం అంశాన్ని పట్టుకొని  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కొత్త  రాజకీయం మొదలుపెట్టింది. 

- బండ్రు శోభారాణి,ఉపాధ్యక్షురాలు,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ